మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది (peddi) పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త సినీ అనుభూతి అందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా మరో కీలక అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రను అధికారికంగా పరిచయం చేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 'గౌర్నాయుడు' పాత్రలో శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. వీడియోలో కుస్తీ నేపథ్యంలో ఆయన చూపించిన గంభీరమైన ప్రెజెన్స్ పాత్ర ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తోంది. తెరపై ఆయన పాత్ర కథకు కీలక మలుపు తిప్పేలా ఉండబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతికంగా కూడా చిత్రం భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు విజువల్స్ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు. ఎడిటర్ నవీన్ నూలి పనిని పూర్తి చేయగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా కొనసాగుతోంది.

