Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.. విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణ

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం.. విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణ

Big TV Live 3 weeks ago

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి.. పాలనాపరమైన సంస్కరణలే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో తీసుకున్న 10 ప్రధాన నిర్ణయాలివే.

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన భారీ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ మదన్ బి. లోకూర్ కమిషన్ సమర్పించిన 114 పేజీల నివేదికపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్రాష్ట్ర అంశాలు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం ఉన్నందున నిష్పాక్షిక విచారణ కోసం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను సవరించాలని.. రిజిస్ట్రేషన్ శాఖలో విలువల రేషనలైజేషన్ ప్రక్రియకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వాస్తవ మార్కెట్ ధరలకు.. ప్రభుత్వ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం వల్ల శాస్త్రీయ పద్ధతిలో రివిజన్ చేయనున్నారు. ఈ నెల చివరి వారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

హిల్ట్ (HILT) పాలసీ కింద భూముల కొనుగోలుకు దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం కల్పించింది. భూముల ధరలు పెరగక ముందే దరఖాస్తు చేసుకున్న వారు పది శాతం నగదు చెల్లించి తమ బుకింగ్‌ను ఖరారు చేసుకోవచ్చు. వారికి పాత ధరలే వర్తిస్తాయని.. మిగిలిన 90 శాతం మొత్తాన్ని 90 రోజుల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుందని కేబినెట్ స్పష్టం చేసింది.

అకాల వర్షాల వల్ల వివిధ జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరించి బాధితులకు తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అకాల వర్షాల ప్రభావంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం (NARMAC) నిర్వహణ బాధ్యతలను నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB)కు అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఎంవోయూ ప్రకారం డెయిరీ ప్లాంట్ నిర్వహణ.. పాల ప్రాసెసింగ్.. మార్కెటింగ్ బాధ్యతలను ఎన్‌డీడీబీ చేపడుతుంది. దీనివల్ల పాల ఉత్పత్తిదారులకు మెరుగైన ధరలు.. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయి.

పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించే దిశగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. 33/11 కేవీ సబ్ స్టేషన్ల వద్ద పైలెట్ పద్ధతిన 18 చోట్ల 19 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు ₹66.50 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రేటర్ హైదరాబాద్ సహా సైబరాబాద్.. మల్కాజ్గిరి మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల బకాయిల కోసం వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకాన్ని ప్రవేశపెట్టారు. సుమారు ₹5,864 కోట్ల బకాయిలు ఉండగా.. జరిమానాలు, వడ్డీలు మినహాయించడం ద్వారా ₹1,686 కోట్లు వసూలు అవుతాయని అంచనా వేస్తున్నారు. జలమండలికి చెల్లించాల్సిన బకాయిలను కూడా ఇదే పద్ధతిలో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కాలువ ద్వారా జిల్లాలోని పలు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటిని అందించి రైతులకు మేలు చేకూర్చనున్నారు. కరువు పీడిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ఒక వరంగా మారనుంది.

రాష్ట్రంలోని నైపుణ్యాభివృద్ధి సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు).. పాలిటెక్నిక్ కళాశాలలు.. టీ-శాట్ (T-SAT)ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం సాధ్యమవుతుంది.

హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లో భారీ కూరగాయల మార్కెట్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం 42 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ వల్ల నగర ప్రజలకు తాజా కూరగాయలు అందడమే కాకుండా రైతులకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి.

Read Also: డీఎంకే ఇక అద్భుతమైన ప్రతిపక్షం.. ప్రజల తీర్పును గౌరవిస్తానన్న సీఎం స్టాలిన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live