తాజా వార్తలు
ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!

బ్రిస్బేన్: టీమ్ఇండియాతో ఆఖరి టెస్టు ఆఖరి రోజుకు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బ! ఆ జట్టు ప్రధాన పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ మంగళవారం ఆడటం కష్టమే. అతడు కుడికాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని తెలిసింది. గాయం తీవ్రత గురించి పూర్తి సమాచారం లేదు.
గబ్బా టెస్టు ఆఖరి అంకానికి చేరుకుంది. చివరి రోజైన మంగళవారం టీమ్ఇండియా 324 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. వరుణుడు అంతరాయం కలిగించడంతో సోమవారం భారత్ ఆడేందుకు అవకాశం దొరకలేదు. అయితే ఒక ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ ఇబ్బంది పడ్డాడు. బంతులు విసురుతున్నంత సేపూ అసౌకర్యానికి లోనయ్యాడు. కుడికాలి పిక్క కండరాలు బిగుసుకుపోయినట్టు అనిపించింది. దాంతో అతడు పదేపదే తన కాలిని మడిచాడు. భారత్‌ను అడ్డుకోవాలంటే ఆసీస్‌కు ఈ లెఫ్టార్మ్ పేసర్ సేవలు అత్యంత కీలకం. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు స్టీవ్‌స్మిత్ సైతం ఇదే విషయం చెప్పాడు.
'స్టార్క్ గాయం గురించి పూర్తిగా తెలియదు. కుడికాలిని వెనక్కి మడుస్తూ వెళ్లినప్పుడే నేనూ చూశాను. వైద్య బృందం అతడిని కచ్చితంగా పర్యవేక్షిస్తుంది. గతంలోనూ అతడు గాయాలైనప్పుడు బౌలింగ్ చేశాడు. అందుకే ఆఖరి రోజు బౌలింగ్ చేస్తాడనే అనుకుంటున్నా' అని స్మిత్ అన్నాడు. బోర్డర్-గావస్కర్ సిరీసులో స్టార్క్ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
తలకు కుట్లు పడ్డా.. బ్యాటింగ్ చేసిన సుందర్