దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, పర్యావరణ అనుకూల ప్రయాణం కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. జూన్ 2026లో విడుదల కానున్న కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ యమహా AEROX-E
జపాన్‌కు చెందిన యమహా కంపెనీ నుంచి రాబోతున్న AEROX-E స్కూటర్‌పై మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్ లో అందుబాటులో ఉన్న ఏరోక్స్ డిజైన్‌ను కొనసాగిస్తూ, దీనిని పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలో తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. ఈ స్కూటర్ మాక్సీ స్టైల్ డిజైన్‌తో, స్పోర్టీ లుక్ తో యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది. పనితీరు పరంగా కూడా ఇది ప్రీమియం సెగ్మెంట్ ను లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. దీని అంచనా ధర రూ.2.50 లక్షల నుంచి రూ. 2.90 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
⦿ ఏథర్ EL ప్లాట్ ఫారమ్ స్కూటర్లు
భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో ఏథర్ ఎనర్జీ ఇప్పటికే ప్రముఖ బ్రాండ్‌గా నిలిచింది. ప్రస్తుతం 450 సిరీస్ మోడళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంస్థ, ఇప్పుడు కొత్త EL ప్లాట్ ఫారమ్ పై తక్కువ ధరలో స్కూటర్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అందుబాటులో ఉండే ధరలో నాణ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందించాలని కంపెనీ భావిస్తోంది. తేలికైన నిర్మాణం, మెరుగైన సామర్థ్యం, పట్టణ ప్రయాణాలకు అనుకూలమైన డిజైన్ ఈ మోడళ్ల ప్రత్యేకతలుగా ఉండనున్నాయి. వీటి ధర సుమారు రూ. 90,000 నుంచి రూ.1 లక్ష మధ్య ఉండే అవకాశం ఉంది. ధర పరంగా ఇది మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న మోడల్స్ గా భావిస్తున్నారు. రోజువారీ ఆఫీస్, కాలేజీ ప్రయాణాలకు అనుకూలంగా మారనున్నాయి.
⦿ సింపుల్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్
సింపుల్ ఎనర్జీ సంస్థ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను అభివృద్ధి చేస్తోంది. 'సింపుల్ ఫ్యామిలీ' పేరుతో రానున్న ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి అనువుగా ఉండనుంది. కుటుంబ సభ్యులు సులభంగా ఉపయోగించుకునే విధంగా సౌకర్యవంతమైన సీటింగ్, మంచి స్టోరేజ్ స్పేస్, సరిపడే రేంజ్ వంటి అంశాలపై కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ ధర కూడా సుమారు రూ.1 లక్ష వరకు ఉండే ఉండే అవకాశం ఉంది. సరసమైన ధరలో నమ్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్న వినియోగదారులకు ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది.
ఈవీ మార్కెట్ లో మరింత పోటీ
రాబోయే ఈ మూడు స్కూటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది. ఒకవైపు ప్రీమియం సెగ్మెంట్ లో యమహా AEROX-E, మరోవైపు అందుబాటు ధరలో ఏథర్ EL, సింపుల్ ఫ్యామిలీ స్కూటర్లు వినియోగదారులకు క్రేజీ ఆప్షన్స్ ను అందించనున్నాయి.
Read Also: హీరో To హోండా.. ఇండియన్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తున్న ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ ఇవే!

