తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభంజనం సృష్టిస్తోంది. రాజకీయ రంగప్రవేశం చేసిన అతి తక్కువ కాలంలోనే విజయ్ అద్భుతమైన విజయం దిశగా దూసుకుపోతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ చారిత్రాత్మక విజయంపై సినీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి ప్రత్యేక అభినందనలు..
విజయ్ సాధించిన ఈ అద్భుత విజయానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తొలి ఎన్నికల్లోనే ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 'ప్రియమైన విజయ్.. తొలి పోరులోనే అద్భుత విజయాన్ని అందుకున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్పష్టమైన లక్ష్యంతో ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ వారిని ముందుండి నడిపిస్తూ సేవలు అందించాలని ఆశిస్తున్నాను. తమిళనాడు ప్రజలకు భవిష్యత్తులో మీరు చేసే ప్రజాసేవకు నా అభినందనలు' అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పవన్ ఏమన్నారంటే..?
తమిళనాడులో విజయ్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు ప్రజల్లో ఉన్న మార్పు ఆకాంక్షకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఎన్నికల ఫలితాలు ఓటర్ల బలమైన ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పాలన బాగుంటే ప్రజలు గెలిపిస్తారని లేదంటే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని విశ్లేషించారు.
సోదరుడు విజయ్‌కు అభినందనలు: జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం విజయ్ ఘనవిజయంపై స్పందించారు. 'నా ప్రియ సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు' అంటూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే టీవీకే పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించడం విజయ్ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని జగన్ కొనియాడారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో విజయ్ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని ఈ ప్రయాణంలో దేవుడి ఆశీస్సులు ఆయనకు తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయాలు అంటే కేవలం అధికారం మాత్రమే కాదని అది నిరంతర ప్రజా సేవ అని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడం పట్ల ఇటు సినీ అభిమానులు అటు రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టడంలో విజయ్ విజయం సాధించారని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. పవన్ కల్యాణ్, చిరంజీవి, జగన్ వంటి అగ్రనేతలు విజయ్ను అభినందించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
బెంగాల్ బీజేపీ రికార్డ్ విజయం.. తమిళనాటలో టీవీకే అద్భుతం, ఎన్నికల ఫలితాలపై మోదీ కీలక వ్యాఖ్యలు

