Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కాగితం పడవలు' చిత్రబృందం చేసిన పనికి చిరు ఫిదా.. ఏం చేశారంటే

'కాగితం పడవలు' చిత్రబృందం చేసిన పనికి చిరు ఫిదా.. ఏం చేశారంటే

Chitrajyothy 3 weeks ago

ర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ, కాలక్రమేణా ఒక చిత్ర నిర్మాతగా మారిన మెగా అభిమాని అంజనప్ప (Anjanappa), 45 మంది తన స్నేహితులు, 'కాగితం పడవలు' (Kaagitham Padavalu) చిత్రబృందంతో కలిసి చిరంజీవి పై ఉన్న అభిమానంతో, వందల కిలోమీటర్లు ప్రయాణించి మరీ హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని రక్తదానం చేశారు.

'రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి' అని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇచ్చిన పిలుపును గుండెల్లో నింపుకుని, లక్షలాది మంది ప్రాణాలను కాపాడటంలో మెగాభిమానులు ఎప్పుడూ ముందుంటారని మరోసారి వారంతా నిరూపించారు. ఈ విషయం చిరంజీవి వరకు చేరడంతో ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

విశేషం ఏంటంటే.. అంజనప్ప ఇంతవరకు చిరంజీవిని నేరుగా కలవలేదు. కేవలం చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి తన బాధ్యతగా తన చిత్ర బృందంతో కలిసి రక్తదానం చేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. సినిమా షూటింగ్, ఇతర సామాజిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. అంజనప్ప అండ్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ స్వయంగా ఒక లెటర్ పంపించారు. ఈ లేఖలో..

''ప్రియమైన అంజనప్ప, గాయత్రమ్మ.. ఇంకా 'కాగితం పడవలు' చిత్రయూనిట్ సభ్యులకు.. మానవత్వాన్ని పరిమళింపజేస్తూ, సమాజం పట్ల మీ బాధ్యతను చాటుతూ మీరు చేపట్టిన రక్తదాన సేవా కార్యక్రమానికి నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 'కాగితం పడవలు' చిత్రయూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మొత్తం 23 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. వైద్య కారణాల వల్ల రక్తదానం చేయలేకపోయిన వారు, ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో రావడం కూడా ప్రశంసనీయం.

నిర్మాత అంజనప్ప, వారి సతీమణి గాయత్రమ్మ, వారి పిల్లలు స్వయంగా రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలవడం అభినందనీయం. కుటుంబమంతా కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా స్ఫూర్తిదాయకం. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి నుంచి ప్రత్యేకంగా 45 మంది హైదరాబాద్‌కు విచ్చేసి, వారిలో 23 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం మీ సేవా భావానికి నిదర్శనం. రాష్ట్రాల సరిహద్దులను దాటి మానవత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.జి.ఆర్. తుకారం, హీరో వర్ధన్, హీరోయిన్ కృష్ణప్రియ, కో డైరెక్టర్ సదానంద చారితో పాటు ఈ సేవా కార్యక్రమానికి విజయవంతం చేసిన 'కాగితం పడవలు' చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు అందించిన ఈ రక్తదానం ఎందరో ప్రాణాలకు ఆశాకిరణంగా నిలుస్తుంది. మీ సేవా స్ఫూర్తి మరెందరికో ఆదర్శంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రక్తసంబంధం కలకాలం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ.. మీ.. చిరంజీవి'' అని మెగాస్టార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాసిన ఈ లేఖ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

Spider - Man : షాకింగ్ రెమ్యూనరేషన్... మెస్సీ నా మజాకా!?

సమంత దూకుడు.. అనుష్కను మించి రికార్డుల వేట

'విశ్వంభర' సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy