Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramayana: ఈ సీతమ్మపైనే.. ట్రోల్స్ ఎందుకు!

Ramayana: ఈ సీతమ్మపైనే.. ట్రోల్స్ ఎందుకు!

Chitrajyothy 1 week ago

న దేశంలోనే అత్యంత భారీ చిత్రంగా 'రామాయణ' రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇంతటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో శ్రీరామునిగా రణబీర్ కపూర్ ( Ranbir Kapoor), సీతగా సాయిపల్లవి నటించారు.

దీపావళి కానుకగా ఈ చిత్రం జనం ముందుకు రానుంది. సీత పాత్రకు సాయిపల్లవితోనే డబ్బింగ్ చెప్పించడం వల్ల అనుకోవచ్చు- ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే పౌరాణిక గాథల్లోని పదాలు గ్రాంథిక శోభతో విరజిల్లుతాయి. ఆ పదాలను పలకడం కూడా ఓ కళ. అయితే సాయిపల్లవి మాటల్లో ఆమె నటించిన సోషల్ మూవీస్ ఎఫెక్టే కనిపిస్తోందని అంటున్నారు. దాంతో సీత పాత్రకు సాయి పల్లవి అసలు న్యాయం చేసిందా అన్న అనుమానాలు కలిగించేలా ట్రోల్స్ సాగుతున్నాయి.

సీతమ్మ తల్లి అంటే అంజలీదేవి...

భారతీయ పురాణగాథలను, ఇతిహాసాలను తెరకెక్కించడంలో తెలుగువారిదే పైచేయి. అందునా యన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలు ఉత్తరాది భాషల్లోనూ అనువాదమై అలరించాయి. ఆ కారణంగానే హిందీ దర్శకనిర్మాతలు తాము పురాణగాథలు తెరకెక్కించే సమయంలో యన్టీఆర్ సలహాలు సూచనలు తీసుకున్నారు. 'రామాయణ' చిత్ర దర్శకుడు నితేశ్ తివారీ సైతం పరిశోధన చేసేవారే. 'రామాయణ' తాజా ట్రైలర్ చూస్తోంటే నితేశ్ పనితనం కనిపిస్తోంది. కానీ, సీత పాత్రకు సాయిపల్లవి రాంగ్ ఛాయిస్ అన్నది తెలుగునాట పలువురి మాట. అందుకు కారణం లేకపోలేదు. 1963 నాటి 'లవకుశ'తో సీతమ్మ తల్లిగా జనం మదిలో నిలిచారు అంజలీదేవి. ఆ సినిమాలో నవరసాలనూ అంజలీదేవి అభినయించిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు. అందుకే ఈ నాటికీ తెలుగువారి మదిలో సీతమ్మ తల్లిగా కొలువై ఉన్నారు అంజలీదేవి.

నిస్సందేహంగా.. జయప్రద..

'లవకుశ'లో సీతమ్మగా అంజలీదేవి (Anjali Devi) తన అభినయంతో ఆకట్టుకుంటే అదే బాటలో 'సంపూర్ణ రామాయణం'లో చంద్రకళ సీత పాత్రను ప్రతిభావంతంగా పోషించారు. తెలుగు నటి అయిన జయప్రద అందమైన మోమును సత్యజిత్ రే అంతటి దిగ్దర్శకులు 'ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్' అని శ్లాఘించారు. అలా జయప్రద (Jayaprada) తన అందమైన మోముతో "సీతాకళ్యాణం, సీతారామవనవాసము" వంటి తెలుగు చిత్రాల్లోనూ 'లవ్ కుశ్' అనే హిందీ సినిమాలోనూ సీతాదేవిగా అలరించారు. అందువల్ల ఇప్పుడు ఎవరు సీత పాత్రను పోషించినా జయప్రద అందంతో బేరీజు వేస్తారు. నిస్సందేహంగా జయప్రద అందంతో పోటీపడగల వారు ఈ తరం నటీమణుల్లో కనిపించడం లేదనే చెప్పాలి.

నాటి నుంచి నయన్ దాకా..

ఈ మధ్య కాలంలో సీతమ్మ పాత్రలో ఆకట్టుకున్న నటీమణి ఎవరంటే నయనతార అనే చెప్పాలి. అంతకు ముందు గ్లామర్ రోల్స్ లో అలరించిన నయనతార బాపు తెరకెక్కించిన 'శ్రీరామరాజ్యం'లో సీత పాత్రను సమర్థవంతంగా పోషించారు. బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ చిత్రం కూడా 'లవకుశ' లా ఉత్తర రామాయణగాథతోనే రూపొందింది. అంజలీదేవి అంతబాగా నయనతార నటిస్తుందా అని అప్పట్లోనూ పలువురు సందేహం వ్యక్తం చేశారు. అయితే బాపు నయనతారను తనదైన పంథాలో సీతగా తీర్చిదిద్ది జనామోదం పొందేలా చేశారు. అలా అరవై ఏళ్ళకు పైబడిన కాలంలో సీతమ్మ పాత్రలో నటించిన పలువురు నటీమణులను గుర్తు చేసుకుంటున్నారు తెలుగువారు. మరి తెలుగునాట సాయిపల్లవి (Sai Pallavi)కి ఎలాంటి మార్కులు లభిస్తాయో ?

అందరూ అందరే..

తెలుగునాట 1932 నుండి 2011 దాకా ఎంతోమంది నటీమణులు సీతమ్మ పాత్రలో అలరించారు. సురభి కమలాబాయి, సీనియర్ శ్రీరంజని, పుష్పవల్లి, రాజశ్రీ, గీతాంజలి, కృష్ణకుమారి, శారద, బి.సరోజాదేవి, సంగీత, స్మితా మాధవ్ వంటివారు పూర్తి స్థాయిలో సీత పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక విజయనిర్మల, లయ, వేద, కనక వంటి వారు ప్రత్యేక గాథల్లో మురిపించారు. హిందీలోనూ పలువురు సీతమ్మ పాత్రను ప్రతిభావంతంగా పోషించారు. ప్రస్తుతం 'రామాయణ'లో రామునిగా నటిస్తోన్న రణబీర్ కపూర్ ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ శ్రీరామ పాత్ర పోషించిన 'సీత'లో దుర్గా ఖోటే సీతమ్మగా అలరించారు. ఆపై అనితా గుహ, బినా రాయ్, శోభనా సమర్థ్, మౌసమీ ఛటర్జీ వంటివారు సైతం హిందీ చిత్రాల్లో సీతాదేవిగా అభినయించి ఆకట్టుకున్నారు. ఇప్పటికీ 1967 నాటి 'రామ్ రాజ్య'లో సీతాదేవిగా నటించిన బినా రాయ్ అందాన్ని గుర్తు చేసుకొనేవారు ఎందరో ఉన్నారు.

బుల్లితెర సీత.. దీపిక..

తరువాతి రోజుల్లో రామాయణం ఆధారంగా పలు హిందీ ధారావాహికలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 1987 నాటి రామానంద్ సాగర్ 'రామాయణ్'లో సీతగా నటించిన దీపికను జనం ఈ నాటికీ మరచిపోలేదు. 2001లో జీటీవీ 'రామాయణ్' సీరియల్ లో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ సైతం సీతగా ఆకట్టుకున్నారు. తరువాతి రోజుల్లో దేవినా బెనర్జీ, శివ్యా పఠానియా, మదిరాక్షి ముండలే వంటి నటీమణులు సైతం 'రామాయణ్' సీరియల్స్ లో సీతగా అభినయించి అలరించారు. వీరందరితో పోలిస్తే సాయి పల్లవి సీతగా ఏ మాత్రం నిలవడం లేదనే ఉత్తరాదిన సైతం వినిపిస్తోంది. సాయి పల్లవి మంచి నటి అంటూనే ఈ మధ్యే దీపిక 'సీత పాత్రకు తగిన రూపురేఖలు ఉండాలి' అని అన్నారు. అవి తనలో ఉన్న కారణంగానే రామానంద్ సాగర్ అదే పనిగా తనను సీతగా ఎన్నుకున్నారనీ దీపిక గుర్తు చేశారు.. మరి దీపావళికి రాబోయే 'రామాయణ'లో సాయి పల్లవి ఏ మేరకు జనాన్ని రంజింప చేస్తారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy