Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anupama Parameswaran: గ్లామర్ ప్రపంచంలో.. పెర్ఫార్మెన్స్ క్వీన్

Anupama Parameswaran: గ్లామర్ ప్రపంచంలో.. పెర్ఫార్మెన్స్ క్వీన్

Chitrajyothy 2 weeks ago

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే, అవకాశం వచ్చిన ప్రతిసారీ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని, నంబర్ వన్ రేసులో దూసుకుపోవాలని నేటితరం తారలు ఆరాటపడుతుంటారు.

కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇలాంటి అరుదైన కోవలోనే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముందు వరుసలో నిలుస్తారు. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ సాయి పల్లవి ఎంతో బిజీగా గడుపుతుండగా.. అనుపమ కూడా తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్ ఒలకబోయాలి, పాటలకే పరిమితం కావాలి అనే ఒక మూస ధోరణి ఉంది. అయితే, అనుపమ (Anupama parameswaran) ఈ లెక్కలను పూర్తిగా మార్చేస్తోంది. మొదటినుంచీ ఆమె కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఓటు వేస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంటున్నప్పటికీ, ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకంటూ పెట్టుకున్న కొన్ని నియమాలను బ్రేక్ చేయకుండా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన నట ప్రయాణాన్ని ధైర్యంగా కొనసాగిస్తోంది.

తాజాగా విడుదలైన మరీచిక సినిమా అనుపమ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఏకంగా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో జీవించేసింది. ఒకవైపు అల్ట్రా మోడ్రన్ లుక్‌లో అదరగొట్టిన ఈ భామ... మరోవైపు దానికి పూర్తి భిన్నంగా కళ్లకు మందపాటి అద్దాలు, పళ్లకు క్లిప్స్ పెట్టుకుని డీ-గ్లామరైజ్డ్ రోల్‌లో అద్భుతంగా నటించింది. కేవలం అందం మాత్రమే కాదు, అభినయంతో కూడా ప్రేక్షకులను కట్టిపడేయగలనని ఈ సినిమాతో ఆమె మరోసారి నిరూపించుకుంది. ఒక స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగాక ఇలాంటి రిస్క్ చేయడానికి చాలా గట్స్ కావాలి. ఆ ధైర్యం అనుపమలో పుష్కలంగా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆమె గత చిత్రాలను గమనిస్తే ఆమెలోని వైవిధ్యం మనకు సులభంగా అర్థమవుతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తికేయ-2లో తన మార్క్ చూపించిన ఆమె, టిల్లు స్క్వేర్ లో పూర్తి భిన్నమైన నెగిటివ్‌ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పరదా, కిష్కిందపురి, బైసన్, లాక్‌డౌన్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ లాంటి విభిన్నమైన ప్రాజెక్టులతోనూ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. ఈ సినిమాలన్నీ ఒకదానికొకటి పూర్తి భిన్నమైన నేపథ్యాలున్నవే కావడం ఇక్కడ విశేషం.

మిగతా కథానాయికలు గ్లామరస్ రోల్స్ వైపు మొగ్గుచూపుతూ సేఫ్ గేమ్ ఆడుతుంటే, అనుపమ పరమేశ్వరన్ మాత్రం నటనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. తాను ఎంచుకున్న దారి కష్టమైనదే అయినా, నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఆమె పడుతున్న తపన తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా డిఫరెంట్‌గా కెరీర్‌ను టర్న్ చేసుకుంటూ వెళ్తున్న అనుపమ, భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతమైన పాత్రలతో మన ముందుకు వస్తుందో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy