గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ 'పెద్ది' చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే!
రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం విడుదల తేదీలో క్లారిటీ వచ్చింది. ఇటీవల మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క 'వాట్ నెక్ట్స్ రామ్‌చరణ్?' అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.
తదుపరి చిత్రం ఆయన సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇది గతంలో కమిట్ అయిందే!
ఆర్‌సీ17 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు ఓ బలమైన కథను తయారు చేస్తున్నారట సుక్కూ. ఇప్పటికే లెక్కల మాస్టర్ స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి తెచ్చారని, తుది మెరుగులు దిద్దుతున్నారని చిత్ర వర్గాల నుంచి సమాచారం అందింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సోమవారం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని జులైలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని తెలిసింది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన చెర్రీ వెల్లడించారు. 'రంగస్థలం'లాంటి భారీ విజయం తర్వాత సుకుమార్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై కూడా భారీ అంచనాలున్నాయి.

