TCL Trifold Monitor: సాధారణంగా ఫోల్డబుల్ టెక్నాలజీ అంటే.. మనందరికీ వెంటనే గుర్తొచ్చేవి స్మార్ట్‌ఫోన్‌లు. ఇప్పటికే మార్కెట్లోకి రకరకాల ఫోల్డబుల్ ఫోన్లు వచ్చాయి కానీ, మానిటర్ల విషయంలో మాత్రం ఈ మార్పు ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.
స్పానిష్ నగరం బార్సిలోనాలో జరిగిన MWC 2026 వేదికగా TCL కంపెనీ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. అదే ప్రపంచంలోనే మొట్టమొదటి 28 అంగుళాల ట్రై-ఫోల్డ్ డెస్క్‌టాప్ మానిటర్. ఇది కేవలం ఒక ప్రోటోటైప్ మాత్రమే కాదు.. భవిష్యత్తులో మనం పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేసే సరికొత్త టెక్నాలజీ.
ఆ మానిటర్‌ను మడత పెడితే..
ఈ మానిటర్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని 3 భాగాలుగా మడత పెట్టుకోవచ్చు. 28 అంగుళాల భారీ స్క్రీన్ ఉన్నప్పటికీ, దీనిని మడత పెట్టినప్పుడు కేవలం 16 అంగుళాల పరిమాణానికి తగ్గిపోతుంది. ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఈ పెద్ద డెస్క్‌టాప్ స్క్రీన్‌ను ల్యాప్‌టాప్ బ్యాగులో సులభంగా తీసుకెళ్లవచ్చు. దీనిని ఓపెన్ చేసినప్పుడు 3840×1280 రిజల్యూషన్‌తో అల్ట్రా వైడ్ ఫీల్‌ను అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ట్రై-ఫోల్డ్ మానిటర్ మందం కేవలం 4.48 మిల్లీమీటర్లు మాత్రమే. ఇంత సన్నగా ఉన్నా, దీని కలర్ క్వాలిటీ మాత్రం సినిమా స్క్రీన్లకు ఏమాత్రం తీసిపోదు.
ఇంటికి హై స్పీడ్ Wi-Fi కనెక్షన్ కావాలా? ఎయిర్‌టెల్, జియో.. ఏది తీసుకుంటే లాభం?
అద్భుతమైన ఇంజనీరింగ్ వర్క్..
ఈ మానిటర్ తయారీలో వాడిన మడత పెట్టే మెకానిజం టెక్నాలజీ పరంగా చాలా క్లిష్టమైనది. వాటర్‌డ్రాప్ హింజ్ డిజైన్ వల్ల స్క్రీన్‌ను మడత పెట్టినప్పుడు ఎలాంటి గ్యాప్ లేకుండా, చాలా నీట్‌గా ఉంటుంది. దీంతో ఈ మానిటర్‌ను పూర్తిగా ఓపెన్ చేసి వాడుకోవచ్చు. లేదంటే రెండు పక్కల ఉన్న ప్యానెల్స్‌ను కొద్దిగా లోపలికి వంచి కర్వ్‌డ్ మానిటర్ లాగా కూడా మార్చుకోవచ్చు. తద్వారా పని చేసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ మానిటర్ వెనుకున్న ఉన్న స్టాండ్ సహాయంతో మనకు నచ్చిన యాంగిల్‌లో నిలబెట్టుకోవచ్చు.
త్వరలోనే మార్కెట్లోకి..
స్వయంగా TCL సంస్థ ఈ మానిటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయదు. వారు కేవలం డిస్‌ప్లే ప్యానెల్స్‌ను తయారు చేసే కంపెనీ కాబట్టి.. ఇతర ప్రముఖ కంపెనీలకు ఈ టెక్నాలజీని అందిస్తారు. లెనోవో వంటి సంస్థలు ఇప్పటికే టీసీఎల్ తయారు చేసిన స్క్రీన్లను వాడుతున్నాయి. సో.. రాబోయే రోజుల్లో మనం సరికొత్త ట్రై ఫోల్డ్ మానిటర్లను వివిధ బ్రాండ్ల పేరుతో మార్కెట్లో చూడొచ్చన్నమాట. ఈ మానిటర్ ద్వారా ఆఫీస్ వర్క్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను ఈజీగా చేసుకోవచ్చు.
బంపర్ ఆఫర్ మావా.. డాల్బీ అట్మాస్ స్మార్ట్ టీవీలు సగం ధరకే వచ్చేస్తున్నాయ్!

