Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి

భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి

Chitrajyothy 2 weeks ago

భారత చలనచిత్ర దర్శక దిగ్గజం భారతీరాజా (Bharathiraja) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో చికిత్స తీసుకుంటూ..

84 ఏళ్ల వయసులో నేడు (బుధవారం) తుదిశ్వాస విడిచారు. నేడే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. భారతీరాజా మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

ప్రఖ్యాత సినీ దర్శకుడు భారతీరాజా మరణం బాధాకరం. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఆయన చిరస్మరణీయ చిత్రాలు అందించారు. భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ప్రముఖ నటుడు, దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగం పై తనదైన ముద్ర వేసిన భారతీరాజా.. దర్శకుడిగా, నటుడిగా విశేష ఖ్యాతి గడించారు. ఎన్నో వైవిధ్యభరితమైన, సందేశాత్మక చిత్రాలను వివిధ భాషల్లో తెరకెక్కించి భారతీయ చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించారు. ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు. భారతీరాజా మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. -సీఎం రేవంత్ రెడ్డి

భారతీయ సినిమా, గొప్ప కథకులలో ఒకరైన భారతీరాజాను కోల్పోయింది. గ్రామీణ మట్టి సువాసనలను, మానవ సంబంధాల అందాలను, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన ఎప్పటికీ నిలిచిపోయే సినిమా కవిత్వంగా మార్చారు. ఆయన చిత్రాలు కోట్లాది మంది హృదయాలను తాకాయి. ఇంకా ఎంతో మంది సినీ దర్శకుల తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పలు జాతీయ చలనచిత్ర అవార్డుల గ్రహీత అయిన భారతీరాజా.. భారతీయ సినిమాకు అందించిన సహకారం వెలకట్టలేనిది. 'ఆరాధన' సినిమాలో ఆయన దర్శకత్వంలో 'పులిరాజు'గా నటించే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకున్న మక్కువ, ఆయన సింప్లిసిటీ, తన వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం నాపై చెరగని ముద్ర వేశాయి. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన అందించిన అద్భుతమైన చిత్రాల ద్వారా ఆయన వారసత్వం ఎప్పటికీ జీవించే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి దర్శక శిఖరం భారతీరాజా. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. - చిరంజీవి

ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణం భారతీయ సినిమాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. -కె రాఘవేంద్రరావు

తన అద్భుతమైన చిత్రాలతో కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న గొప్ప దర్శకుడు ఆయన. 6 జాతీయ అవార్డులు అందుకుని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు అందుకున్న సీతాకోకచిలుక వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. భారతీరాజా గారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రముఖ దర్శకుడు, నటుడు, తమిళ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సినీ వ్యక్తిత్వం భారతీరాజా మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీరాజా.. దర్శకుడిగా, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేసిన భారతీరాజా, ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో విశిష్ట పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. భారతీరాజా మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. - వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్

భారతీరాజా తనదైన సహజసిద్ధమైన, రాజీపడని కథా కథన శైలితో సినిమా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఒక అసలైన మార్గదర్శకుడు. మరువలేని ఆ గ్రామీణ నేపథ్య కథలు, దూరదృష్టి.. ఆయన వెండితెరపైకి తీసుకువచ్చిన ప్రామాణికత ఎప్పటికీ నిలిచివుంటాయి. ఆయన అసాధారణమైన చలనచిత్ర ప్రయాణాన్ని, ఆ లెగసీని వీక్షించడం, కొనియాడటం ఒక గౌరవంగా భావిస్తున్నాను. - ఎస్ఎస్ రాజమౌళి

ప్రముఖ తమిళ చలనచిత్ర దర్శకులు, పదహారేళ్ల వయసు, సీతాకోకచిలుక, ఆరాధన వంటి ఎన్నో కళాత్మక కమర్షియల్ చిత్రాల సృష్టికర్త, ఎందరో నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెండితెరకు పరిచయం చేసిన దిగ్దర్శకులు భారతీరాజా ఇకలేరు అనే విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. కళామతల్లికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలి. - తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం

భారతీరాజా.. అవార్డులతోనూ, సినీ రంగానికి ఆయన అందించిన వారసులనే ఊడలతోనూ ఘనంగా నిలిచిన ఒక మర్రివృక్షం. మీ వల్లే తమిళ సినిమా మూలాలు మరింత లోతుగా పాతుకుపోయాయి. నిజమైన సృజనాత్మక కల్గిన దర్శకుడు, దర్శక శిఖరం. తమిళ సినిమా మిమ్మల్ని ఎప్పటికీ కొనియాడుతూనే ఉంటుంది. - జయం మోహన్ రాజా

మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకులు, మహామనిషి భారతీరాజా ఇక మన మధ్య లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మరణం తమిళ సినిమాకు తీరని లోటు. ఆయన చిత్రాలు ఎప్పటికీ ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తాయి, రాబోయే కాలానికి సినిమా నిర్మాణానికి అసలైన నిఘంటువుగా నిలుస్తాయి. ప్రతి సినిమా ప్రేమికుడి కోసం ఆయన ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో పెట్టి ఒక సినిమా చేద్దాం అని ఆయన ఎప్పుడూ అనేవారు. అది ఇక నెరవేరని కలగానే ఉండిపోతుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను సార్. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. - ఖుష్బూ సుందర్

కథా కథన శైలిని మార్చేసిన ఒక గొప్ప చలనచిత్ర దర్శకుడు. భారతీరాజా సార్ తమిళ సినిమా ఇండస్ట్రీకి హృద్యమైన, మట్టి మూలాలు ఉన్న అద్భుతమైన క్లాసిక్ చిత్రాలను అందించారు. ఆయన లేని లోటును తీర్చడం ఎవరితరం కాదు. ఆ మహా పురుషుడి ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. - సిమ్రాన్

ఇవి కూడా చదవండి:

'పెద్ది' మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy