తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ అలాగే డీజిల్ సరఫరాపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరగడంపై దృష్టి సారించిన ఆయన వాస్తవ గణాంకాలను వివరించారు.
సాధారణ రోజులతో పోలిస్తే నిన్న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఇంధన పంపిణీ జరిగినట్లు మంత్రి వెల్లడించారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజువారీ పెట్రోల్ సగటు వినియోగం 6,920 కిలోలీటర్లు ఉండగా నిన్న ఒక్కరోజే ఏకంగా 12,875 కిలోలీటర్లు సరఫరా చేశారు. డీజిల్ విషయానికి వస్తే సాధారణంగా రోజుకు 9,017 కిలోలీటర్ల పంపిణీ జరుగుతుంది. దీనికి విరుద్ధంగా నిన్న 21,295 కిలోలీటర్ల మేర డీజిల్ సరఫరా అయినట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణ డిమాండ్ కంటే రెట్టింపు స్థాయిలో సరఫరా జరుగుతున్నప్పుడు కొరత అనే ప్రశ్నే తలెత్తదని ఆయన వివరించారు.
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని కిషన్ రెడ్డి కోరారు. ఇంధనం అయిపోతుందనే భయంతో బంకుల వద్ద క్యూ కట్టి అనవసరమైన గందరగోళం సృష్టించవద్దని హితవు పలికారు. పెట్రోల్ బంకుల వద్ద భారీగా గుమిగూడడం వల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థలు నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.
అవసరానికి మించి ఇంధనాన్ని డబ్బాల్లో లేదా బాటిళ్లలో నిల్వ చేసుకోవద్దని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో ఇంధనాన్ని నిల్వ ఉంచడం ప్రమాదకరమని సూచించారు. చమురు కంపెనీల వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. రవాణా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేవని ఇంధన సరఫరా సజావుగా సాగుతుందని భరోసా ఇచ్చారు.

