Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టైర్లు బ్లాక్ కలర్‌ లోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా?

టైర్లు బ్లాక్ కలర్‌ లోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా?

Big TV Live 3 days ago

Hidden Reason Of Tyres Color:మన రోజూ కార్లు, బైకులు చూస్తూనే ఉంటాం. రకరకాల రంగుల్లో ఆకట్టుకుంటాయి. వాటి టైర్లు మాత్రం నల్ల రంగులోనే ఉంటాయి. ఎందుకు ఇతర రంగుల్లో ఉండవు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా?

అయితే, ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం.. టైర్ నల్లరంగు వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఒకప్పుడు తెలుపు రంగు.. ఇప్పుడు నలుపు రంగు

నిజానికి టైర్ రంగు అనేది కేవలం స్టైల్ కోసం ఉపయోగించరు. దాని వెనుక సైన్స్, భద్రత, మన్నిక లాంటి కీలకమైన అంశాలు ఉన్నాయి. తొలి నాళ్లలో తయారైన టైర్లు నల్లగా ఉండేవి కావు. 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో తయారైన టైర్లు సహజ రబ్బరుతో తయారయ్యేవి. సహజ రబ్బరు వైట్ లేదంటే మిల్క్ వైట్ లో ఉండటంతో ఆ టైర్లు కూడా లేత రంగులోనే కనిపించేవి. అయితే, ఆ టైర్లు చాలా త్వరగా అరిగిపోయేవి. ఎక్కువకాలం మన్నిక ఇచ్చేవి కాదు. వేడి, రోడ్డు ఘర్షణను తట్టుకోలేక పాడయ్యేవి.

టైర్ల బలం కోసం కార్బన్ బ్లాక్ ఉపయోగం

టైర్లను బలంగా తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు, తయారీ సంస్థలు కొత్త మార్గాలు వెతికాయి. అప్పుడే కార్బన్ బ్లాక్ అనే పదార్థాన్ని రబ్బరులో కలపడం ప్రారంభించారు. ఇది నల్లటి పొడి లాంటి పదార్థం. పెట్రోలియం ఉత్పత్తులను ప్రత్యేక పద్ధతిలో మండించడం ద్వారా దీనిని తయారు చేస్తారు. కార్బన్ బ్లాక్‌ ను రబ్బరులో కలపడం వల్ల టైర్లు చాలా బలంగా మారాయి. రోడ్డు మీద ఏర్పడే ఒత్తిడి, వేడి, బరువును తట్టుకునే శక్తి పెరిగింది. ముఖ్యంగా వాహనం వేగంగా వెళ్తున్నప్పుడు టైరు, రోడ్డుకు మధ్య ఘర్షణ వల్ల ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి టైర్లను త్వరగా దెబ్బతీస్తుంది. కార్బన్ బ్లాక్ ఆ వేడిని నియంత్రించి టైరు ఎక్కువకాలం మన్నేలా చేస్తుంది. అంతేకాదు, సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రావయొలెట్ కిరణాలు, గాలిలో ఉండే ఓజోన్ లాంటి పదార్థాలు రబ్బరును క్రమంగా చెడిపోయేలా చేస్తాయి. టైర్లపై చిన్న చిన్న పగుళ్లు రావడానికి ఇవే కారణం. కార్బన్ బ్లాక్ ఈ ప్రభావాన్ని తగ్గించి టైర్లను రక్షిస్తుంది.

టైర్లను ఇతర రంగుల్లో తయారు చెయ్యొచ్చా?

టైర్లను ఇతర రంగుల్లో తయారు చేయలేరా? అంటే చేయొచ్చు. సాంకేతికంగా ఎరుపు, నీలం, తెలుపు లాంటి రంగుల్లో కూడా టైర్లు తయారు చేయడం సాధ్యమే. కానీ, అలాంటి టైర్లు నల్లటి టైర్లంత బలంగా ఉండవు. అందుకే, సాధారణ వాహనాల్లో వాటిని ఎక్కువగా ఉపయోగించరు. కొన్ని పాతకాల కార్లలో వైట్‌ వాల్ టైర్లు కనిపించేవి. అంటే, టైరు పక్క భాగంలో తెలుపు రంగు ఉండేది. కానీ, రోడ్డును తాకే ప్రధాన భాగం మాత్రం నల్లగానే ఉండేది. ఎందుకంటే అదే ఎక్కువ మన్నికను ఇస్తుంది. మనం ప్రతిరోజూ చూసే నల్లటి టైర్లు కేవలం అందం కోసం కాదు. ప్రయాణం సురక్షితంగా ఉండటానికి, టైర్లు ఎక్కువకాలం మన్నికగా ఉండేందుకు, వేడి, రోడ్డు ప్రెజర్ ను తట్టుకునేందుకు నల్ల రంగు కీలక పాత్ర పోషిస్తోంది.

Read Also: టాటా To హ్యుందాయ్.. రూ. 10 లక్షల్లోపు సేఫ్టీలో బెస్ట్ కార్లు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live