Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మనిషికి.. జ్ఞాపకమే సొంతనేల! మై వాపస్ అవుంగా చెప్పే కథ

మనిషికి.. జ్ఞాపకమే సొంతనేల! మై వాపస్ అవుంగా చెప్పే కథ

Chitrajyothy 17 hrs ago

దేశాన్ని కోల్పోవడం, ప్రేమించిన మనిషిని కోల్పోవడం ఒకే గాయపు రెండు దుఃఖాలు. ఆ జంట కన్నీటి చారికల కథే మై వాపస్ ఆవూంగా (Main Vaapas Aaunga). ఇది ప్రేమకథ అనుకుంటే ప్రేమకథే.

దేశవిభజన కథ అనుకున్నా పర్లేదు. వృద్ధాప్యం, జ్ఞాపకం, మతం, ఇల్లు, నిరీక్షణ, మరణం గురించిన సినిమా అనుకున్నా అన్నీ అవును. కానీ కొంచెం లోతుగా చూస్తే జీవితమంతా మనిషి ఎక్కడికి తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు అనే ప్రశ్నకు సమాధానం. 'మై వాపస్ ఆవూంగా' అనడం మాట ఇవ్వడం అనుకుంటాం కానీ శాపం కూడా. ఎందుకంటే తిరిగి రావడానికి ముందు 'తిరిగి వెళ్లడానికి ఒక చోటు' మిగిలి ఉండాలి. తిరిగి రాలేని కాలానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమే. జీవితంతో పాటు కాలాన్ని కూడా చూపి, మనలో ఎప్పుడో మూసేసిన గది తాళం తీసి, అక్కడ ఇంకా ఎవరో ఎదురుచూస్తున్నారని గుర్తు చేసేదే గొప్పకథ. 'మై వాపస్ ఆవూంగా' ఆ జ్ఞాపకం.

95 ఏళ్ల ఈషర్ సింగ్ డిమెన్షియాతో బాధపడుతూ జీవన చరమాంకంలో ఉంటాడు. తాత స్థితి చూసి, విదేశాల నుంచి వచ్చిన మనవడు నిర్వైర్ ఆయనకు పరిచర్యలు చేస్తుంటాడు. ఈషర్ సింగ్ పదే పదే తన స్వగ్రామం, ప్రస్తుత పాకిస్తాన్‌లోని సర్గోదాకు వెళ్లాలంటూ నేను తిరిగి వస్తాను' అని కలవరిస్తుంటాడు. భారత పాక్ విభజన నాటికి ప్రేమలో ఉన్న యువ ఈషర్, జియా దేశ విభజన సమయంలో ఏర్పడిన అల్లర్ల నేపథ్యంలో ఇద్దరూ చెరొక దేశంలో మిగిలి పోతారు. ఆ ప్రేమికుడు వెళ్లిపోతూ వెళ్లిపోతూ నేనొస్తాను అని మాట ఇస్తాడు. నిజానికి రాలేకపోతాడు. ఆ రాలేకపోవడం వయసు 87 సంవత్సరాలు. అయితే అతను రాలేదు అన్నది అబద్ధం. అతను ప్రతీ శ్వాసలో వస్తూనే ఉన్నాడు. ప్రతీ జ్ఞాపకంలో వస్తూనే ఉన్నాడు. ప్రతీ మతిమరుపులోనూ వస్తూనే ఉన్నాడు. ప్రతీ ఆలోచనలోనూ ప్రతీ ఊహలోనూ వస్తూనే ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆమె కోసం తిరిగి వెళ్లలేకపోయాననే నేరభావన, ఆవేదన ఈషర్ గుండెల్లో దశాబ్దాలుగా ఉండిపోతాయి. తాత చివరి కోరికను, ఆయన గతాన్ని అర్థం చేసుకున్న మనవడు. రెండు భిన్నతరాల ప్రేమ, బంధాల మధ్య ఆ జ్ఞాపకాలను ఎలా ముగించాడనేదే కథ.

బహుశా జీవితంలోని అత్యంత అసాధ్యమైన ప్రయాణం ఈ పోతూనే ఉండడం. మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఒక ఇంటికి, ఒక మనిషి దగ్గరకు, ఒక ప్రేమలోకి, ఒక బాల్యం లోకి తిరిగి వెళ్లాలనుకుంటాం. కానీ మనం తిరిగి వెళ్లాలనుకునే ప్రదేశాలు చాలాసార్లు ప్రదేశాలు కావు. అవి కాలాలు. జీవితంలోని అత్యంత అసాధ్యమైన ప్రయాణం ఇదేనేమో. కాలానికి రిటర్న్ టికెట్ ఉండదు. అందుకే 'మై వాపస్ ఆవూంగా' చివరికి ప్రేమకథగా మిగలదు. అది తిరిగి రాలేనని తెలిసినా తిరిగి వస్తానని మాటిచ్చే మనిషి గురించి ఒక వాగ్దాన భంగంగా మారుతుంది. కథలో డిమెన్షియా కేవలం వైద్యస్థితి కాదు. అది కథ చెప్పే ఒక తాత్విక పరికరం. గతం, వర్తమానం మధ్య పదే పదే మూసుకునీ తెరుచుకునే తలుపు.

వృద్ధ ఈషర్ ఈ కథలో ఒక ప్రేమికుడు కాదు. కదలలేక మంచం మీద తీసుకుంటున్న ఒక చరిత్ర. వర్తమానాన్ని పొరలు పొరలుగా తుడిచేస్తున్న మతిమరుపును 95 ఏళ్ల ఈషర్ సింగ్ గ్రేవాల్ గా నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) వణికే చేయి, అస్పష్టమైన చూపు, పూర్తికాని మాటతోనే 78 ఏళ్ల వేదనను మోస్తూ మనకూ ఇస్తాడు. గమ్మత్తేమిటంటే వర్తమానం మసక బారుతున్న కొద్దీ ఆయనకు గతం మరింత స్పష్టమవుతూంటుంది. ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండటమే ప్రేమ అయితే ఈ ప్రేమ ఎప్పుడో చనిపోయింది. కానీ ప్రేమ అంటే ఒక మనిషి మనలో మిగిలిపోవడం అయితే అది 78 సంవత్సరాల తర్వాత కూడా బతికే ఉంది. విభజన అయిపోయింది కదా అంటుంది. చరిత్ర. కానీ వేదనకు తేదీలు, మాసాలు, సరిహద్దులు ఉండవు కదా అంటుంది ప్రేమ.. అందుకే సినిమాలో విభజన ఒక ఫ్లాష్ బ్యాక్ కాదు. అది వారసత్వం. ఈషర్ తన గతాన్ని మాత్రమే మోస్తున్నాడనుకుంటాం. తన తర్వాతి తరాలు కూడా ఆ గతం వేసిన నీడలోనే జీవిస్తున్నాయని క్రమంగా తెలుస్తుంది.

ఈ వారసత్వ వేదనే చిత్రంలోని కీలక అంతర్లీన అంశం. ముసలోడు చస్తే బాగుండు. అనుకునే తరంలోంచే.. తాతను ఆయన గతం లోకి తీసుకువెళ్లాలని తపనపడే యువకుడూ ఉండడం బహుశా జీవన వ్యంగ్యం కావచ్చు. ఆ యువకుడి పాత్రలో దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh) నసీరుద్దీన్ షా తరవాత చెప్పుకోదగ్గ ఏకైక పేరుగా నిలిచాడు. 1947లో భారతదేశం రెండు దేశాలుగా మాత్రమే విడిపోలేదు. దేశానికి జరిగిన విభజన కంటే, మనిషిలో జరిగిన విభజన గురించే సినిమాలో ఇంతియాజ్ అలీ (Imtiaz Ali) మాట్లాడాడు. ఒక భాగం సరిహద్దు ఇటువైపు బతుకుతుంది. ఇంకో భాగం అటువైపు ఉండిపోయిన ప్రేమ దగ్గరే నిలిచిపోతుంది. శరీరం మాత్రం వృద్ధాప్యంలోకి ప్రయాణిస్తుంది. మనసేమో ఒక తేదీ దగ్గర ఆగిపోతుంది. ఇంతియాజ్ అలీ ఈ డిస్ ప్లేస్‌మెంట్‌ను ప్రేమతో ముడిపెట్టడం వల్ల కథ మరింత కన్నీటిమయం అయింది.

ద్వేషం చరిత్రలో ముగిసిపోయిన సంఘటన ఎప్పటికీ కాదనీ.. సరైన సాకు దొరికినప్పుడల్లా పదే పదే వచ్చే జ్ఞాపకమనీ ఈ కథ రాజకీయ ప్రకటన కూడా చేస్తుంది. చివరి 45 నిమిషాల్లోనే సినిమా భావోద్వేగం ఉత్కర్షకు చేరుతుంది. మనిషి చరిత్ర మనిషిని దేశం నుంచి తరిమేయగలదు. అతని నడకను సరిహద్దు ఆపగలదు. అతని శరీరాన్ని వృద్ధాప్యం తీసుకుపోగలదు. మతిమరుపు అతని పేర్లను కూడా చెరిపేయగలదు. కానీ అన్నీ పోయినా కూడా ఒక జ్ఞాపకం మిగిలితే.. మనిషి చివరిసారిగా అక్కడే నిశ్చింతగా నిద్రపోతాడు. మనిషికి జ్ఞాపకమే తనదైన సొంత నేల. దానికోసం మానసికంగానైనా తిరిగిస్తాడు.

- ప్రసేన్‌.. 98489 97241

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy