Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karmaakhya Movie reveiw: కర్మాఖ్య మూవీ రివ్యూ

Karmaakhya Movie reveiw: కర్మాఖ్య మూవీ రివ్యూ

Chitrajyothy 3 weeks ago

'జబర్దస్త్' షోలో గుర్తింపు తెచ్చుకున్న 'అదిరే' అభి (అభినయ కృష్ణ) గతంలో 'చిరంజీవా' సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మలియత్నంగా 'కామాఖ్య' అనే సినిమాను తెరకెక్కించాడు.

అయితే సెన్సార్ అభ్యంతరాలతో ఆ సినిమా పేరును 'కర్మాఖ్య'గా మార్చారు. తాంత్రిక విద్యల నేపథ్యంలో తెరకెక్కిన 'కర్మాఖ్య' ఎలా ఉందో చూద్దాం.

ఈశాన్య భారతంలో అతి ప్రాచీనమైనది కామాఖ్య దేవాలయం. అక్కడ తాంత్రికులకు కొదవలేదు. మూడు తరాల క్రితం ఓ కుటుంబం అక్కడి నుంచి ఆంధప్రదేశ్‌కు వస్తుంది. ఆ కుటుంబానికి సంబంధించిన కథే 'కర్మాఖ్య'. తాంత్రిక పూజలు చేస్తున్న ఆ కుటుంబ పెద్ద (మధునందన్‌)ను, అతని భార్యను గ్రామస్తులు చంపేస్తారు. వారి ఐదేళ్ళ పాప మాత్రం బతికి బయట పడుతుంది. ఇది జరిగిన పాతికేళ్ళకు ఇప్పటి కథ మొదలవుతుంది. కామాఖ్య (సమైరా), ప్రవల్లిక (శరణ్య ప్రదీప్‌) ఒకే హాస్టల్ లో ఉంటారు. ప్రవల్లిక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తుంది. కామాఖ్య ఉద్యోగం పోగొట్టుకుని కొత్త జాబ్ కోసం ట్రై చేస్తుంటుంది. అటువంటి సమయంలో ఇన్యూరెన్స్ క్లయిమ్‌ చేసిన ఒకరి వివరాల సేకరణ కోసం ప్రవల్లిక బదులు కామాఖ్య వెళుతుంది. విశాఖ అవుట్‌కట్స్ లోని ఓ ఇంటికి వెళ్ళిన కామాఖ్యకు అక్కడి వ్యక్తులు, వారి ప్రవర్తన చిత్రంగా అనిపిస్తాయి. అక్కడ నుంచి వెంటనే తిరిగి వెళ్ళాలనుకుంటూ ఉండగా, వారు ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తారు. ఊహించని విధంగా సిటీకి దూరంగా ఉన్న ఆ ఇంటిలో చిక్కుకుపోయిన కామాఖ్య అక్కడి నుంచి ఎలా బయట పడింది? అసలు ఆమెను ఆ ఇంటిలోని వాళ్ళు ఎందుకు బంధించారు? ఆమె నుంచి వాళ్ళు ఆశిస్తున్నదేమిటీ? కామాఖ్యను ఈ ఉచ్చులోకి లాగిన తెరవెనుక మనుషులు ఎవరు? అనేది మిగతా కథ.

హారర్ చిత్రాలు, హారర్ కామెడీ చిత్రాలకు తెలుగులో కొదవలేదు. అదే తరహాలో కొంతకాలంగా తాంత్రిక పూజల నేపథ్యంలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ కోవలో నరబలిని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలూ ఉన్నాయి. ఇది కూడా అదే తరహా సినిమా. చనిపోయిన వ్యక్తులు తాంత్రిక పూజలతో తిరిగి బ్రతుకుతారనే పిచ్చి నమ్మకంతో కొందరు శవాన్ని దహనం చేయకుండా రోజుల తరబడి ఇంటిలోనే దాచిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ ప్రయత్నం చేయాలనుకున్న కుటుంబానికి ఎలాంటి శాస్తి జరిగిందన్నది 'కర్మాఖ్య'లో చూపించారు.

తాంత్రిక విద్యలు తెలిసిన వారిని సజీవ దహనం చేయడం, వేటకొడవళ్ళతో నరికి చంపడమన్నది కొన్ని గ్రామాల్లో జరుగుతున్నదే. ఈ సినిమా కూడా అలాంటి సన్నివేశంతోనే మొదలైంది. ఆ తర్వాత సన్నివేశాలూ ఏమంత ఆసక్తిని కలిగించవు. ఈ క్రమంలో వచ్చే ధనరాజ్ కామెడీ సైతం అలరించదు. అయితే... ఇన్సూరెన్స్ పాలసీ సమాచారం కోసం కామాఖ్య ఓ ఇంటికి వెళ్ళి బందీ అయినప్పటి నుంచి కథ ఊపందుకుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలవుతుంది. అదే ఇంటిలో కామాఖ్య ఓ శవాన్ని చూడటం, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, తిరిగి ఆ కుటుంబానికి చిక్కడం... ఇవన్నీ ఆసక్తిని కలిగించే సన్నివేశాలే. కాకపోతే కథంతా అక్కడక్కడే తిరగడంతో ప్రేక్షకులలో చిన్నపాటి అసహనం మొదలవుతుంది. కానీ చివరిలోని నరబలి ట్విస్ట్ ఎవ్వరూ ఊహించనిది. ఆ సన్నివేశంతో సినిమా గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతుంది. ఈ సినిమాకు 'కర్మాఖ్య' అనే టైటిల్ పెట్టడాన్ని ఆ సన్నివేశంతో జస్టిఫై చేసినట్టు అయ్యింది. చనిపోయిన వారు తిరిగి రారనే విషయాన్ని జీర్ణం చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదని దర్శకుడు చూపించినా... చివరలో సినిమాటిక్‌ ట్విస్ట్ తో శుభం కార్డు వేశారు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాతో పరిచయమైన సమైరా తన పాత్రకు చక్కని న్యాయం చేకూర్చింది. చక్కని హావభావాలను పలికించింది. అలానే ప్రధాన పాత్రలు పోషించిన అభిరామి, ఆనంద్ ఆ యా పాత్రలలో చక్కగా ఇమిడిపోయారు. కూతురును పోగొట్టుకున్న దుఃఖాన్ని, ఆమెను తిరిగి పొందాలనే ఆరాటాన్ని బాగా చూపించారు. ప్రేక్షకుల ఊహకందని పాత్రను శరణ్య ప్రదీప్‌ పోషించి, మెప్పించింది. సముతిరకని ది ఇందులో కీలక పాత్ర. అయితే అవినీతి పరుడైన పోలీస్‌గా అతన్ని పాత్రను ఎస్టాబ్లీష్‌ చేసిన విధానం పెద్దంత గొప్పగా లేదు. చివరిలో హీరోయిన్ పాత్రకు లింక్ చేసిన ప్రయత్నం కూడా ఆఫ్‌ కుక్కుడ్ గానే ఉంది. మధునందన్‌, వైష్ణవ్‌, ధనరాజ్, రాఘవ, గడ్డం నవీన్ తదితరులు ఇతర పాత్రలలో కనిపిస్తారు. జ్ఞాని అందించిన నేపథ్య సంగీతం బాగుంది. వడ్డేపల్లి శ్రీవాణి నాధ్‌, యశ్వంత్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. నిడివి 125 నిమిషాలే ఉన్నా... కొన్ని సన్నివేశాలు భారంగా సాగుతాయి. కథ అక్కడ నుంచి ముందు సాగడం లేదేమిటనే భావన కలుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్‌ మూవీస్‌ ను థియేటర్లలో కంటే ఓటీటీలో చూసినప్పుడు బెటర్‌గా అనిపిస్తాయి.

రేటింగ్‌: 2.5/5

ట్యాగ్‌ లైన్: కర్మనుసారే!

ఇవి కూడా చదవండి:

సినిమా రివ్యూ: 'నూటన్స్‌ థర్డ్‌ లా'

Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

Spider-Man: Brand New Day Review: స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy