Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీ అమ్మ భగవాన్ బోధనలతో 'ఏదైనా సాధ్యమే'

శ్రీ అమ్మ భగవాన్ బోధనలతో 'ఏదైనా సాధ్యమే'

Chitrajyothy 1 week ago

హైదరాబాద్‌లో ఆధ్యాత్మికత, మానవ సంబంధాల సందేశాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న కొత్త చిత్రం 'ఏదైనా సాధ్యమే'. 'దైవం తోడుంటే..' అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టైటిల్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు మద్దూరి రాజా, నిర్మాత అనిల్ మునగనూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సుబ్రహ్మణ్యం పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆధ్యాత్మిక విశ్వాసం మనిషి జీవితాన్ని ఎలా మార్చగలదో, తన ఇష్టదైవంతో అనుబంధం పెంచుకుంటే జీవితంలోని బాధలు ఎలా అధిగమించవచ్చో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు వెల్లడించారు.

ప్రత్యేకంగా శ్రీ అమ్మ భగవాన్ బోధనల స్ఫూర్తితో ఈ సినిమా కథను నిర్మిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. "నీవు ప్రత్యేకమైన వ్యక్తివి", "నీ ఆంతరంగిక ప్రపంచమే బాహ్య ప్రపంచం", "వ్యక్తి లేడు.. వ్యక్తిత్వాలు మాత్రమే ఉన్నాయి", "అంతర్గత సత్యమే అసలు నిజం", "జీవితమంటే బాంధవ్యాలు" అనే ఐదు ముఖ్యమైన సూత్రాల చుట్టూనే కథనం సాగనుంది.

కథ, మాటలు, సాహిత్యాన్ని అందిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ మునగనూరి మాట్లాడుతూ.. ప్రస్తుతం యువతలో పెరుగుతున్న నిరాశ, డిప్రెషన్‌కు ఆధ్యాత్మిక దారి ఒక సమాధానంగా నిలవగలదని అన్నారు. మనిషి భగవంతుడితో బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటే అసాధ్యాలు కూడా సాధ్యాలుగా మారతాయని, అదే ఈ సినిమా ప్రధాన సందేశమని చెప్పారు.

దర్శకుడు రాజా మధురి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, రమేష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫణీంద్ర ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. త్వరలో నటీనటులు, విడుదల తేదీ సహా మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy