Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big TV Live 2 days ago

Invest Telangana Summit:తెలంగాణాలో అధికారం చేపట్టి వెయ్యి రోజులు అయిన సందర్భంగా సీయం రేవంత్ దూకుడు పెంచారు.ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులని రాబట్టాలన్న ధ్యేయంతో 'ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026'ను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ.

రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్దం చేశారు.

ఈ క్రమంలోనే దేశ రక్షణ రంగ దిగ్గజాలను, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు.

డిసెంబర్‌లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా మెగా సమ్మిట్

ఈ క్రమంలో రాబోయే డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఫ్యూచరిస్టిక్ విజన్‌తో నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో భాగంగా రక్షణ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ‘డిఫెన్స్ ఎక్స్‌పో-2026’ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎక్స్‌పోను స్వయంగా ప్రారంభించి, రాష్ట్రంలోని యువ శాస్త్రవేత్తలు, స్టార్టప్ నిర్వాహకులకు దిశానిర్దేశం చేయాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు సీయం రేవంత్. ఏరోస్పేస్, స్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలను, పారిశ్రామిక ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నట్లు కేంద్రానికి వివరించారు.

హైదరాబాద్ ఆకాశంలో కనువిందు చేయనున్న ఎయిర్‌షో

ఇక ఈ డిఫెన్స్ ఎక్స్‌పోకు ప్రధాన ఆకర్షణగా ఒక ప్రతిష్టాత్మక ఎయిర్‌షోను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైనఅనుమతులు మంజూరు చేయడంతో పాటు, భారత వైమానిక దళానికి చెందిన ప్రముఖ ‘సూర్యకిరణ్’, ‘సారంగ్’ ఏరోబాటిక్ బృందాలతో గగనతల విన్యాసాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) చెందిన అత్యాధునిక ఆయుధాలు, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు, స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ డిస్‌ప్లే ఉండేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ వంటి దిగ్గజ సంస్థలతో పాటు DRDO ప్రయోగశాలలు తమ స్వదేశీ రక్షణ సాంకేతికతను ఇక్కడ ప్రదర్శించేలా చూడాలని కోరారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 1500 ఎకరాలు

ఇక ఉత్తర తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చింది. ఈ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు రక్షణ శాఖ మొత్తం 1500 ఎకరాలు అడగగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ పూర్తి చేసిందని సీఎం వెల్లడించారు. మిగిలిన 750 ఎకరాలను కూడా సేకరించి అప్పగించేందుకు తెలంగాణ సర్కార్ పూర్తి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

రూ. 1 కే 416 ఎకరాలు.. డీఆర్‌డీఎల్‌కు బంపర్ ఆఫర్

రాష్ట్రంలో రక్షణ రంగ పరిశోధనలను ప్రోత్సహించే దిశగా రేవంత్ సర్కార్ మరో కీలక అడుగు వేసింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL) ఏర్పాటు చేయనున్న భారీ ప్రాజెక్టు కోసం ఏకంగా 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు TGIIC ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూమిని సంవత్సరానికి కేవలం రూ. 1 నామమాత్రపు లీజుతో (33 ఏళ్ల పాటు) ఇవ్వనుండటం గమనార్హం. అవసరమైతే ఈ లీజును భవిష్యత్తులో పొడిగించేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.

తెలంగాణను గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా మార్చే ఈ చారిత్రక సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ కుమార్ షెట్కార్, పోరిక బలరాం నాయక్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live