Power Distribution: స్వేచ్ఛ బ్యూరో: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ, కొత్త విద్యుత్ కనెక్షన్లు, పెరుగుతున్న లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో భారీగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్) ఏర్పాటు చేసింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు 32 నెలల వ్యవధిలో ఏకంగా 71,011 డీటీఆర్‌లను ఏర్పాటు చేయగా.. ఇందుకోసం రూ.828.99 కోట్లను వెచ్చించింది.
పెరుగుతున్న విద్యుత్..
దీంతో ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు భారం తగ్గడంతో పాటు లో-వోల్టేజ్, ఓవర్‌లోడింగ్, ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్యూర్ల సమస్యలు తగ్గుముఖం పట్టినట్లు సంస్థ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజాపాలనలో భాగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు పంపిణీ వ్యవస్థలో మౌలిక వసతులను విస్తరిస్తోంది.
ఓవర్‌లోడింగ్ సమస్యలు..
వ్యవసాయం, గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కనెక్షన్లు, పెరుగుతున్న లోడ్, కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్ సముదాయాలు, పారిశ్రామిక ప్రాంతాలు, వాణిజ్య సంస్థల అవసరాలకు అనుగుణంగా డీటీఆర్‌ల సంఖ్యను పెంచినట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. కొత్త డీటీఆర్‌ల ఏర్పాటు ద్వారా ఇప్పటికే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లపై పడుతున్న అదనపు భారం తగ్గింది.
సరఫరా నాణ్యత..
ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌కు అనుసంధానమయ్యే వినియోగదారుల సంఖ్య తగ్గడంతో ఓవర్‌లోడింగ్ సమస్యలు నియంత్రణలోకి వచ్చాయి. ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్యూర్లు, లో-వోల్టేజ్ సమస్యలు తగ్గడంతో విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడినట్లు సంస్థ పేర్కొంది. అదేవిధంగా ఏదైనా ప్రాంతంలో విద్యుత్ లోపం తలెత్తినప్పుడు దాని ప్రభావం పడే పరిధి కూడా తగ్గుతుంది. దీంతో సమస్యను గుర్తించి, మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించే అవకాశం ఏర్పడుతోంది.
ఖైరతాబాద్ సీటుకు బైపోల్ వస్తే.. తెరపైకి దానం కొత్త ఫార్ములా, నిర్ణయం ఎటు వైపు
వ్యవసాయ రంగానికీ..
డీటీఆర్‌ల ఏర్పాటు వ్యవసాయ రంగానికీ ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ పంపుసెట్లపై లోడ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు పంపిణీ సామర్థ్యం పెరిగింది. లో-వోల్టేజ్, ఓవర్‌లోడింగ్ సమస్యలు తగ్గడంతో మోటార్లు తరచూ కాలిపోవడం, వాటి మరమ్మతులకు అయ్యే ఖర్చులు వంటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఏర్పడింది. సాగునీటి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండేందుకు ఇది దోహదపడుతోంది.
టీజీఎస్పీడీసీఎల్..
పట్టణాలు, శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా డీటీఆర్‌లను ఏర్పాటు చేయడంతో గృహ వినియోగదారులకు సరఫరా నాణ్యత మెరుగుపడుతున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. లో-వోల్టేజ్, తరచూ ట్రిప్పింగ్, ఓవర్‌లోడింగ్ వంటి సమస్యలు తగ్గడంతో గృహోపకరణాలకు స్థిరమైన వోల్టేజ్ అందే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా పరికరాలు దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుందని సంస్థ పేర్కొంది.
భవిష్యత్తులో..
పట్టణాలు, ఐటీ కారిడార్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాల్లో విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధిక సామర్థ్యం కలిగిన డీటీఆర్‌ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న లోడ్‌ను సమర్థంగా నిర్వహించే అవకాశం ఏర్పడింది. విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీ వ్యవస్థ సామర్థ్యాన్ని ముందుగానే పెంచుతున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. డీటీఆర్‌ల ఏర్పాటుతో పాటు భవిష్యత్తులో కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, సబ్‌స్టేషన్ల ఏర్పాటు, సామర్థ్య పెంపు పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించింది.
ఫిర్యాదులు..
విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంలో టీజీఎస్పీడీసీఎల్ ఇంజనీర్లు, అధికారులు, లైన్‌మెన్లు, ఆర్టీజన్లు, సాంకేతిక సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని సంస్థ పేర్కొంది. ఎండలు, వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా వినియోగదారులకు విద్యుత్ సేవలు అందించేందుకు సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని రైతులు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన, నిరంతరాయ విద్యుత్ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, అత్యవసర సేవల కోసం వినియోగదారులు 24 గంటల టోల్‌ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించవచ్చని వెల్లడించింది.

