తాజా వార్తలు
అదితి పెయింటింగ్స్ అదరహో..

చిత్రకారిణిగా, రచయితగా రాణిస్తున్న 13 ఏళ్ల బాలిక
జైపుర్: కేన్వాస్ పెయింటింగ్‌లో ఓ బాలిక విశేషంగా రాణిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. కళ్ల ముందు కదలాడేలా కథలు రాస్తూ రచయితగానూ మెప్పిస్తోంది. రచయితగా, చిత్రకారిణిగా గుర్తింపు పొందిన బాలిక తన అందమైన పెయింటింగ్‌ల ద్వారా అలనాటి తారల తెరవెనుక కష్టాలను తెలియజేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. రాజస్థాన్‌లోని అజ్మేర్కు చెందిన 13 ఏళ్ల అదితి కల్యాణి 1950 నాటి నటీమణులైన సూర్య, రేష్మ, శ్యామ, సంధ్య, నిమ్మి వంటి తారల చిత్రాలను గీసి అబ్బురపరుస్తోంది. కేవలం చిత్రాలను వేయడమే కాకుండా రచనలు చేస్తూ తనలో దాగిఉన్న మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది.
అదితి కల్యాణి గీసిన చిత్రాలు ఇతర చిత్రాలకంటే ఎంతో ప్రత్యేకమైనవి. అలనాటి నటీమణులు ఎలా ఉండేవారో, సినీ రంగంలో వారు అడుగుపెట్టేకంటే ముందు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో ఆమె గీసిన చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. అదితికి ఉన్న ఈ ప్రతిభే అందరు చిత్రకారులకంటే ఆమెను ప్రత్యేకంగా నిలుపుతోంది. 1950లో నటీమణులు సినీరంగంలోకి అడుగుపెట్టేముందు వారికి స్వేచ్ఛ లేదని, నాలుగు గోడల మధ్య వారిని బందీగా ఉంచి విద్యావకాశాలకు దూరం చేశారని బాలిక అంటోంది. ఆ నటుల కష్టాలను, నటన కోసం వారు పడ్డ తపనను తెలియజేయాలని ఈ చిత్రాలను గీస్తున్నట్లు యువ పెయింటర్ పేర్కొంది.
60 ఏళ్లు వయసు దాటినవారు మాత్రమే తన పెయింటింగ్స్‌లోని నటీమణులను గుర్తించగలరని బాలిక చెబుతోంది. 2017లో ఆమె రాసిన 'అడ్వెంచర్ ఆఫ్ టు బి అండ్ హెర్ ఫ్రెండ్స్' పుస్తకం పలు అవార్డులను సాధించింది. ఆ పుస్తకంలో 11 చిన్న కథలను పొందుపరిచింది. ఆ కథలే కాదు వాటిలోని చిత్రాలు కూడా పాఠకులను ఆకట్టుకుంటాయి.