Saturday, 23 Jan, 5.15 am ఈనాడు

హైదరాబాద్
ఆదాయం ఢమాల్‌!

రూ.143 కోట్లు తక్కువగా పన్ను రాబడి
రూ.300 కోట్లు పడిపోయిన నిర్మాణ రుసుము
ప్రభుత్వమే ఆదుకోవాలంటోన్న బల్దియా అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఆదాయ వనరులను కరోనా దెబ్బతీసింది. ఇప్పటికే నిర్మాణ అనుమతుల రుసుము రూపంలో రూ.300 కోట్ల ఆదాయం ఆవిరైంది. ఆస్తి పన్ను వసూళ్లూ మందగించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పటివరకు రూ.143 కోట్ల పన్ను తక్కువగా వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లు పూర్తిగా పడకేశాయి. ఇతరత్రా ఆదాయ వనరులూ అంతంతమాత్రంగా ఉన్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే జీతాలు చెల్లించేందుకు పడుతోన్న కష్టాలు మరికొంతకాలం కొనసాగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఆదుకుంటేనే పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పడకేసిన పన్ను వసూళ్లు..
కరోనా కట్టడికి నగరంలో 2020, మార్చిలో లాక్‌డౌన్‌ విధించారు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాలు, వసతి గృహాలు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌ మూతపడ్డాయి. వేలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోయాయి. ఇళ్ల యజమానులకు అద్దెలు నిలిచిపోయాయి. సగటు నగరవాసి వ్యక్తిగత జీవితమూ తీవ్రంగా ప్రభావితమైంది. అదే సమయంలో జీహెచ్‌ఎంసీ రెవెన్యూ అధికారులు, సిబ్బంది కొవిడ్‌ వ్యాప్తి నివారణ విధుల్లో నిమగ్నమయ్యారు. అన్‌లాక్‌ వరకు ఇది కొనసాగింది. అనంతరం ధరణి సర్వే, వరదల సమయంలో సహాయక చర్యలు, గ్రేటర్‌ ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నెలల తరబడి ప్రత్యేక విధుల్లో ఉండటంతో పన్ను వసూళ్లు మందగించాయి. ప్రభుత్వం మొండి బకాయిలపై వడ్డీని 90 శాతం రద్దు చేయడంతో.. ఆ కోవలో వసూలైన రూ.275 కోట్లు బల్దియాను కొంతమేరకు ఆదుకున్నాయి. ఈ పథకాన్ని మరోమారు ప్రకటించాలని ప్రభుత్వాన్ని జీహెచ్‌ఎంసీ కోరుతోంది.

నిర్మాణ అనుమతులూ అంతే..
జనవరి నుంచి డిసెంబరు వరకు గత రెండేళ్లలో మంజూరైన అనుమతులను పరిశీలిస్తే 2020లో 37.2 శాతం మేర నిర్మాణ అనుమతులు తగ్గాయి. లాక్‌డౌన్‌లో భవన నిర్మాణ కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లడం, ఇతర కారణాలతో ఏడాది చివరి వరకు ఆ ప్రభావం కొనసాగింది. భారీ ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలనే ఆలోచనను సంస్థలు వాయిదా వేసుకున్నాయి. 2019లో మొత్తం 1902 అపార్ట్‌మెంట్లకు అనుమతులు మంజూరైతే.. 2020లో 1359 అపార్ట్‌మెంట్లే అనుమతులు పొందాయి. అనుమతుల రుసుము రూపంలో రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది. మున్సిపల్‌ మార్కెట్లు, కాంప్లెక్సుల అద్దెలు వసూలు కాలేదు. హోర్డింగులపై నిషేధం విధించడంతో వాటి రుసుములూ ఆగిపోయాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top