Wednesday, 07 Jun, 5.13 am ఈనాడు

నల్గొండ
ఆత్మకూరు పిల్లలు.. కబడ్డీలో మెరికలు


జాతీయ స్థాయిలో రాణిస్తున్న చిన్నారులు

ఆత్మకూర్‌(ఎం) న్యూస్‌టుడే
యా దాద్రి భువనగిరి జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన క్రీడాకారులు కబడ్డీ ఆటలో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కనీస వసతులు, సరైన శిక్షకులు లేకున్నా ఆటపై ఆసక్తితో ఉన్న వసతుల్లోనే మెరుగైన సాధన చేస్తూ పతకాలను సాధిస్తున్నారు.

ఆత్మకూర్‌(ఎం) గ్రామ పంచాయతీ పరిధిలోని కామునిగూడెం మారుమూల గ్రామానికి చెందిన భాసవాడ సంధ్య జాతీయ, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. తన ఆటను మరింత మెరుగుపర్చేందుకు ప్రస్తుత వేసవి సెలవుల్లో శిక్షకుడు ఉప్పలయ్య సాయంతో నిత్యం సాధన చేస్తోంది ప్రొ కబడ్డీ జట్టులో స్థానం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆత్మకూర్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన ఈమె ఇటీవల వెల్లడైన ఫలితాల్లో 7.8 జీపీఏ సాధించింది.

తమిళనాడులోని కోయబత్తూర్‌లో గత మార్చిలో కబడ్డీ అసోసియేషన్‌ నిర్వహించిన సబ్‌జూనియర్‌ జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు సారథిగా వ్యవహరించింది. గత డిసెంబర్‌లో గుజరాత్‌లోని వడోదరాలో నిర్వహించిన జూనియర్‌ కబడ్డీ అసోసియేషన్‌ జాతీయ స్థాయి పోటీలో పాల్గొని ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. 2014, 2015లో ఎస్జీఎఫ్‌ 14 ఏళ్ల లోపు బాలికల విభాగంలో ప్రథమ స్థానం, 2015లో నిజామాబాద్‌లో నిర్వహించిన పైకా కబడ్డీ పోటీలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన జట్లలో కీలక పాత్ర పోషించింది. 2016 ఖమ్మంలో నిర్వహించిన సీనియర్‌ కబడ్డీ అసోసియేషన్‌ కబడ్డీ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిన జట్టులో ఆడి సీనియర్‌ జాతీయ స్థాయి ప్రాబబుల్స్‌కు ఎంపికైంది. 2016లో నిజామాబాద్‌ నిర్వహించిన కబడ్డీ అసోసియేషన్‌ పోటీల్లో జట్టు ద్వితీయ స్థానం సాధించడంలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి ప్రాబబుల్స్‌కు ఎంపికైంది. 2016లో ఎస్జీఎఫ్‌ 17 ఏళ్లలోపు బాలికల విభాగం కబడ్డీ పోటీలో ఈమె ఆడిన జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. వీటితో పాటు పదికి పైగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి అనేక బంగారు పతకాలను సాధించింది.

ప్రతిభావంతురాలు శిల్ప
ఆత్మకూర్‌ మండలం మొరిపిరాల గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నగూడెం గ్రామానికి చెందిన ఎన్‌.శిల్ప ఆత్మకూర్‌లోని కేజీబీవీలో 9వతరగతి చదువుతోంది. 2017లో మెదక్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్‌ కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి నల్గొండ జట్టులో పాల్గొని జట్టు ప్రథమస్థానంలో సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది. గత ఫిబ్రవరిలో భూపాలపల్లిలో నిర్వహించిన ఖేలో ఇండియా కబడ్డీ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపడంతో నెల్లూరు జిల్లాలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ఉత్తమ ప్రదర్శనిచ్చింది. 14 ఏళ్ల లోపు బాలికల ఎస్జీఎఫ్‌ కబడ్డీపోటీల్లో రెండు సార్లు బంగారు పతకాన్ని సాధించింది. 8 సార్లు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలతో పాటు అనేక జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని రాణించింది. భవిష్యత్తులో కబడ్డీలో ఉత్తమంగా రాణించి జాతీయ జట్టుకు ఆడుతానని ధీమా వ్యక్తం చేస్తోంది.

రాణిస్తున్న నవీన్‌
ఆత్మకూర్‌ మండల కేంద్రానికి చెందిన నాతి నవీన్‌ స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ కబడ్డీ ఆటలో రాణిస్తున్నాడు. పలు రాష్ట్ర స్థాయి పోటీలో రాణించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. 2016లో మెదక్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్‌ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రథమస్థానం సాధించడంతో తన వంతు కృషి చేశాడు. 2017లో భూపాలపల్లిలో నిర్వహించిన ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి నెల్లూరులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ఆడాడు. వీటితో అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించాడు. కబడ్డీ ఆటలో మరింత ప్రావీణ్యం సాధించేందుకు ప్రస్తుత వేసవి సెలవుల్లో శిక్షకుడు ఉప్పలయ్య పర్యవేక్షణలో సాధన చేస్తున్నాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top