Wednesday, 15 Sep, 5.15 pm ఈనాడు

మార్కెట్‌
Air India Disinvestment: ఎయిర్‌ ఇండియా బిడ్ల దాఖలుకు తుదిగడువు నేడే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎయిర్‌ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన బిడ్ల స్వీకరణకు నేడు తుది గడువు. ఈ బిడ్లను ప్రభుత్వం తర్వాతి దశకు తీసుకెళ్లనుంది. బిడ్లకు సంబంధించిన తుది గడువును మార్చేది లేదని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. 2018లో ఎయిర్‌ ఇండియాలో 76శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం ప్రయత్నించగా.. కొనుగోలుదారులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి బిడ్ల స్వీకరణ ప్రారంభించారు. కనీసం ఇద్దరు బిడ్లు దాఖలు చేసినా విక్రయ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు తన కన్సార్టియంతో కలిసి టాటా గ్రూప్‌, స్పైస్‌ జెట్‌ ఛైర్మన్‌ అజేయ్‌ సింగ్‌ వ్యక్తిగత హోదాలో బిడ్లను దాఖలు చేయవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎయిర్‌ ఇండియాకు మొత్తం రూ.43 వేల కోట్ల మేరకు రుణాలు ఉన్నాయి. వీటిల్లో రూ.22 వేల కోట్ల రుణాలను ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు బదిలీ చేయనున్నారు. ఈ రుణాల చెల్లింపునకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అంటే సంస్థను వేరే వారికి బదిలీ చేసేనాటికి ప్రభుత్వం ఈ రుణాలు మొత్తం చెల్లించాల్సి ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలను బహిర్గతం చేయలేదు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top