Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Breaking: సై విలన్‌.. ప్రదీప్ రావత్ కన్నుమూత

Breaking: సై విలన్‌.. ప్రదీప్ రావత్ కన్నుమూత

Chitrajyothy 2 weeks ago

ప్రముఖ బాలీవుడ్‌, టాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ (74) భివాండీలోని ఓ ఆస్పత్రిలో కన్నుముశారు. ఐదేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించి మంగళవారం తుది శ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఆయన సహచర నటుడు యశ్‌పాల్ శర్మ తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా తెలిపారు. ప్రదీప్ రావత్‌కు భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. 1952లో ఢిల్లీలో జన్మించిన అయన అసలు పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్‌ (Pradeep Ram Singh Rawat).

తొలుత జబల్పూర్‌లోని ఓ బ్యాంక్‌లో పని చేసిన రావత్‌1985లో రాజ్ బబ్బర్ 'ఐత్‌బార్' హిందీ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆపై బీఆర్‌ చోప్రా నిర్మించిన 'మహా భారత్' సీరియల్‌లో అశ్వద్ధామగా నటించి వెలుగులోకి వచ్చాడు. ఆ సీరియల్‌లో ప్రదీప్‌ను తీసుకోమని దర్శకుడు రవి చోప్రాకు అలనాటి నటి స్మితాపాటిల్‌ రికమెండ్‌ చేయడం విశేషం. ఆ తర్వాత ఆయన 'బాఘీ'(1990) చిత్రంతో ఆయన తిరిగి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అటుపైన చాలా చిత్రాల్లో ప్రదీప్‌ నటించినా ఆమీర్‌ఖాన్‌ చిత్రం 'లగాన్‌'' తోనే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.

ఆ సినిమా చూసే దర్శకుడు రాజమౌళి 'సై' చిత్రంలో భిక్షూ యాదవ్‌ పాత్ర ఇచ్చారు. రాజమౌళి చిత్రాల్లో విలన్‌ పాత్రలకు ఎంత ఎలివేషన్‌ ఉంటుందో తెలిసిందే. మంచి కటౌట్‌ కలిగిన ప్రదీప్‌కు ఆ ఎలివేషన్‌ ఎంతో హెల్ప్‌ అయి 'సై' చిత్రంతోనే చాలా బిజీ అయ్యాడు. ఆ తర్వాత తన మరో చిత్రం 'ఛత్రపతి'లో రాస్‌ బిహారీ పాత్ర ప్రదీప్‌కు ఇచ్చి ఆయన్ని మరింత బిజీ చేశారు రాజమౌళి. ఆ సమయంలోనే తమిళ హీరో సూర్య నటించిన 'గజిని' చిత్రంలో ప్రదీప్‌ రావత్‌కు మరో మంచి అవకాశం లభించింది. దుష్టులైన అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక అప్పటినుంచి తెలుగు, తమిళ చిత్రాలతో తీరిక లేనంత బిజీ అయ్యారు ప్రదీప్‌. 'భద్ర', 'అందరివాడు', 'లక్ష్మి', 'స్టాలిన్‌', 'దేశముదురు', 'యోగి', ''జై లవకుశ' తదితర చిత్రాల్లో కరడు కట్టిన విలన్‌ పాత్రలు పోషించి మెప్పించారు. అంతేకాదు 'ఓయ్‌', 'పూలరంగడు', 'నేనూ శైలజ', 'సరైనోడు', 'వాల్తేరు వీరయ్య' సినిమాల్లో కామెడీని కూడా అద్భుతంగా పోషించి ప్రేక్షకులను నవ్వించారు. 30 ఏళ్ల తన నట జీవితంలో దాదాపు వంద సినిమాల్లో నటించారు ప్రదీప్‌ రావత్‌.

ఆయన చివరి చిత్రం 'గాయపడ్డ సింహం' మే నెలలో విడుదలైంది. తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ చిత్రాల్లో నటించినా తెలుగు చిత్ర పరిశ్రమ అంటేనే తనకు ఇష్టమని, రాజమౌళి తన గాడ్‌ ఫాదర్‌ అనీ, తెలుగు చిత్ర పరిశ్రమ గాడ్‌ మదర్‌ అని ఒకసారి 'ఆంధ్రజ్యోతి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ప్రదీప్‌. ఒక్కగానొక్క కుమారుడు విక్రమాదిత్యని హీరోగా పరిచయం చేయాలనుకున్న ఆయన ఆ కోరిక నెరవేరకుండానే కన్ను మూశారు. ప్రదీప్ రావత్ మరణించిన విషయం తెలుసుకున్న సినీ అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy