T Wallet: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్ వ్యాలెట్ సర్వీస్ యాప్.. టీ-వ్యాలెట్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకుంది. యాప్ నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన విభేదాలు..
క్రిమినల్ కేసుల దాకా వెళ్లాయి. సుమారు 16 లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటా, 14 కోట్ల ప్రజాధనం ప్రమాదంలో పడటంతో సర్కార్ అప్రమత్తమైంది. అసలు.. ఈ వివాదం ఎక్కడ తలెత్తింది? టెండర్ దక్కించుకున్న కొత్త సంస్థకు డేటా బదిలీ చేయడంలో అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? అసలు.. టీ-వ్యాలెట్ చుట్టూ ఏం జరుగుతోంది?
టీ-వ్యాలెట్‌పై కుట్ర?
టీ-వ్యాలెట్ యాప్‌కు తూట్లు పొడుస్తూ, లక్షలాది యూజర్ల నమ్మకానికి గండికొట్టేందుకు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని సడలించేందుకు ప్రయత్నిస్తోంది ఓ ప్రైవేట్ సంస్థ. నమ్మకద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్ట్ హ్యాండోవర్‌కు అడ్డంకులు సృష్టిస్తోంది. లక్షల మంది యూజర్ల డేటాని తమ గుప్పిట్లో పెట్టుకొని చెలగాటం ఆడుతోంది. ఆ ప్రైవేట్ సంస్థే.. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
టీ-వ్యాలెట్ వ్యవహారం హాట్‌టాపిక్
మనల్ని ఎవడ్రా అడిగేది అనే అహంకారంతో.. ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించిన ఈ సంస్థపై.. తెలంగాణ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. రాష్ట్రంలో సంచలనంగా మారింది. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దుర్మార్గపు వ్యవహారంపై.. హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ సంస్థ ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరితో పాటు హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ కిరణ్ కుమార్‌పై కేసు నమోదైంది. వీళ్లిద్దరూ ఇప్పుడు పరారీరో ఉన్నారు. అయితే, టీ-వ్యాలెట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాసులుని మాత్రం అరెస్ట్ చేశారు.
టెండర్ తర్వాత ట్విస్ట్
నగదు రహిత లావాదేవీల కోసం టీ-వ్యాలెట్ యాప్‌ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీని నిర్వహణ బాధ్యతలను ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. ఒప్పందం ప్రకారం, కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత.. యాప్ సోర్స్ కోడ్, యూజర్ డేటా, నిధులను ప్రభుత్వానికి గానీ, టెండర్‌లో కొత్తగా ఎంపికైన సంస్థకు గానీ అప్పగించాలి. ఇటీవలే.. టీ-వ్యాలెట్ నిర్వహణ కోసం ప్రభుత్వం పర్‌వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ అనే కొత్త సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేసింది. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఊహించని చిక్కులు ఎదురయ్యాయ్.
ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థపై కేసు
పాత సంస్థ ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్.. తమ దగ్గరున్న టీ-వ్యాలెట్ డేటాను బదిలీ చేసేందుకు నిరాకరిస్తోంది. పైగా, టీ-వ్యాలెట్‌పై తమకే యాజమాన్య హక్కులు ఉన్నాయని అడ్డదిడ్డంగా వాదించడం మొదలుపెట్టింది. టెండర్ ద్వారా ఎంపికై పది నెలలవుతున్నా.. డేటా ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో.. పర్‌వ్యూ ఇండియా కంపెనీ కోట్ల రూపాయలు నష్టపోతోంది. ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, చట్టబద్ధ ప్రాజెక్ట్ హ్యాండోవర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లాంటి తీవ్ర ఆరోపణలపై.. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థపై కేసులు నమోదయ్యాయ్.
నిజమైన పాపాల భైరవులు మీరే.. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో సవాళ్లు
2017 జనవరిలో జారీ చేసిన వర్క్ ఆర్డర్‌తో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను.. ప్రభుత్వానికి చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, నిర్వహణ కోసం నియమించారు. యాప్ బిల్డ్ చేసినందుకు వన్ టైమ్-సెటిల్‌మెంట్‌గా ప్రభుత్వం 70 లక్షలు చెల్లించింది. అంతేకాదు.. టీ వ్యాలెట్ యాప్ అందుబాటులోకి వచ్చాక.. ప్రతి నెలా మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా చెల్లించింది. అగ్రిమెంట్ ప్రకారం.. కాలపరిమితి ముగిసిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డేటా, సోర్స్ కోడ్‌తో పాటు డిజిటల్ ఆస్తులపై పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయ్. అయితే, 2018 నుంచి 2025 వరకు మూడుసార్లు అదే అగ్రిమెంట్‌ని, అవే నిబంధనలను పొడిగించారు. అలా.. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ కాలపరిమితి 2025 మే 31తోనే ముగిసింది. అదే ఏడాది ఆగస్టులో పర్‌వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ అనే కొత్త సంస్థకు కాంట్రాక్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పది నెలలు కావొస్తున్నా.. డేటా ట్రాన్స్‌ఫర్ కాలేదు.
డేటా బదిలీపై ఉద్రిక్తత
టీ-వ్యాలెట్ నిర్వహణ కోసం.. కొత్త సంస్థని ఎంపిక చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా టెండర్ పిలిచింది. ఇందులో పర్‌వ్యూ ఇండియా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ.. ఎల్1గా ఎంపికైంది. ఈ కొత్త టెండర్‌లో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ కూడా పాల్గొంది. ఆ నిబంధనలను అంగీకరించింది. మరోసారి టెండర్ దక్కించుకోవడంలో విఫలమైన తర్వాత.. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ.. పర్‌వ్యూ సంస్థకు సహకరించకుండా ఇబ్బందులు సృష్టించడం మొదలుపెట్టింది. నిబంధనల ప్రకారం.. టెండర్‌లో కొత్తగా ఎంపికైన సంస్థకు.. పాత సంస్థ టీ-వ్యాలెట్ డేటా మొత్తం బదలాయించాలి.
టీ-వ్యాలెట్ డేటాపై సంచలన ఆరోపణలు
కానీ, అప్పటి నుంచి కాలపరిమితి ముగిసినా, వేరే సంస్థకు కాంట్రాక్ట్ వెళ్లినా, కీలకమైన డేటా వారికి బదలాయించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడమే కాదు, తప్పుడు యాజమాన్య పత్రాలతో ప్రభుత్వానికి చెందిన డేటాను తమదిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థకు.. టీఏ వన్ అనే ప్రైవేట్ యాప్ ఉంది. టీ-వ్యాలెట్ యూజర్ డేటా మొత్తాన్ని తమ పర్సనల్ యాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటామని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రభుత్వాన్ని మోసం చేశారా?
పర్‌వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీకి.. టీ-వ్యాలెట్ హ్యాండోవర్ చేయడంలో పదే పదే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించింది ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ. టెండర్ రూల్స్ ప్రకారం.. కొత్త సంస్థకు డేటా బదలాయిస్తామని ముందు ఒప్పుకున్నా.. తర్వాత మాట మార్చేసింది. తమకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశమో, మరొకటో గానీ.. పదే పదే ఇబ్బందులు సృష్టిస్తోంది. అందువల్లే.. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వాన్ని చీట్ చేయడం, టీ-వ్యాలెట్ డేటాని పర్సనల్ యాప్‌లోకి బదిలీ చేసుకుంటామని చెప్పడం.. నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. అయినా.. ప్రభుత్వానికి చెందిన వ్యాలెట్‌ని, అందులోని డేటాని.. సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడమేంటి? ప్రభుత్వానికి చెందిన టీ-వ్యాలెట్ యాప్ యూజర్ డేటా.. మరో ప్రైవేట్ యాప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటామని చెప్పడమేంటి? ఇది రూల్స్ బ్రేక్ చేయడమే కాదు.. నేరం కూడా!
గవర్నమెంట్ కాంట్రాక్టులపై ప్రశ్నలు
ముఖ్యంగా.. ఇక్కడ పర్‌వ్యూ ఇండియా కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థకు బాగా నష్టం జరుగుతోంది. టెండర్ దక్కించుకొని 10 నెలలవుతున్నా.. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ నుంచి డేటా బదిలీ కాకపోవడంతో.. కోట్లు నష్టపోతున్నారు. డేటా ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఆలస్యం జరిగేకొద్దీ.. పర్‌వ్యూ సంస్థ లాస్ అవుతూనే ఉంటుంది. ఇలా జరిగితే.. తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం సడలిపోతుంది. గవర్నమెంట్ కాంట్రాక్టులంటేనే ఇంత.. నో గ్యారంటీ అనే ముద్ర పడిపోతుంది. అందుకోసమే.. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ప్రభుత్వమే ముందుకొచ్చి.. ఆ ప్రైవేట్ సంస్థపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఇలాంటివి.. చాలా అరుదుగా జరుగుతుంటాయ్. ఇదంతా.. ప్రభుత్వ ప్రాజెక్టులకు.. ప్రభుత్వమే జవాబుదారీగా ఉంటుందని చెప్పడానికే!
ప్రాజెక్ట్ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థపై.. బీఎన్ఎస్ సెక్షన్ 316(2), 318(4), 66C, 70, 72, 43, రీడ్ విత్ 66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్‌కు చెందిన ఏసీపీ ఎ.రామ్ రెడ్డి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరికీ చట్టపరమైన నోటీసులు జారీ చేశారు. సంస్థలో చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌గా పనిచేస్తున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసులుని ఏప్రిల్ 25నే అరెస్ట్ చేశారు.
టీ-వ్యాలెట్ వివాదం.. బ్లాక్‌లిస్టింగ్ దిశగా ప్రభుత్వం?
ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరి, హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ కిరణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారాన్ని ఐటీ శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఒప్పందం నిబంధనల ప్రకారం.. జరిమానాలు విధించడం, భవిష్యత్ టెండర్ల నుంచి బ్లాక్‌లిస్టింగ్ చేయడం, నష్టపరిహారం వసూలు చేయడం లాంటి చర్యలు.. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై పరిశీలనలో ఉన్నాయ్.
16 లక్షల యూజర్ల డేటా సేఫ్‌నా?
టీ-వ్యాలెట్ చుట్టూ ఇలాంటి వివాదం చుట్టుకోవడం.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అవకాశముంది. ఇలాంటి వ్యవహారాల వల్ల గవర్నమెంట్ యాప్‌ల పట్ల యూజర్లకు నమ్మకం పోతుంది. ముఖ్యంగా.. ప్రభుత్వ ప్రాజెక్టులో ప్రైవేట్ సంస్థల జోక్యం ఎంతవరకు ఉండాలి? డేటా భద్రతపై ప్రభుత్వ నియంత్రణ ఎంత? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఇప్పటికే.. టీ వ్యాలెట్ వాడే యూజర్లు 16 లక్షల మందికి పైనే ఉన్నారు. ప్రతి నెలా 360 కోట్ల ట్రాన్సాక్షన్ వాల్యూ ఉంది. యూజర్లంతా ప్రభుత్వాన్ని నమ్మి టీ-వ్యాలెట్‌లో తమ వివరాలను నమోదు చేశారు. అందులో.. కేవైసీ డేటా, వాలెట్ డేటా, కీలకమైన ట్రాన్సాక్షన్ల ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు అదంతా.. దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనే వార్తలు యూజర్లలో ఆందోళన పెంచుతున్నాయ్. అయితే.. ప్రభుత్వ కార్యకలాపాలను దెబ్బతీసే ఎలాంటి సంస్థలపై అయినా, కఠిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కరీనంగర్ చోరీ.. పక్కా ప్లానింగ్‌తో దోపిడీ, పోలీసులకు చిక్కిన ఆధారాలు.. మొదలైన వేట!

