Monday, 17 Feb, 11.10 am ఈనాడు

తాజా వార్తలు
అహ్మదాబాద్‌ టెస్ట్‌పై త్వరలోనే ప్రకటన : గంగూలీ

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లతో డే/నైట్‌ టెస్టులు

దిల్లీ: వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి సీజన్‌లో ఇంగ్లాండ్‌.. భారత పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఒక డే/నైట్‌ టెస్టు ఆడే అవకాశం ఉంది. దిల్లీలో ఆదివారం నిర్వహించిన బీసీసీఐ రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఏడాది చివర్లో భారత్‌.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగానూ ఒక డే/నైట్‌ టెస్టుకు అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలోనే ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌కు బీసీసీఐ రూ.2 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇక 2021 జులైలో భారత్‌.. ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా ఐదు టెస్టులు ఆడనుంది. అక్కడ కూడా ఒక డే/నైట్‌ టెస్టు జరిగే అవకాశముంది.

భారత్‌ గత నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగా ఈడెన్‌గార్డెన్స్‌లో తొలిసారి డే/నైట్‌ టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ మూడు రోజుల్లో పూర్తి అయినా సూపర్‌ సక్సెస్‌ అయింది. కోహ్లీ శతకంతో మెరిసి టీమ్‌ఇండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఇదిలా ఉండగా, అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియాన్ని ఇటీవల పునర్‌నిర్మించారు. 1,10,000 సీటింగ్‌ కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంగా దీన్మి నిర్మించడం విశేషం. ఈ స్టేడియంలోనే వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో రెండో టెస్టును డే/నైట్‌గా ఆడిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని గంగూలీ అన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్‌ ఒక పింక్‌ బాల్‌ టెస్టు ఆడనుందని స్పష్టం చేశారు.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top