జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో తెలుగువారికి చేరువయ్యాడు కమెడియన్ సుడిగాలి సుధీర్. ఆ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని అతన్ని హీరోగా పెట్టి కొందరు సినిమాలూ నిర్మించారు.
సుధీర్ హీరోగా నటించిన సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా... అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అతని తాజా చిత్రం 'గోట్' ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది కానీ విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో మే 19 సుధీర్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతని కొత్త సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
సుడిగాలి సుధీర్ కొత్త సినిమాకు 'సుధీర్ జోకర్' అనే పేరును ఖరారు చేశారు. 'బిగ్ బాస్' ఫేమ్ అయేషా ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ సినిమాలో అభిరామి, మురళీశర్మ, అజయ్ ఘోస్, రమేశ్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నాను. దీనిని పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో ప్లేయింగ్ కార్డ్స్ తో ఉన్న సుడిగాలి సుధీర్ ఆకట్టుకుంటున్నారు. రేపు ఈ సినిమా బాంగర్ రిలీజ్ తో పాటు ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కూడా జరగబోతోంది. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా 'సుధీర్ జోకర్' సినిమా రూపొందుతోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

