Dailyhunt
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?

తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?

Big TV Live 1 week ago

మిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించేందుకు సమయం ఆసన్నమైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది.

ఈ నెల 7న చెన్నై సెంట్రల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా జరిగే కార్యక్రమంలో ఆయన రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు. రేపు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకున్న బలాన్ని విజయ్ అధికారికంగా వివరించనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో స్టేడియం పరిసరాల్లో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంపూర్ణ మద్దతు కూడగట్టే పనిలో విజయ్ నిమగ్నమయ్యారు. ప్రస్తుతం టీవీకే సొంతంగా 108 స్థానాలను గెలుచుకోగా మెజారిటీ మార్కును అధిగమించేందుకు మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం చర్చలు జరుపుతున్నారు. ఇతర పక్షాల నుంచి మద్దతు కూడగట్టే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు టీవీకే నాయకత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. గెలిచిన 107 మంది ఎమ్మెల్యేలను వెంటనే మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం వరకు వారంతా అక్కడే పార్టీ సీనియర్ నేతల పర్యవేక్షణలో ఉండనున్నారు.

తమిళనాడు వ్యాప్తంగా విజయ్ ప్రభంజనం సృష్టించినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కన్యాకుమారి, మైలాడుదురై, తిరువారూర్, నాగై, నీలగిరి, తెన్కాశి, అరియలూర్ జిల్లాల్లో టీవీకే ఖాతా తెరవలేకపోయింది. ముఖ్యంగా మత్స్యకారుల ప్రాబల్యం అధికంగా ఉన్న నాగై, మైలాడుదురై జిల్లాల్లో ఎన్నికలకు ముందు విజయ్‌కు విపరీతమైన మద్దతు ఉందని ప్రచారం జరిగినప్పటికీ అది ఓట్లుగా మారలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం లోపం లేదా స్థానిక సమీకరణాలు టీవీకే విజయానికి అడ్డుకట్ట వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. డీఎంకే ఏడు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోగా.. ఏఐఏడీఎంకే తొమ్మిది జిల్లాల్లో తన ఉనికిని కోల్పోయింది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొడుతూ విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. అధికారం చేపట్టబోయే ముందు ఈ వైఫల్యాలపై దృష్టి సారించి భవిష్యత్తులో లోటుపాట్లు సరిదిద్దుకోవాలని టీవీకే అధిష్టానం యోచిస్తోంది. సంకీర్ణ సర్కార్ ఏర్పాటు దిశగా సాగుతున్న విజయ్ అడుగులు తమిళ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live