వేసవికాలంలో అధిక వేడి కారణంగా చెమట ఎక్కువగా రావడం, సమస్య తీవ్రమైతే విరేచనాలు లేదా వాంతులు కూడా వస్తాయి. ఈ కారణంగా శరీరంలో నీరు, ఖనిజ లవణాలు వేగంగా తగ్గిపోతాయి.
ఈ పరిస్థితిని డీహైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్ వల్ల అలసట, తల తిరగడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) చాలా ఉపయోగపడుతుంది. మార్కెట్‌లో దొరికే ప్యాకెట్లను కొనుగోలు చేయకుండా ఇంట్లోనే సులభంగా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు.
ఇంట్లో తయారుచేసిన ఓఆర్ఎస్ ఎందుకు ఉపయోగకరం?
డీహైడ్రేషన్ సమస్య వచ్చినప్పుడు శరీరానికి వెంటనే నీరు, లవణాలు అవసరం అవుతాయి. ఇంట్లో తయారు చేసిన ఓఆర్ఎస్ తాజాగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో సిద్ధమవుతుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలు సాధారణంగా ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటాయి. సరైన మోతాదులో తయారు చేస్తే ఇది శరీరానికి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
ఓఆర్ఎస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఇంట్లో ఓఆర్ఎస్ తయారు చేయడానికి చాలా తక్కువ పదార్థాలే అవసరం.
1 లీటర్ శుభ్రమైన నీరు
6 చిన్న చెంచాలు చక్కెర (సుమారు 30 గ్రాములు)
అర చిన్న చెంచా ఉప్పు (సుమారు 3 గ్రాములు)
ఈ మూడు పదార్థాలు కలిపితే శరీరానికి అవసరమైన ద్రవాలు, లవణాలు అందుతాయి.
ఓఆర్ఎస్ తయారీ విధానం
ముందుగా ఒక లీటర్ నీటిని బాగా మరిగించాలి. ఆ నీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఆ నీటిని శుభ్రమైన పాత్రలో లేదా బాటిల్‌లో పోయాలి. అందులో ఆరు చిన్న చెంచాలు చక్కెర వేయాలి. తరువాత అర చిన్న చెంచా ఉప్పు కలపాలి. చక్కెర, ఉప్పు పూర్తిగా కరిగే వరకు బాగా కలపాలి. అంతే, మీ ఓఆర్ఎస్ రెడీ.
ఓఆర్ఎస్ ఎలా తాగాలి?
ఓఆర్ఎస్‌ను ఒకేసారి ఎక్కువగా తాగకూడదు. కొద్దికొద్దిగా తరచుగా తాగడం మంచిది. పిల్లలు, వృద్ధులకు కూడా చిన్న మోతాదుల్లో ఇవ్వాలి.
ప్రతిరోజూ కొత్త ఓఆర్ఎస్ తయారు చేయాలి. 24 గంటల తర్వాత మిగిలిన ద్రావణాన్ని ఉపయోగించకుండా పారేయాలి.
ఓఆర్ఎస్ వల్ల కలిగే ప్రయోజనాలు
ఓఆర్ఎస్ శరీరంలో కోల్పోయిన నీటిని వేగంగా భర్తీ చేస్తుంది. అలాగే సోడియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి అందిస్తుంది.
దీని వల్ల అలసట తగ్గుతుంది. తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు తగ్గుముఖం పడతాయి. తీవ్రమైన వేడి సమయంలో ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ (వడ దెబ్బ) ప్రమాదం కూడా తగ్గవచ్చు. విరేచనాలు లేదా వాంతులతో బాధపడే పిల్లలు, వృద్ధులకు నీరసం నుంచి కాపాడి ఎనర్జీ లెవెల్స్ పెంచేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అనారోగ్యం తర్వాత కోలుకునే ప్రక్రియను వేగవంతం చేయడంలో కూడా ఓఆర్ఎస్ ఉపయోగపడుతుంది.
ఎండలో తిరగడం వల్ల పొడిబారుతున్న జుట్టు.. ఈ స్పెషల్ హెయిర్ మాస్క్‌తో సెలూన్ లాంటి ట్రీట్‌మెంట్
ఓఆర్ఎస్ తయారీలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఎప్పుడూ శుభ్రమైన, మరిగించిన నీటినే ఉపయోగించాలి. ఉప్పు, చక్కెరను సరైన మోతాదులోనే కలపాలి. ఉప్పు ఎక్కువైతే ఆరోగ్యానికి హానికరం. తక్కువైతే ఓఆర్ఎస్ ప్రభావం తగ్గుతుంది. ఓఆర్ఎస్ రుచి కొద్దిగా తీపిగా, స్వల్ప ఉప్పుగా ఉండాలి. లక్షణాలు ఎక్కువసేపు కొనసాగితే లేదా పరిస్థితి తీవ్రంగా ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ఇంట్లో తయారు చేసుకునే ఓఆర్ఎస్ చవకగా, సులభంగా సిద్ధమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సరైన పద్ధతిలో తయారు చేసి ఉపయోగిస్తే డీహైడ్రేషన్ నుంచి రక్షణ పొందవచ్చు. ఈ సులభమైన చిట్కాతో మీ కుటుంబాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

