Thursday, 04 Mar, 5.56 am ఈనాడు

తెలంగాణ బ్రేకింగ్ న్యూస్
ఐటీఐఆర్‌ ఉసురు తీసింది కేంద్రమే

తెలంగాణ ప్రజలకు భాజపా క్షమాపణలు చెప్పాలి
సంజయ్‌కు దమ్ముంటే ఈ ప్రాజెక్టును తేవాలి: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ తేలేని భాజపా తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌) ప్రాజెక్టులను మూలకు పెట్టింది.. ఉసురు తీసింది కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వమేనని ఆయన ధ్వజమెత్తారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం సీఎంకు రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర అంటూ విమర్శించారు. బుధవారం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ''కేవలం మీడియాలో ప్రచారం కోసం అసత్యాలతో సంజయ్‌ లేఖ రాశారు. దేశంలో ఐటీఐఆర్‌ల విషయంలో భాజపా వెనక్కిపోయిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాదే పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేశారు. ఆ ప్రకటన గురించి సమాచారం లేకపోవడం సంజయ్‌ అజ్ఞానానికి నిదర్శనం. ఐటీఐఆర్‌పై 2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన డీపీఆర్‌లను ఆయనకు ఇస్తాం. ఐటీఐఆర్‌ తీసుకొచ్చే దమ్ముందా?భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుపై కేంద్రం నుంచి ప్రకటన ఇప్పించాలి'' అని కేటీఆర్‌ అన్నారు.
* దేశంలో ప్రస్తుతం గ్యాస్‌, పెట్రోల ధరల పెరుగుదలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు బాధ్యత వహిస్తారా అని మంత్రి కేటీఆర్‌ బుధవారం ట్విటర్‌లో ప్రశ్నించారు. యూపీఏ హయాంలో ధరలు పెరిగినప్పుడు మోదీ, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీలు అప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోలను ట్విటర్‌కు జత చేశారు.
* సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిలో తెలంగాణ లక్ష్యాలను సాధించి ముందడుగు వేయడం గర్వకారణమని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ, కర్ణాటక, అండమాన్‌ నికోబార్‌లు మాత్రమే లక్ష్యాన్ని అధిగమించాయని ఒక నెటిజన్‌ ట్విటర్‌లో తెలిపిన సమాచారంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top