తాజా వార్తలు
ఆటగాళ్లకు రొటేషన్ పద్ధతి ఉత్తమం :కోహ్లీ

అహ్మదాబాద్: క్రికెట్ అంతా బయో బబుల్‌లో నడుస్తున్న ప్రస్తుత సమయంలో రొటేషన్ విధానం ఉత్తమ మార్గమని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రస్తుత భారత పర్యటనలో రొటేషన్ విధానాన్ని అనుసరిస్తున్న ఇంగ్లాండ్.. కెవిన్ పీటర్సన్ వంటి మాజీ స్టార్ల నుంచి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. అయితే కోహ్లి మాత్రం నిత్యం బయో బబుల్‌లో ఉంటున్న ఆటగాళ్లకు విరామం మంచిదేనని అంటున్నాడు.
''కఠినమైన బయో బబుల్‌లో ఉండడం వల్ల ఆటగాళ్లకు విసుగు రావొచ్చు, ఉత్సాహం కోల్పోయే అవకాశం ఉంది. ఏ ఫార్మాట్లోనైనా రొటేషన్ విధానం మంచిదే. ఏ మనిషి కూడా ఏడాది ఆసాంతం మ్యాచ్‌లు ఆడుతూనే ఉండలేడు.
ప్రతి ఒక్కరికీ విరామం అవసరం. బయో బబుల్‌లో ఉన్నప్పుడు ఆటగాళ్ల మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్లు మానసికంగా అలసిపోయే అవకాశముంది'' కోహ్లి అన్నాడు. మంచి రిజర్వ్ బెంచ్ ఉంటే రొటేషన్ విధానం విజయవంతం అవుతుందని, ఈ విషయం భారత్‌కు ఎలాంటి కొరత లేదని చెప్పాడు.
''భారత్‌ను టెస్టు లేదా వన్డే లేదా టీ20 మ్యాచ్‌లో గెలిపించేందుకు మరో 11 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తు పట్ల చాలా స్పష్టతతో ఉన్నాం. వచ్చే అయిదేళ్లలో ఏం చేయాలనే ప్రణాళిక మా వద్ద ఉంది. కాబట్టి పాత ఆటగాళ్లు నిష్క్రమించి, కొత్త ఆటగాళ్లు వచ్చినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు'' అని కోహ్లి అన్నాడు.