Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramayana: చాలా సందేహాలు తీర్చేసిన.. 'రామాయణ' ట్రైలర్‌

Ramayana: చాలా సందేహాలు తీర్చేసిన.. 'రామాయణ' ట్రైలర్‌

Chitrajyothy 1 week ago

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తితో ఎదురుచూస్తున్న 'రామాయణ' (Ramayana) ట్రైలర్‌ వచ్చేసింది. నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడి పాత్రలో యశ్ (Yash) నటిస్తున్నారు.

నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన నాలుగు నిముషాల పది సెకన్ల సుదీర్ఘ నిడివి కలిగిన ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని వివరిస్తూ విజువల్‌గా ఎంత ఉన్నత స్థాయిలో ఉంటుందో తెలిపే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ చిత్రంలోని విజువల్స్‌తో పొల్చుకుంటే ఈ సినిమాలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ క్వాలిటీగానే ఉందని చెప్పాలి. 'దేవలోకం.. భూలోకం.. పాతాళ లోకం.. ముల్లోకాల్లో ఇక ఒకటే సామ్రాజ్యం..రావణ రాజ్యం' అంటూ యశ్‌ పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్‌ ప్రారంభమైంది. 'చీకట్లను పారదోలేందుకు ప్రతి యుగంలోనూ శ్రీ మహావిష్ణువు అవతారమెత్తుతాడు' అంటూ రాముడి పాత్రను వివరించారు. ఆ పాత్రలో రణ్‌బీర్‌ చక్కగా ఒదిగాడని చెప్పాలి. మృదుస్వభావి అయిన సీత పాత్రను ఖడ్గం పట్టిన యోధురాలిగా చూపించడం విశేషం.

బుల్లితెర సీరియల్‌ 'రామాయణ్‌'లో శ్రీరాముడిగా నటించిన అరుణ్‌ గోవిల్‌, ఈ చిత్రంలో దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నటి శోభన కైకసి పాత్రలో నటిస్తుండగా, అజింక్య దేవ్‌ విశ్వామిత్ర మహర్షిగా, కునాల్‌ కపూర్‌ ఇంద్రుడిగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శూర్పణఖగా, రవీ దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ట్రైలర్‌ విడుదల సందర్భంగా నిర్మాత నమిత్‌ మల్హోత్రా మాట్లాడుతూ 'రామాయణం మహాకావ్యం మాత్రమే కాదు. అది మన జీవన విధానంలో ఒక భాగం. వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ కథ నేటికీ కోట్లాది మంది దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తోంది' అని అన్నారు. 'రామాయణం ఇప్పటికీ విశ్వవ్యాప్తమైన కథ. సంపూర్ణ నిజాయితీతో, ప్రామాణికతతో దానిని తెరకెక్కించడమే నా బాధ్యత' అని దర్శకుడు నితీశ్‌ తివారి పేర్కొన్నారు.

హనుమంతుడు మిస్సింగ్‌..

'రామాయణ' ట్రైలర్‌ విడుదలైన కొద్ది సేపటికే సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ ట్రైలర్‌లో కీలక పాత్రలన్నీ పరిచయం చేసిన మేకర్స్‌.. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) పోషించిన హనుమంతుడి క్యారెక్టర్‌ను మాత్రం గోప్యంగా ఉంచారు. దీంతో నెటిజన్లు హనుమంతుడి పాత్ర లేకుండా 'రామాయణ' ట్రైలర్‌ను ఎలా రిలీజ్‌ చేస్తారంటూ చిత్రబృందాన్ని నిలదీశారు. కనీసం ఒక చిన్న గ్లింప్‌ అయినా చూపించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న నేపథ్యంలో కావాలనే, ట్రైలర్‌లో ఆ పాత్రను చిత్రబృందం పరిచయం చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy