Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీన్ రివర్స్.. ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు అంటున్న ఐటీ దిగ్గజాలు.. ఎందుకో తెలుసా?

సీన్ రివర్స్.. ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు అంటున్న ఐటీ దిగ్గజాలు.. ఎందుకో తెలుసా?

Big TV Live 2 weeks ago

AI Layoffs: ఒరాకిల్ 30 వేల మంది.. అమెజాన్ 30 వేల మంది.. మెటా 8 వేల మంది.. బ్లాక్ ఫిన్ టెక్ 4 వేల మంది.. సిస్కో 4 వేల మంది.. అట్లాసియన్ 1,600 మంది..

క్లౌడ్‌ఫ్లేర్ 1,100 మంది.. ఇవేం లెక్కలు అనుకుంటున్నారా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఈ 5 నెలల్లో గ్లోబల్ టెక్ రంగంలో లక్షా 44 వేల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు లే ఆఫ్స్ బారిన పడ్డారు. వీటిలో ఎక్కువ శాతం ఏఐ, ఆటోమేషన్ రీ స్ట్రక్చర్ వల్లే జరిగాయ్. ఇదంతా కంపెనీలు ఏఐని బ్లైండ్ గా నమ్మి.. పెట్టుబడులు పెట్టి, మ్యాన్ పవర్ తగ్గించుకునే విషయంలో జరిగాయ్.

2026లో హ్యూమన్ స్కిల్స్‌కు డిమాండ్!

AI విషయంలో 2025కు, 2026 వచ్చే సరికి సీన్ మొత్తం మారిపోయింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తుందనుకున్న టైంలో కార్పొరేట్ రంగంలో సరికొత్త మార్పులు మొదలయ్యాయ్. పెరుగుతున్న ఏఐ ఖర్చులు.. ఆశించిన స్థాయిలో ప్రొడక్టివిటీ లేకపోవడంతో దిగ్గజ టెక్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటూ మళ్లీ ఉద్యోగుల నియామకం వైపు మొగ్గు చూపుతున్నాయన్న రిపోర్టులు ఇప్పుడు సంచలనంగా మారాయ్. ఒక్క ఏడాదిలోనే ఏఐ చుట్టూ నెలకొన్న భ్రమలు తొలగిపోయాయా అన్న చర్చ జరుగుతోంది.

టెక్ రంగంలో కొత్త చర్చ

ఏఐతో అనుకున్నంత లాభాలు లేవని కంపెనీలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోంది. ఈ విషయాలను తాజాగా కొన్ని సర్వేలు హైలైట్ కూడా చేశాయి. ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు అనడానికి తాజా రిపోర్టులు సంచలనంగా మారాయి. ఈ ఏఐ ఖర్చులు భరించలేం.. ఉద్యోగులే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 2025లో ఏఐపై ఒకలా అభిప్రాయం ఉంటే.. 2026లో మాత్రం మరోలా మారిపోయింది. ప్రొడక్టివిటీ పెరగకపోగా.. ఏఐ ఖర్చు విపరీతంగా పెరిగింది. క్లాడ్‌ను పెట్టుకునే బదులు, సమర్థుడైన ఎంప్లాయికి జీతం ఇవ్వడమే తక్కువ ఖర్చు అని పరిశ్రమలోని కొందరు నిపుణులు సూచించడం కూడా మొదలుపెట్టారు.

AIపై భారీ పెట్టుబడులు.. ఫలితాలపై సీఈఓల అసంతృప్తి

తాజాగా టెక్ కంపెనీలకు ఏఐతో ఎంత భారం పెరిగింది.. కంపెనీలు ఏమనుకుంటున్నాయన్న విషయాలపై కొన్ని రిపోర్టులు వచ్చాయి. వాటిని చూద్దాం. గార్ట్నర్ గ్లోబల్ సర్వే సుమారు 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల సీఈఓలపై ఇటీవలే ఓ సర్వే చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడ్డాయి. ఏఐ కోసం ఉద్యోగులను తీసేసిన కంపెనీల్లో ఆర్థిక పరంగా ఎలాంటి లాభాలు పెరగలేదని తేలింది. ఏఐ ద్వారా బడ్జెట్ ఆదా అవ్వొచ్చు కానీ కంపెనీకి లాభాలు రావాలంటే మళ్లీ హ్యూమన్ ఇన్వెస్ట్‌మెంట్ తప్పనిసరి అని ఈ రిపోర్ట్ అలర్ట్ ఇచ్చింది. అటు G-P ఎగ్జిక్యూటివ్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం.. 73% మంది బిజినెస్ లీడర్లు తమ ఏఐ పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఒప్పుకున్నారు.

AI అసలు సామర్థ్యంపై ప్రశ్నలు

MIT – హార్వర్డ్ బిజినెస్ రివ్యూ స్టడీస్ ప్రకారం.. ఏఐ టూల్స్ ద్వారా వస్తున్న అవుట్‌పుట్‌లో క్వాలిటీ లోపించడం వల్ల ఉద్యోగులు ఆ తప్పులను సరిదిద్దడానికే ఎక్కువ టైం వృధా చేస్తున్నారని తేలింది. మరికొన్ని రిపోర్టుల ప్రకారం ఏఐ సాధించిన ప్రొడక్టివిటీలో 40% కేవలం ఎర్రర్లను సరిచేయడానికే సరిపోతోందట. ఏఐ వాడకం విషయంలో కంపెనీలు వెనకడుగు వేయడానికి ప్రధాన కారణాలు ఏఐ బిల్లులు చుక్కల్ని తాకుతుండడమే. ఉద్యోగుల శాలరీస్ కంటే ఏఐ మోడల్స్ నిర్వహణ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎన్విడియా వంటి చిప్‌ల కొనుగోలు ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ప్రముఖ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఉబెర్ వంటివి తమ డెవలపర్లకు ఇచ్చిన క్లాడ్ కోడ్ ఏఐ లైసెన్సు ఖర్చులు భరించలేక వెనక్కు తగ్గుతున్నాయి. మనుషుల కంటే ఏఐ మెయింటెనెన్స్ ఖరీదైనదిగా మారుతోందని కంపెనీలు గ్రహిస్తున్నాయి.

క్లాడ్ కోడ్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై

మైక్రోసాఫ్ట్ విషయమే చూద్దాం. క్లాడ్ కోడ్ లైసెన్సులను రద్దు చేసుకుంటోంది ఈ కంపెనీ. అంతర్జాతీయ టెక్ జర్నల్ ‘ది వెర్జ్’ ఈ విషయంపై ఇటీవలే రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ కోడ్ లైసెన్సులను జూన్ 30 నాటికి పూర్తిగా నిలిపివేస్తోంది. ఈ సంచలన నిర్ణయం వెనుక చాలా కారణాలున్నాయ్. మైక్రోసాఫ్ట్ గతేడాది డిసెంబర్‌లో ప్రయోగాత్మకంగా తమ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లకు క్లాడ్ కోడ్ యాక్సెస్ ఇచ్చింది. అయితే సాంప్రదాయ సాఫ్ట్‌వేర్‌లలా కాకుండా, ఏఐ టూల్స్ వాడకం పెరిగేకొద్దీ వాటి టోకెన్ల బిల్లింగ్ ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఈ టూల్‌ను విపరీతంగా వాడటంతో కంపెనీ కేటాయించిన యాన్యువల్ ఏఐ బడ్జెట్ కేవలం కొన్ని నెలల్లోనే ఖాళీ అయిపోయింది. క్లాడ్ కోడ్ వాడకం పెరగడం వల్ల మైక్రోసాఫ్ట్ సొంతంగా అభివృద్ధి చేసిన గిట్ హబ్ కో పైలట్ వాడకం కంపెనీలోనే తగ్గిపోయింది. బయటి కంపెనీకి భారీగా బిల్లులు కట్టడం కంటే, తమ సొంత టూల్‌ను వాడుకుంటే డేటా సెంటర్ ఖర్చులు మిగులుతాయని, పైగా తమ సొంత ప్రొడక్ట్ మరింత మెరుగవుతుందని మైక్రోసాఫ్ట్ భావించింది.

AI ఖర్చులతో ఐటీ దిగ్గజాలకు షాక్

ఇది కేవలం మైక్రోసాఫ్ట్ సమస్య మాత్రమే కాదు. పెరుగుతున్న ఏఐ ఖర్చు ఒక్క మైక్రోసాఫ్ట్‌ను మాత్రమే కాదు ఐటీ సెక్టార్ మొత్తాన్ని కుదిపేస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఉబర్ కూడా తమ 5 వేల మంది ఇంజనీర్ల కోసం క్లాడ్ కోడ్ వాడగా, ఒక్కో ఇంజనీర్ ఏఐ ఏపీఐ ఖర్చు నెలకు 500 నుంచి 2 వేల డాలర్ల వరకు దాటింది. దీనివల్ల ఉబర్ సంస్థ 2026 సంవత్సరం కోసం అనుకున్న 3.4 బిలియన్ డాలర్ల ఏఐ బడ్జెట్‌ను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తిగా ఖర్చు చేసేసి చేతులెత్తేసింది. ఈ విషయాన్ని ఉబర్ సీఓఓ, సీటీఓ ప్రకటించారు కూడా. ఏఐ వాడకం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఉత్పాదకత పెరుగుదల కనిపించలేదని హైలైట్ చేశారు ఉబర్ ఉన్నతాధికారులు. సో మైక్రోసాఫ్ట్, ఉబర్‌లలో బడ్జెట్ అంచనాలు తలకిందులు కావడం ఒక మార్పుకు సంకేతంగా కనిపిస్తున్నట్లే లెక్క.

AIపై కొత్త సందేహాలు

ఏఐ రాకతో పని వేగం పెరిగినట్లు కనిపిస్తున్నా, బిజినెస్ వాల్యూ పెరగడం లేదు. జి-పి నివేదికలోనూ 88% మంది ఎగ్జిక్యూటివ్‌లు తమ ఉద్యోగులు ఏఐ టూల్స్ వాడుతున్నా.. దానివల్ల కంపెనీకి అదనపు లాభం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అటు కోడింగ్ టూల్స్ ఇచ్చే సమాచారంలో తప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. రిపోర్టుల ప్రకారం.. 69% మంది ఉద్యోగులు ఏఐ చేసిన పనిని మళ్లీ చెక్ చేయడానికి, అప్‌డేట్ చేయడానికి తమ టైంను వెచ్చించాల్సి వస్తోంది.

AI హైప్ వెనుక అసలు ఖర్చు

అంటే ఏఐ పనిని పర్యవేక్షించడానికి మళ్లీ మనుషులే కావాలన్న మాట. వీటికి తోడు ఏఐ కోసం భారీ లేఆఫ్స్ చేయడం వల్ల కంపెనీల్లో మిగిలిన ఉద్యోగులలో మానసిక ఆందోళన పెరిగిపోయింది. ఫోర్బ్స్ ప్రకారం.. ఇలాంటి ఆందోళనల వల్ల ఉద్యోగుల ప్రొడక్టివిటీ దెబ్బతిని, కంపెనీలు తమ వార్షిక బడ్జెట్‌లో 34% నష్టపోతున్నాయంటోంది. సో ఓవరాల్ గా చూస్తే.. పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలే ఏఐ బిల్లులను భరించలేక వెనకడుగు వేస్తుండటం, మార్కెట్లో ఏఐ ఎకనామిక్స్ పై జరుగుతున్న చర్చ పెను మార్పులకు దారి తీయబోతోందా అన్నది కీలకంగా మారుతోంది.

IT కంపెనీలకు కొత్త తలనొప్పి

అంతా బాగుంది అనుకుంటే.. సీన్లు రివర్స్ అవుతున్నాయ్. ఏఐ టూల్స్ అందిస్తున్న కంపెనీలకు కూడా ఖర్చులు తడిసిమోపెడవుతుండడంతో బిల్లింగ్ సిస్టమ్ మార్చేశాయ్. దీంతో సర్వీస్ పొందుతున్న కంపెనీలకూ ఏఐ ఒక గుదిబండగా మారుతోంది. ఏఐ కంపెనీలు సాధారణ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో కాకుండా టోకెన్ ఆధారిత బిల్లింగ్ విధానాన్ని వాడుతున్నాయి. ఐటీ పరిశ్రమలో ఇదొక సైలెంట్ బడ్జెట్ కిల్లర్ గా మారింది.

AI టోకెన్లు అంటే ఏమిటి..?

ఏఐ మోడల్స్ మనుషుల భాషను నేరుగా అర్థం చేసుకోలేవు. అవి మనం ఇచ్చే సమాచారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకుంటాయి. ఈ ఒక్కో ముక్కను టోకెన్ గా చెబుతారు. ఒక టోకెన్ అంటే సుమారుగా ఒక పదం లోని 4 అక్షరాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదంలో దాదాపు 2 నుండి 3 టోకెన్లు ఉంటాయి. తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో అక్షరాల్లో ఒత్తులు దీర్ఘాలు ఇలాంటివి ఉండడం వల్ల ఇంగ్లీష్ కంటే ఎక్కువ టోకెన్లు ఖర్చవుతాయన్న మాట. ఇన్‌పుట్ టోకెన్లు అంటే ఒక కంపెనీ ఉద్యోగి ఏఐకి ఇచ్చే ప్రశ్న, డేటా లేదా కోడింగ్ ఫైల్స్ పరిమాణం. అవుట్‌పుట్ టోకెన్లు అంటే ఆ ప్రశ్నకు సమాధానంగా ఏఐ జనరేట్ చేసే కోడ్, టెక్స్ట్ లేదా రిపోర్ట్ సైజ్ అన్న మాట. అవుట్‌పుట్ టోకెన్ల వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సమాధానం వెతకడానికి ఏఐ డేటా సెంటర్లు ఎక్కువ ప్రాసెసింగ్ పవర్‌ను వాడాల్సి వస్తుంది.

కంపెనీలకు కనిపించని ఖర్చుల షాక్

టెక్ కంపెనీలు సాధారణంగా ‘పర్ మిలియన్ టోకెన్స్’ లెక్కన చెల్లిస్తాయి. మైక్రోసాఫ్ట్, ఉబెర్ వంటి కంపెనీల బడ్జెట్ చేతులు దాటిపోవడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయ్. ఆధునిక ఏఐ మోడల్స్ ఒకేసారి వేలాది లైన్ల సాఫ్ట్‌వేర్ కోడ్‌ను చదవగలవు. ఒక డెవలపర్ ఒక చిన్న మార్పు కోసం పూర్తి కోడ్ ఫైల్‌ను ఏఐకి పంపినప్పుడు, ప్రతిసారీ లక్షలాది ఇన్‌పుట్ టోకెన్లు ఖర్చవుతాయి. ప్రస్తుత ఏఐ టూల్స్ కేవలం ప్రశ్న-జవాబులతో ఆగవు. ఒక పని పూర్తి కావడానికి అవి అంతర్గతంగా పదే పదే ఆలోచిస్తూ వేల టోకెన్లను స్వయంగా వాడుకుంటాయి. దీనివల్ల కంపెనీలకు తెలియకుండానే బిల్లు బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిగిపోతుంది. వేలాది మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లు రోజుకు వందల సార్లు కోడ్ చెక్ చేయడానికి ఏఐని వాడటం వల్ల రోజువారీ బిల్లు ఊహించని స్థాయికి చేరుకుంటుంది.

కంపెనీల ఖర్చుల అసలు కారణం ఇదే..

మార్కెట్లో దొరికే ప్రైమరీ ఏఐ మోడల్స్ ధర ఒక మిలియన్ టోకెన్లకు 0.04 డాలర్లు ఉంటే, అత్యంత అధునాతన రీజనింగ్ మోడల్స్ ధర 180 డాలర్ల వరకు ఉంటోంది. ఉద్యోగులకు ఏ మోడల్ వాడాలో క్లారిటీ లేకపోవడం వల్ల, ఒక సాధారణ ఈమెయిల్ రాయడానికి లేదా చిన్న కోడ్ చెక్ చేయడానికి కూడా అత్యంత ఖరీదైన ఏఐ ఇంజన్లను వాడేస్తున్నారు. ఇది కంపెనీల బడ్జెట్ ను దెబ్బతీస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధంలో… ఇరాన్ ప్రయోగించిన తక్కువ ఖర్చు చిన్న డ్రోన్లకు చెక్ పెట్టేందుకు అమెరికా పెద్ద ఇంటర్ సెప్టార్లను వాడింది. అలాగే ఇదన్న మాట. సో ఒకర్ని చూసి మరొకరు ఏఐ బిల్లుల్ని పెంచేస్తున్నాయి. గూగుల్ ఇటీవల తన యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే, మే 20న గూగుల్ జెమినై వినియోగదారులకు షాక్ ఇచ్చింది.

ప్రశ్నల లిమిట్‌కు గుడ్‌బై

ఇప్పటివరకు ఉన్న రోజుకు ఇన్ని ప్రశ్నలు అనే లిమిట్ పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో కంప్యూట్-ఆధారిత వినియోగ పరిమితులను గూగుల్ ప్రవేశపెట్టింది. అంటే మీ ప్రశ్నలను కేవలం కౌంట్ చేయకుండా, ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి గూగుల్ డేటా సెంటర్లలోని సూపర్‌ కంప్యూటర్లు ఎంత శక్తిని వాడుకున్నాయి అనే దాని ఆధారంగా మీ లిమిట్ ఖర్చవుతుంది. జెమినిని వాడుతున్న కొద్దీ మీ వాడకం పర్సంటేజ్ రూపంలో పెరుగుతుంది. ఈ లిమిట్ ప్రతి 5 గంటలకు ఒకసారి రిఫ్రెష్ అవుతుంది. 5 గంటల లిమిట్ రిఫ్రెష్ అవుతున్నప్పటికీ, మీరు ఒకే వారంలో విపరీతంగా వాడేస్తే మీ వీక్లీ లిమిట్ లాక్ అయిపోతుంది.

గూగుల్‌పై నెటిజన్ల ఫైర్

సో గూగుల్ తెచ్చిన ఈ మార్పును నెటిజన్లు, డెవలపర్లు తప్పుబడుతున్నారు. గూగుల్ చేసిన ఈ పనిని మొదట ఆశ చూపి తర్వాత మోసం చేయడంగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. టెక్ విశ్లేషకుల ప్రకారం.. గూగుల్ సొంతంగా అత్యంత చౌకైన TPU చిప్స్ ఇన్ఫ్రాను కలిగి ఉన్నప్పటికీ, విపరీతమైన ఏఐ ట్రాఫిక్ డేటా సెంటర్ ఖర్చులను భరించలేకనే కస్టమర్లపై ఇలాంటి భారం వేస్తోందంటున్నారు. సో అన్ని ఏఐ టూల్స్ ఇస్తున్న కంపెనీలది ఇదే పరిస్థితి.

ఉద్యోగుల పనితీరుకు కొత్త కొలమానం

వీటికి తోడు అటు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరును వారు ఎంత ఏఐని వాడుతున్నారు అనే గ్రాఫ్‌ల ఆధారంగా అంచనా వేయడం ప్రారంభించాయి. దీంతో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి, చిన్న చిన్న పనులకు కూడా కావాలనే పెద్ద పెద్ద ప్రాంప్ట్‌లు ఇస్తూ కంపెనీ ఏఐ రిసోర్సులను వృధాగా వాడుతున్నారు. దీంతో వర్క్ క్వాలిటీ పెరగకపోగా, కంపెనీలకు టోకెన్ బిల్లులు మాత్రం కొండలా పేరుకుపోతున్నాయ్. ప్రస్తుతం కంపెనీలు వాడుతున్న ఏఐ ఏజెంట్లు ఒక సమస్యను పరిష్కరించడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకదానితో ఒకటి వందల సార్లు సంభాషించుకుంటాయి.

అమ్మబాబోయ్.. ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

కంపెనీలకు భారీ షాక్

ఒకవేళ కోడింగ్‌లో ఏదైనా తప్పు వస్తే, ఆ ఏఐ ఏజెంట్లు లూప్‌ లో చిక్కుకుపోయి, రాత్రి పగలు తేడా లేకుండా కంపెనీకి తెలియకుండానే కోట్లాది టోకెన్లను కన్జ్యూమ్ చేసేస్తున్నాయి. దీంతో కంపెనీ సర్వర్ బిల్లులు ఊహించనంతగా పెరిగిపోతున్నాయి. చెప్పాలంటే క్లౌడ్ స్టోరేజ్ లాగే ఏఐ కూడా ఎంత వాడితే అంత బిల్లు రూపంలో కంపెనీల బడ్జెట్‌లను ఖాళీ చేస్తోంది. గోల్డ్‌మన్ శాక్స్ టెక్ నివేదికల ప్రకారం.. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఇచ్చే ఏడాది జీతం కంటే, ఆ ఇంజనీర్ రోజూ వాడే ఏఐ టోకెన్ల ఖర్చులు 24 రెట్లు పెరిగే ప్రమాదం ఉంది. క్లిష్టమైన ప్రాజెక్టులలో అడ్వాన్స్‌డ్ మోడల్స్ వాడినప్పుడు ఒక డెవలపర్ రోజుకు సగటున 13 నుంచి 30 డాలర్ల వరకు టోకెన్ల రూపంలో కంపెనీ డబ్బును ఖర్చు చేస్తున్నాడు. సో ఈ లెక్కలన్నీ కలిసి కంపెనీల బడ్జెట్ ను కాపాడకపోగా.. ఏఐ కారణంగా పెంచుతోంది.

టెక్ కంపెనీల కొత్త బడ్జెట్ ప్లాన్

ఏఐ కంపెనీలు ఎలాగైతే బిల్లులు పెంచుతున్నాయో.. అదే సమయంలో టెక్ సంస్థలు కూడా ఏఐ టూల్స్‌ను ఉద్యోగులకు అన్ లిమిటెడ్ గా వాడనివ్వడం లేదు. బడ్జెట్‌ను అదుపులో ఉంచడానికి కొత్త విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగికి లేదా ప్రాజెక్ట్ టీమ్ కు నెలకు ఇన్ని ఏఐ క్రెడిట్లు మాత్రమే వాడుకోవాలనే పరిమితిని విధిస్తున్నారు. ఒకసారి ఆ కోటా అయిపోతే, ఉద్యోగి మేనేజర్ అనుమతితో రీఛార్జ్ చేయించుకోవాలి. అటు చిన్న చిన్న పనులకు అత్యంత చౌకైన చిన్న ఏఐ మోడల్స్ వాడేలా సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను మారుస్తున్నారు.

టెక్ కంపెనీల కొత్త వ్యూహాలు

అత్యంత సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్ పనులకు మాత్రమే ఖరీదైన మోడల్స్ వాడేలా కంట్రోల్ చేస్తున్నారు. ఏఐ ఏజెంట్లు బ్యాక్‌గ్రౌండ్‌లో నాన్ స్టాప్ లూప్‌లలో చిక్కుకుని బిల్లులు పెంచకుండా ఉండటానికి, ఐటీ టీమ్స్ కిల్ స్విచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఏదైనా ఒక ప్రాంప్ట్ నిర్ణీత టోకెన్ల పరిమితి దాటితే ఆ టాస్క్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుందన్న మాట. థర్డ్ పార్టీ కంపెనీలకు టోకెన్ బిల్లులు కట్టే బదులు, మెటా లామా వంటి ఓపెన్ సోర్స్ మోడల్స్‌ను కంపెనీలు తమ సొంత సర్వర్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాయి. దీనివల్ల వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే ఉంటుంది, టోకెన్ బిల్లుల భయం ఉండదు.

AI స్టార్టప్‌లకు కొత్త షాక్

కంపెనీలు బడ్జెట్ విషయంలో కఠినంగా మారడం వల్ల, కేవలం టోకెన్ల రీసెల్లింగ్ పై ఆధారపడి నడిచే వేలాది ఏఐ స్టార్టప్‌ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో మాది ఏఐ ప్రొడక్ట్ అని చెబితేనే స్టార్టప్ లకు ఫండింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లు, క్లయింట్లు కచ్చితమైన ప్రొడక్టివిటీ స్పష్టమైన బిల్లింగ్ మోడల్ ఉంటేనే స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు.

AI స్టార్టప్‌ల కొత్త ప్లాన్స్!

టోకెన్ బిల్లింగ్ భయంతో కస్టమర్లు దూరం పోకుండా ఉండటానికి ఏఐ స్టార్టప్‌లు ఫిక్స్‌డ్ ప్లస్ యూసేజ్ విధానాన్ని తెస్తున్నాయి. అంటే బేసిక్ ఫీచర్లకు ఒకే ఫిక్స్‌డ్ మంత్లీ చార్జ్, హెవీ యూసేజ్‌కు మాత్రమే అదనపు టోకెన్ చార్జ్ వేస్తున్నాయి. అన్ని పనులు చేసే ఏఐ కంటే, కేవలం ఒకే రంగానికి అంటే లీగల్ అసిస్టెంట్, మెడికల్ కోడింగ్, ట్యాక్స్ మేనేజ్‌మెంట్ వంటి వాటికి సరిపోయే స్పెషలైజ్డ్ ఏఐ స్టార్టప్‌లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఇవి తక్కువ టోకెన్లతో ఎక్కువ కచ్చితమైన పనిని అందిస్తాయి.

ఉద్యోగాల భవిష్యత్తుపై శామ్ ఆల్ట్‌మన్ కామెంట్స్

సో ఏఐ ఎంత అభివృద్ధి చెందినా దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి రాదని ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తాజాగా ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంతకు ముందు తాను భయపడినంతగా ఈ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ ఉద్యోగాలను బ్రేక్ చేయలేదన్నారు. సిడ్నీలో జరిగిన కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సదస్సులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆల్ట్‌మన్ ఏఐ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

చాట్GPT ప్రభావంపై ఓపెన్AI CEO కీలక అంగీకారం

2022లో చాట్‌ జీపీటీని ప్రారంభించినప్పుడు చేసిన సాంకేతిక అంచనాలు నిజమయ్యాయని, అయితే దాని వల్ల సమాజం, ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం విషయంలో తప్పుగా అంచనా వేశామని ఆల్ట్‌మన్‌ ఒప్పుకున్నారు. ఈ విషయంలో తన అంచనా తప్పినందుకు చాలా సంతోషిస్తున్నాననని, ఇప్పటికే చాలా వరకు ప్రారంభ స్థాయి వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు పోతాయని భావించానని, వాస్తవానికి అలా జరగలేదన్నారు. గతంలో చేసిన హెచ్చరికలతో ఐటీ మార్కెట్‌లో కొంత భయాందోళన రేగిన మాట నిజమేనన్నారు.

టెక్ ప్రపంచంలో కొత్త రియాలిటీ చెక్

అమెజాన్, హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్‌ చార్టర్డ్, సీబీఏ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే తమ సంస్థల్లోని కొన్ని విభాగాల ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఇదే ట్రెండ్ మార్కెట్‌లో కొనసాగుతోంది. అయితే ఏఐ ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నా, ఉద్యోగాల్లో ఉండే హ్యూమన్ కోఆర్డినేషన్ ను ఏ టెక్నాలజీ కూడా భర్తీ చేయలేదని ఆల్ట్‌మన్‌ చెప్పడం ఐటీ కంపెనీలకు కనెక్ట్ అవుతోంది. ఏదైనా కంపెనీకి లాభాలు రావాలి, తక్కువ టైంలో పని జరగాలి, కచ్చితత్వం ఉండాలన్న కోరికలు ఉంటాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరగాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఏఐ బిల్లులతో అసలు కంటే ఎక్కువ ఖర్చు అవుతోంది. అనుకున్నంత ప్రొడక్టివిటీ రావట్లేదు. ఇదే సమస్యగా మారుతోంది.

IT రంగంలో కొత్త దశ ప్రారంభం!

ఓవరాల్ గా చూస్తే ఏఐ ఇండస్ట్రీ ఇప్పుడు హైప్ నుంచి రియాలిటీ లోకి అడుగుపెడుతోంది. టోకెన్ నష్టాలు టెక్ రంగానికి ఒక రకమైన క్రమశిక్షణను నేర్పుతున్నాయ్. దీంతో ఏఐ టెక్నాలజీ ముగిసిపోయినట్లు కాదు. కానీ మరింత పొదుపుగా, సమర్థంగా, హ్యూమన్ రీసోర్సెస్ తో కలిసి పనిచేసేలా మార్పు చెందుతుంది. సో టెక్ విశ్లేషకుల ప్రకారం.. ఐటీ ఇండస్ట్రీలో ఏఐ హైప్ తగ్గి ప్రాక్టికల్ మైండ్‌సెట్ మొదలైనట్లే. కంపెనీలు ఇప్పుడు మనుషులను తీసేసి పూర్తిగా ఏఐని పెట్టే వ్యూహాన్ని పక్కనపెట్టి, మనుషులకు ఏఐ ట్రైనింగ్ ఇచ్చి ప్రొడక్టివిటీ పెంచడం అన్న సరికొత్త రూట్ లో వెళ్లే ఆలోచన చేస్తున్నాయి. మనుషుల క్రియేటివిటీ, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి ఆల్టర్నేట్ లేదని మార్కెట్ మళ్లీ రుజువు చేస్తోంది.

రేవంత్ రెడ్డితో విందులా?.. టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమే- రోజా

Story by: Anup, Big Tv

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live