Save Fuel, Save Money: కారు మైలేజీని పెంచుకునేందుకు డ్రైవర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా, తక్కువ ఫ్యూయెల్ తో ఎక్కువ దూరం ప్రయాణించాలని భావిస్తుంటారు.
చాలామంది మైలేజీ అనేది కారు ఇంజిన్, వెహికల్ క్వాలిటీపై ఆధారపడి ఉంటుందని భావిస్తారు. వాస్తవానికి, డ్రైవింగ్ చేసే విధానం, వాహనం మెయింటెనెన్స్ కూడా మైలేజీలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే, అదనపు ఖర్చు లేకుండా మైలేజీని మెరుగుపరచుకోవచ్చు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ వెహికల్ స్పీడ్
వాహనం నడిపే వేగం అనేది మైలేజీలో కీలకం పాత్ర పోషిస్తుంది. చాలా వేగంగా డ్రైవ్ చేయడం, చాలా నెమ్మదిగా వెళ్లడం రెండూ ఫ్యూయెల్ వినియోగాన్ని పెంచుతాయి. సాధారణంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం మధ్య స్థిరంగా డ్రైవ్ చేయడం వల్ల మంచి మైలేజీ లభిస్తుంది. వేగాన్ని తరచుగా పెంచడం, తగ్గించడం, సడెన్ బ్రేక్ వేయడం లాంటివి చేస్తే ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచుతాయి. ఫ్యూయెల్ ఎక్కువగా ఖర్చవుతుంది. సాఫ్ట్ గా డ్రైవ్ చేయడం మైలేజీకి మంచిది.
⦿ టైర్ ప్రెజర్
టైర్లలో సరైన గాలి లేకపోతే వాహనం సరిగా కదలదు. ఇంజిన్ ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అదే విధంగా వీల్ అలైన్‌మెంట్ సరిగా లేకపోతే కూడా ఇంధన వినియోగం పెరుగుతుంది. టైర్ ప్రెజర్‌ను తరచూ తనిఖీ చేయడం, అవసరమైతే సరిచేయడం చాలా ముఖ్యం. సరైన అలైన్‌మెంట్ ఉండటం వలన డ్రైవింగ్ సులభంగా మారుతుంది. భద్రత కూడా మెరుగుపడుతుంది.
⦿ అదనపు బరువు
వాహనంలో ఉండే బరువు కూడా మైలేజీపై ప్రభావం చూపుతుంది. చాలా మంది కార్లలో అవసరం లేని వస్తువులను ఉంచుతారు. ఈ అదనపు బరువు కారణంగా ఇంజిన్‌పై భారం పెరుగుతుంది. ఫలితంగా ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. వాహనంలో అవసరమైన వాటిని మాత్రమే ఉంచడం మంచిది. కారు తేలికగా ఉంటే ఎక్కువ మైలేజీ ఇస్తుంది.
⦿ కారు సర్వీసింగ్
కారు సర్వీసింగ్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి సర్వీస్ చేయించని వాహనంలో ఇంజిన్ సరిగా పనిచేయదు. ఎయిర్ ఫిల్టర్లు మురికి పడటం, ఇంజిన్ ఆయిల్ పాతబడటం, ఇతర భాగాలు దెబ్బతినడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం వలన వాహనం మంచి కండీషన్ లో ఉంటుంది. మైలేజీ కూడా మెరుగుపడుతుంది.
ఇంకా కొన్ని చిన్న విషయాలు కూడా మైలేజీపై ప్రభావం చూపుతాయి. అవసరం లేకుండా ఇంజిన్ ఆన్‌లో ఉంచడం, ఎక్కువసేపు ఐడిల్ లో వదిలేయడం కూడా ఇంధనాన్ని వృథా చేస్తుంది. ట్రాఫిక్‌లో ఎక్కువసేపు నిలిచిపోతే ఇంజిన్ ఆఫ్ చేయడం మంచిది. అలాగే ఎయిర్ కండిషనర్‌ను అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించడం ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. చిన్న చిన్న అలవాట్లను మార్చుకుంటే పెద్ద మార్పు కనిపిస్తుంది. సరైన వేగంతో ఇంధన ఖర్చును తగ్గించుకోవచ్చు.
Read Also: టాటా కర్వ్ ఈవీ vs హ్యుందాయ్ క్రెటా ఈవీ.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ SUV?

