టాలీవుడ్‌లో పర్సంటేజ్ విధానంపై జరుగుతున్న చర్చలు వేడెక్కుతున్నాయి. నిర్మాతలు రెండు గ్రూపులుగా విడిపోయి.. ఎవరికి అనుకూలంగా వారు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించి, వారి వాదనలు వినిపించారు. ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయంటూ బుధవారం తెలుగు సినీ నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలిపారు. మరీ ముఖ్యంగా 'హరి హర వీరమల్లు' సినిమా టైమ్‌లో ఈ సమస్య తెరపైకి వచ్చిందని, ఆ తర్వాత చాలా సినిమా విడుదలైనప్పటికీ కామ్‌గా ఉంది.. ఇప్పుడు 'పెద్ది' సినిమా వస్తుంటే మళ్లీ ఇలా సమస్యలు సృష్టించడం సరికాదని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత యలమంచిలి రవిశంకర్ (Y. Ravi Shankar) సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ''ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న (మంగళవారం) ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ అంశంపై నిర్మాతల కోణం కూడా తెలియజేయాలని, నిజానిజాలు తెలపాలనే ఉద్దేశంతో ఇలా సమావేశమయ్యాం. ఎగ్జిబిటర్లు బాగా ఇబ్బందులు పడుతున్నారు, అందుకే పర్సెంటేజ్ విధానానికి రావాలని అనుకుంటున్నామని వారంతా తెలిపారు. ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు.. మేము దానికి అంగీకరిస్తాం. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని కూడా దయచేసి గ్రహించండి. ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరు. కానీ, మేము ఒక్కరిమే మా ప్రయోజనం మేము చూసుకొని వెళ్ళిపోతాము అనడం సరైనది కాదు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోవాలంటే జరిగిపోయేవి కావు. ముగ్గురికీ సమస్యలు ఉన్నాయి. దీనికి అంతా కూర్చుని చర్చించుకొని పరిష్కారాలు వెతకాలి.

