Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srinivasa Mangapuram: నెపో కిడ్స్‌తో అశ్వనీదత్‌ సినిమాలు!

Srinivasa Mangapuram: నెపో కిడ్స్‌తో అశ్వనీదత్‌ సినిమాలు!

Chitrajyothy 5 days ago

'వైజయంతీ మూవీస్' బ్యానర్ తెలుగువారి మదిలో సుస్థిరస్థానం సంపాదించింది. ఈ బ్యానర్ కు ఆ పేరు పెట్టింది నటరత్న యన్టీఆర్. ఈ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన మొదటి సినిమా యన్టీఆర్ 'ఎదురులేని మనిషి'.

గత సంవత్సరమే నిర్మాతగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు దత్. తమ వైజయంతీ మూవీస్ పతాకంపై పలు మరపురాని చిత్రాలు నిర్మించారు దత్. యన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు తీసిన ఏకైక నిర్మాతగా నిలిచారు అశ్వనీదత్. ఆయన నిర్మాతగా, నిర్మాణభాగస్వామిగా వ్యవహరించిన చిత్రాల ద్వారా అనేకమంది సినీప్రముఖుల వారసులను హీరోలుగా పరిచయం చేశారు దత్. ప్రస్తుతం నటశేఖర కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణను 'శ్రీనివాస మంగాపురం'తో హీరోగా పరిచయం చేస్తున్నారు దత్.

అప్పుడు బాబాయ్... ఇప్పుడు అబ్బాయ్...

అంతకు ముందు పలు చిత్రాల్లో బాలనటునిగా మెప్పించారు మహేశ్ బాబు. ఆయనను సోలో హీరోగా పరిచయం చేస్తూ 'రాజకుమారుడు' నిర్మించారు అశ్వనీదత్. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'రాజకుమారుడు' మంచి విజయం సాధించింది. తొలి సినిమాతోనే హీరోగా మహేశ్ బాబుకు మంచి మార్కులు లభించాయి. 1999లో విడుదలైన 'రాజకుమారుడు'తోనే మహేశ్ బాబు తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించారు. చిత్రమేంటంటే 27 ఏళ్ళ క్రితం బాబాయ్ మహేశ్ ను హీరోగా పరిచయం చేసిన అశ్వనీదత్ ఇప్పుడు మహేశ్ అన్న రమేశ్ కొడుకు జయకృష్ణను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.

నటరత్న మనవడు తారకరత్న...

అశ్వనీదత్ పర్మినెంట్ బ్యానర్ 'వైజయంతీ మూవీస్'. అయితే 'స్వప్న సినిమా' బ్యానర్ లోనూ దత్ కొన్ని చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్ నిర్మించిన 'ఒకటో నంబర్ కుర్రాడు' సినిమాతో నటరత్న యన్టీఆర్ మనవడు తారకరత్నను హీరోగా పరిచయం చేశారు. యన్టీఆర్ తనయుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ కుమారుడే తారకరత్న. 'ఒకటో నంబర్ కుర్రాడు' చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా, కె.రాఘవేంద్రరావు ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. ఈ సినిమాతోనే తారకరత్నకు ఓ గుర్తింపు లభించింది.

భలేగా బన్నీతో 'గంగోత్రి'...

అల్లు అరవింద్, అశ్వనీదత్ మంచి మిత్రులు. అంతకు ముందు 'పెళ్ళిసందడి' చిత్రంలో భాగస్వాములుగా ఉన్నారు అరవింద్, దత్. వారిద్దరూ కలసి యునైటెడ్ ప్రొడ్యూసర్స్ బ్యానర్ పై 'గంగోత్రి' చిత్రం నిర్మించారు. ఈ చిత్రం ద్వారానే అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'గంగోత్రి' మంచి విజయం సాధించింది. ఈ తొలి చిత్రంలోనే అల్లు అర్జున్ లేడీ గెటప్ లో మురిపించడం విశేషం. ఈ చిత్రంతో బన్నీకి భలే పేరు లభించింది.

'చిరుత'లా చరణ్...

ఎందరు టాప్ స్టార్స్ తో సినిమాలు తీసినా, అశ్వనీదత్ కు చిరంజీవితోనే ఎక్కువ సక్సెస్ మూవీస్ ఉన్నాయి. చిరంజీవితో దత్ నిర్మించిన 'జగదేకవీరుడు-అతిలోక సుందరి, చూడాలనివుంది, ఇంద్ర' సినిమాలు రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేశాయి. అంతటి అనుబంధమున్న చిరంజీవి, తన నటవారసుడుగా రామ్ చరణ్ ను పరిచయం చేసే బాధ్యతను అశ్వనీదత్ కే అప్పగించారు. అలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'చిరుత' సినిమా ద్వారా రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేశారు అశ్వనీదత్. 'చిరుత'తోనే రామ్ చరణ్ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. అభిమానులను అలరించారు.

మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, తారకరత్నను చిత్రసీమకు హీరోలుగా పరిచయం చేసిన క్రెడిట్ అశ్వనీదత్ కే దక్కింది. వీరిలో తారకరత్న ప్రస్తుతం లేరు. మిగిలిన ముగ్గురూ ఈ నాటి టాలీవుడ్ టాప్ స్టార్స్ గా రాజ్యమేలుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ కూడా ఇప్పుడు అశ్వనీదత్ మూవీతోనే హీరోగా పరిచయమవుతూ ఉండడం విశేషం. 'శ్రీనివాస మంగాపురం' చిత్రానికి 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి అశ్వనీదత్ సమర్పకులు కాగా, పి.కిరణ్ నిర్మాత. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకల్పన చేశారు. ఈ చిత్రంలో ఓ నాటి అందాలతార రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్. 'శ్రీనివాస మంగాపురం'లో జయకృష్ణను చూసి కృష్ణ అభిమానులు మురిసిపోతున్నారు. అశ్వనీదత్ 'మిడాస్ టచ్' జయకృష్ణకూ కలసి వస్తుందని ఆశిస్తున్నారు. మరి జయకృష్ణ ఏ తీరున మురిపిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఈ లుక్ కోసమే ఇంతకాలంగా...

కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. 'పెద్ది' ట్రైలర్‌పై నాగవంశీ

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy