Streenidhi Loans: స్వేచ్ఛ బ్యూరో: స్త్రీనిధితో 32 లక్షల మందికి పైగా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు అందించడం గొప్ప విజయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
స్త్రీనిధి అసలు సిసలు మాహిళా బ్యాంక్ అని కొనియాడారు. తెలంగాణ మహిళలకు స్త్రీనిధి ఒక నమ్మకమైన బ్యాంక్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ స్త్రీనిధి మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. ప్రజా భవన్‌లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం నిర్వహించారు.
మంత్రి సీతక్క అభినందనలు
స్త్రీనిధి ఉద్యోగులంతా కలిసి స్త్రీనిధి స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకోగా మంత్రి సీతక్క అభినందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సంఘం ఉద్యోగులను ఐక్యం చేయడమే కాకుండా, హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ప్రయోజనాలతోపాటు లక్షలాది మహిళల ఆర్దిక సంక్షేమాన్ని కాపాడాలని కోరారు. రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్దేశించిందన్నారు. స్త్రీనిధి సంస్థ మన ఇల్లు లాంటిది.. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయన్నారు.
ముందుకు సాగుతున్న స్త్రీనిధి
2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీనిధి, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోందన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే స్త్రీనిధి ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 18 శాతానికే పరిమితమైందని, అభివృద్ధి చెందిన దేశాల్లో అది 40 శాతానికి చేరుకుందని పేర్కొన్నారు.
మహిళలకు అండగా ప్రభుత్వం
తెలంగాణ మహిళలు కూడా ఆ స్థాయికి ఎదగాలని, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు. మాది ఉద్యోగ అనుకూల ప్రభుత్వం అని, స్త్రీనిధిలో ఒక్కరిని కూడా తొలగించలేదని, ఇప్పటికే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని, సెర్ప్‌లో వంద శాతం బదిలీలు నిర్వహించామన్నారు. స్త్రీనిధిని బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం తప్ప, ఎవరి ఉద్యోగాలను తొలగించడం కాదని పేర్కొన్నారు.స్త్రీనిధి మహిళల కోసం, మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థ అని, దీనిని కాపాడుకుంటూ మహిళల ఆర్థిక అభివృద్ధికి మరింత బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, స్త్రీనిధి ఉద్యోగులు పాల్గొన్నారు.

