Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NTR: ఐదేళ్ళ గ్యాప్‌తో మూడు సినిమాలు... అన్నింటిలోనూ అన్నగానే!

NTR: ఐదేళ్ళ గ్యాప్‌తో మూడు సినిమాలు... అన్నింటిలోనూ అన్నగానే!

Chitrajyothy 6 days ago

తెలుగునాట 'అన్న' అనగానే చప్పున గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న యన్టీఆర్ అనే చెప్పాలి. ఆయన నటించిన మూడు చిత్రాలు మే 19న మూడు రకాలుగా పూర్తయ్యాయి.

ఈ మూడింటిలోనూ యన్టీఆర్ 'అన్న'గా నటించారు.

నటరత్న యన్టీఆర్ (NTR) నటించిన మూడు చిత్రాలు ఒక్కోటి ఐదేళ్ళ గ్యాప్ తో మే 19 తేదీనే రిలీజ్ అయ్యాయి. అలా 1966 మే 19న రిలీజైన 'మంగళసూత్రం' (Mangalasutram) 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ తరువాత ఐదేళ్ళకు అంటే 1971లో సేమ్ డేట్ కు జనం ముందు నిలచిన 'రైతుబిడ్డ' (Raithubidda) కు 55 సంవత్సరాలు నిండాయి. ఆ పై ఐదేళ్ళకు వచ్చిన 1976 నాటి 'మగాడు' (Magadu) కు 50 ఏళ్ళు పూర్తయ్యాయి. అదేమీ పెద్ద విశేషం కాదే అనుకోవచ్చు. అయితే ఈ మూడు చిత్రాల్లోనూ యన్టీఆర్ 'అన్న'గా నటించారు. 'మంగళసూత్రం'లో యన్టీఆర్ తమ్మునిగా పద్మనాభం నటించారు. 'రైతుబిడ్డ'లో రామారావు తమ్ముని పాత్రలో జగ్గయ్య అభినయించారు. 'మగాడు'లో యన్టీఆర్, రామకృష్ణ అన్నదమ్ములుగా కనిపించారు.

తమ్ముడంటే ప్రాణం పెట్టే అన్నగా...

ఏ.కే. వేలన్ స్వీయ దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా 'మంగళసూత్రం' చిత్రాన్ని నిర్మించారు. 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో దేవిక, వాసంతి నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి టి.చలపతిరావు సంగీతం సమకూర్చారు. శ్రీశ్రీ, కొసరాజు, దాశరథి పాటలు రాశారు. ఈ మూవీ అంతగా అలరించలేదు. రిపీట్ రన్స్ లో మాత్రం మంచి ఆదరణ పొందింది. ఈ మూవీ వచ్చిన ఐదేళ్ళకు 'రైతుబిడ్డ' మే 19నే విడుదలయింది. బి.ఏ.సుబ్బారావు దర్శకత్వంలో కోట్ల వెంకటరామయ్య నిర్మించిన 'రైతుబిడ్డ' శతదినోత్సవం జరుపుకుంది. వాణిశ్రీ నాయికగా నటించారు. ఇందులో సవతి తల్లి కొడుకైనా తమ్ముడంటే ప్రాణమిచ్చే అన్నయ్యగా తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు యన్టీఆర్. ఈ చిత్రానికి యస్.హనుమంతరావు స్వరకల్పన చేశారు. కొసరాజు, సి.నారాయణ రెడ్డి పాటలు సమకూర్చారు.

'దీవార్' రీమేక్ 'మగాడు'...

యన్టీఆర్ హిందీ చిత్రాల రీమేక్స్ తో జైత్రయాత్ర చేస్తున్న సమయంలో రూపొందిన సినిమా 'మగాడు'. హిందీలో ఘనవిజయం సాధించిన 'దీవార్' ఆధారంగా తెలుగులో 'మగాడు' తెరకెక్కింది. ఒకప్పుడు యన్టీఆర్ తో 'దాసి', 'నర్తనశాల', 'శకుంతల' వంటి చిత్రాలు నిర్మించిన ఆయన హీరోయిన్ లక్ష్మీరాజ్యం నిర్మాతగా 'మగాడు' రూపొందింది. యస్.డి.లాల్ దర్శకత్వం వహించారు. యన్టీఆర్ జోడీగా మంజుల, రామకృష్ణ జంటగా లత నటించారు. అమ్మంటే ప్రాణం పెట్టే అన్నదమ్ముల కథతో 'మగాడు' తెరకెక్కింది. సంఘవిద్రోహక శక్తిగా ఉన్న అన్నను సొంత తమ్ముడు కాల్చిచంపే కథతో 'మగాడు' రూపొందింది. యాభై ఏళ్ళ క్రితం వచ్చిన 'మగాడు' అభిమానుల ఆదరణ చూరగొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy