Friday, 17 Sep, 4.15 am ఈనాడు

మార్కెట్‌
59000

సమీక్ష
మరో మైలురాయికి సెన్సెక్స్‌
రూ.260 లక్షల కోట్లకు మదుపర్ల సంపద

మా ర్కెట్ల లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ గురువారం నాడు మరో మైలురాయిని అలవోకగా అందుకుంది. సూచీ 59000 పాయింట్లను తొలిసారి అధిగమించింది. పలు రంగాలకు ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రకటించడం మదుపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇవి కొనుగోళ్ల రూపంలో ప్రతిబింబించడంతో రికార్డుల మోత మోగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 73.52 వద్ద ముగిసింది. సూచీల పరుగుల నేపథ్యంలో బీఎస్‌ఈలో మదుపర్ల సంపద గత మూడు సెషన్లలో రూ.4.45 లక్షల కోట్లు పెరిగి రికార్డు గరిష్ఠమైన రూ.260.78 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 58,881.04 వద్ద దూకుడుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,204.29 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 417.96 పాయింట్ల లాభంతో 59,141.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 110.05 పాయింట్లు రాణించి 17,629.50 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 17,644.60 వద్ద కొత్త రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు కొత్త గరిష్ట స్థాయుల వద్ద ముగిశాయి.

* ఉపశమన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో టెలికాం షేర్లు పరుగులు తీశాయి. వొడాఫోన్‌ ఐడియా 25.98 శాతం దూసుకెళ్లి రూ.11.25 వద్ద ముగిసింది. ఎయిర్‌టెల్‌ ఇంట్రాడేలో రూ.743.90 వద్ద గరిష్ఠాన్ని తాకి.. చివరకు 1.02 శాతం నష్టంతో రూ.718.15 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అత్యధికంగా 7.34% పెరిగింది. ఐటీసీ 6.83%, ఎస్‌బీఐ 4.46%, రిలయన్స్‌ 2.07%, కోటక్‌ బ్యాంక్‌ 1.87%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.80%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.40% చొప్పున మెరిశాయి. టీసీఎస్‌ 1.32%, టాటా స్టీల్‌ 1.25%, టెక్‌ మహీంద్రా 1.16% మాత్రం డీలాపడ్డాయి.

* బీఎస్‌ఈలో 1626 షేర్లు లాభాల్లో ముగియగా, 1654 స్క్రిప్‌లు నష్టపోయాయి.

ప్రపంచ అయిదో స్థానంలో బీఎస్‌ఈ సంస్థల విలువ

బీ ఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 3.54 లక్షల కోట్ల డాలర్లుకు చేరిందని బీఎస్‌ఈ సీఈవో ఆశిష్‌ చౌహాన్‌ తెలిపారు. ఫలితంగా ప్రపంచంలో 5వ అతిపెద్ద ఎక్స్ఛేంజీగా బీఎస్‌ఈ నిలిచిందని అన్నారు. అత్యంత విలువైన మార్కెట్లలో అమెరికా (50 లక్షల కోట్ల డాలర్లకు పైగా), చైనా (12 లక్షల కోట్ల డాలర్లకు పైగా), జపాన్‌ (దాదాపు 7.5 లక్షల కోట్ల డాలర్లు), హాంకాంగ్‌ (6.5 లక్షల కోట్ల డాలర్లకు పైగా) ముందుస్థానాల్లో ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top