Dailyhunt
తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు

తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు

Big TV Live 5 days ago

మిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవబోతోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

చెన్నైలోని నెహ్రూ స్టేడియం ఈ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల మధ్య ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు ఐదు వేల మంది ప్రముఖులు రాజకీయ నాయకులకు మాత్రమే లోపలికి అనుమతినిస్తూ పాసులు జారీ చేశారు. ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో నగరం అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

విజయ్ ప్రమాణ స్వీకారానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నేత రాహుల్ గాంధీ హాజరుకానుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోరాడి 108 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో టీవీకే బలం 112కు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం అవసరమైన మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కోసం కమ్యూనిస్టులు స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను విజయ్ గవర్నర్‌కు సమర్పించారు.

ఈ రాజకీయ పరిణామాలు ఇండియా కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో డీఎంకేతో కలిసి నడిచిన కాంగ్రెస్ ఫలితాల అనంతరం టీవీకేకు మద్దతు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ తన మిత్రపక్షమైన డీఎంకేను కాదని విజయ్ వైపు మొగ్గు చూపడంపై విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలోని ప్రధాన పార్టీకే రాహుల్ హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

సినిమా రంగంలో రారాజుగా వెలిగిన విజయ్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టడం తమిళ రాజకీయాల్లో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ముగింపు పలికి పూర్తిస్థాయిలో ప్రజా సేవకు అంకితమవుతానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. దళపతి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కేవలం అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు సైతం కొత్త ప్రభుత్వంపై గంపెడంత ఆశలతో ఉన్నారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంతో తమిళనాడు రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live