GHMC Street Lights: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అధికారులు కఠిన నిబంధనలను రూపకల్పన చేస్తున్నారు.
గతంలో ఈ స్ట్రీట్ లైట్ల నిర్వహణను జీహెచ్ఎంసీ ప్యాకేజీలుగా కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహిస్తుండగా, అనేక రకాల లోపాలు తలెత్తటంతో 2017లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్( ఈఈఎస్ఎల్) సంస్థకు కూడా అప్పగించినా, అధికారులు ఆశించిన స్థాయిలో నిర్వహణ సాగలేదు.
స్ట్రీట్ లైట్లపై పెరుగుతున్న ఫిర్యాదులు
పైగా రోజువారీగా స్ట్రీట్ లైట్ల పై వస్తున్న ఫిర్యాదులు కూడా పెరగటం, ఈఈఎస్ఎల్ సంస్థ మరమ్మతుల కోసం కనీసం బఫర్ కోటాను కూడా మెయింటేన్ చేయకపోవటాన్ని గుర్తించిన గత పాలక మండలి, అప్పటి కమిషనర్ ఈఈఎస్ఎల్ ను స్ట్రీట్ లైట్ల బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఢిల్లీ, ఔటర్ రింగ్ రోడ్డు స్ట్రీట్ లైట్ల నిర్వహణకు అనుసరిస్తున్న ఆధునిక విధానంతో కూడిన మెయింటనెన్స్ చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
మూడు కార్పొరేషన్ల స్ట్రీట్ లైట్లు
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల పరిధిలోనున్న సుమారు 7 లక్షల 65 వేల స్ట్రీట్ లైట్ల నిర్వహణకు ఒకే విధానాన్ని తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. పైగా మూడు కార్పొరేషన్ల పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణకు టెండర్ల ప్రక్రియతో పాటు మొత్తం పర్యవేక్షణ బాధ్యతలను కూడా జీహెచ్ఎంసీకే అప్పగించినట్లు తెలిసింది. మిగిలిన సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లు కొత్తగా ఏర్పడినందున, స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీకే కట్టబెట్టినట్లు సమాచారం. కొత్త నిర్వహణ సంస్థలను సమకూర్చుకునే వరకు ఈఈఎస్ఎల్ స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను చేపట్టేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
నిర్వహణ నిబంధనలపై కసరత్తు
మొత్తం కోర్ అర్బన్ రీజియన్ లోని స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ కు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు, ఢిల్లీ లో తరహా సరి కొత్త మెయింటనెన్స్ విధానాన్ని తీసుకురావటంతో పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఏజెన్సీలు జవాబుదారిగా వ్యవహారించేలా అధికారులు మెయింటనెన్స్ అగ్రిమెంట్ నిబంధనలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు గాను మూడు మున్సిపల్ కమిషనర్ల పరిధిలోని చీఫ్ ఇంజనీర్లతో ఓ కమిటీ వేసి, ఎలాంటి నిబంధనలు, షరతులు అగ్రిమెంట్ లో పెట్టాలన్న విషయంపై ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు తెలిసింది.
వెలగని స్ట్రీట్ లైట్లపై కఠిన చర్యలు
ముఖ్యంగా వెలిగే స్ట్రీట్ లైట్ కు కరెంటు బిల్లుతో పాటు మెయింటనెన్స్ బిల్లులను చెల్లించేలా ఈ సరి కొత్త మెయింటనెన్స్ నిబంధనలు త్వరలోనే కొలిక్కి రానున్నట్లు తెలిసింది. స్ట్రీట్ లైట్లు వెలగటం లేదంటూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తే, నిర్వహణ ఏజెన్సీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై కూడా ముగ్గురు సీఈలతో కూడిన కమిటీ చర్చించి, పలు నిబంధనలను సిఫార్సు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా నిర్వహణ బాధ్యతలు చేపట్టే ఏజెన్సీలను పూర్తి స్థాయిలో బాధ్యులను చేసేలా మెయింటనెన్స్ అగ్రిమెంట్ కండీషన్లు తయారు చేస్తున్నట్లు తెలింది. వెలగని స్ట్రీట్ లైట్లకు రోజు వారీగా విధించే జరిమానాలను కూడా ఖరారు చేయాల్సి ఉందన్న విషయం తెలిసింది.
వెలగని లైట్లకు రోజువారీ ఫైన్లు
ఒక్కో స్ట్రీట్ లైట్ వారీగా జరిమానాలు, సెంట్రల్ కమాండ్ మానిటరింగ్ సెంటర్ (సీసీఎంఎస్ ) కు అనుసంధానంగా ఉన్న స్ట్రీట్ లైట్లలో వెలగని స్ట్రీట్ లైట్లను లెక్కించి, ఇందులో లోపాలు తలెత్తితే రోజువారీగా నిర్వహణ ఏజెన్సీలకు ఎంత వరకు జరిమానా విధించాలన్న విషయంపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మొత్తఆం 7 లక్షల 65 వేల స్ట్రీట్ లైట్లకు టెండర్లను చేపట్టాలని యోచిస్తుంది. ఈ స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియకు కొద్ది నెలల క్రితమే సర్కారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మెయింటనెన్స్ అగ్రిమెంట్ లో కండీషన్లను రూపొందించటంపై అధికారులు దృష్టి సారించారు.
జీహెచ్ఎంసీ ప్లాన్
మూడు రకాల మెయింటనెన్స్ విధానానికి టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇండివిజ్యువల్ లుమినార్ కంట్రోల్ (ఐఎల్ సీ), లుమినార్ కంట్రోల్ యూనిట్(ఎల్ సీ యూ)ల పద్దతిన ఇప్పటికే పేరుగాంచిన నిర్వహణ ఏజెన్సీల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)లను స్వీకరించిన జీహెచ్ఎంసీ ఈ రెండు విధానాలపై టెండర్ల ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఫాతిమా కాలేజీపై హైడ్రా సంచలన నిర్ణయం.. సర్వే తర్వాతే అసలు యాక్షన్!

