Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

Chitrajyothy 1 month ago

తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళుగా నిలచిన యన్టీఆర్, ఏయన్నార్ తమ నటవారసులను అభిమానుల ముందు హీరోలుగా నిలిపారు. యన్టీఆర్ నటవారసునిగా బాలకృష్ణ 1984లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ చూశారు.

ఏయన్నార్ నటవారసత్వం నిలుపుతూ నాగార్జున 1986 మే 23న 'విక్రమ్'గా ఫ్యాన్స్ ను అలరించారు. హిందీలో ఘనవిజయం సాధించిన 'హీరో' మూవీ ఆధారంగా 'విక్రమ్' తెరకెక్కింది. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై నాగ్ అన్న వెంకట్ అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో 'విక్రమ్' రూపొందింది. శోభన నాయికగా నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చారు. వేటూరి పాటలు రాశారు. 'విక్రమ్'తోనే నాగ్ హీరోగా మంచి మార్కులు సంపాదించడం విశేషం.

'విక్రమ్'కు ముందు నెలల బాలుడుగా ఉన్నప్పుడే ఏయన్నార్ 'వెలుగు నీడలు' చిత్రంలో తెరపై కనిపించారు నాగార్జున. తరువాత తండ్రి నటించిన 'సుడిగుండాలు'లోనూ కాసేపు తళుక్కుమన్నారు. అందువల్ల నాగ్ బాలనటునిగా నటించిన చిత్రాలుగా వాటిని ఫ్యాన్స్ సైతం పరిగణించరు. 1986లోనే 'విక్రమ్'తో తొలిసారి తెరపై నాగ్ హీరోగా కనిపించారు. ప్రస్తుతం నాగార్జున నూరవ చిత్రం తెరకెక్కుతోంది. రా. కార్తిక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నలభై ఏళ్ళ కెరీర్ లో దాదాపు వంద చిత్రాల్లో నటించారు నాగ్. వీటిలో "కలెక్టర్ గారి అబ్బాయి, ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడతా, అన్నమయ్య, నువ్వు వస్తావని, సంతోషం, మన్మథుడు, శివమణి, నేనున్నాను, మాస్, శ్రీరామదాసు, సోగ్గాడే చిన్నినాయనా" వంటి జనరంజకమైన చిత్రాలు ఉన్నాయి. అయితే నాగ్ లోని అసలైన నటుణ్ణి జనం ముందు నిలిపిన చిత్రం 'అన్నమయ్య' అనే చెప్పాలి.

నటవారసుల్లో ప్రత్యేకం!

టాలీవుడ్ నటవారసుల్లో నాగార్జున తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్నారు. ఓ వైపు నటనిర్మాతగా, మరోవైపు స్టూడియో అధినేతగా, ఇంకోవైపు మీడియా హౌస్ భాగస్వామిగా సాగుతున్నారు నాగ్. ఇక ఆయన నటవారసులు నాగచైతన్య, అఖిల్ కూడా రాణిస్తూండగానే, తాను ఇంకా హీరోగా అలరిస్తూ ఉండడం విశేషం. త్వరలోనే తన వందో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నాగ్. ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటున్న నాగార్జున నటునిగా మరిన్ని చిత్రాలతో అలరిస్తాని ఆశిద్దాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy