Thursday, 29 Jul, 5.25 am ఈనాడు

కృష్ణ
అనైతిక చర్యలకు మూల్యం చెల్లించక తప్పదు

తెదేపా నేతలు కొల్లు, కొనకళ్ల

కోనేరుసెంటరు(మచిలీపట్నం), న్యూస్‌టుడే: అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో పోలీసులు చట్టవిరుద్ధంగా చేపడుతున్న అనైతిక చర్యలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో తగు మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి ఘటన నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో రవీంద్ర, నారాయణరావులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా నాయకుల ఆగడాలు శృతిమించుతున్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తనపై జరిగిన దాడికి సంబంధించి కేసు పెట్టేందుకు కూడా ఉమాను అనుమతించకపోగా ఆయనపైనే ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు పెట్టారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కొండపల్లిలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌ను వెలుగులోకి తీసుకురావాలనుకోవడం నేరమా అని ప్రశ్నించారు. ఫ్యాక్షన్‌ చరిత్ర ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే పాలన ఇలానే ఉంటుందన్న విషయం ప్రజలకు అర్థమవుతోందన్నారు. దేవినేనికి దేహశుద్ధి చేస్తామంటూ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ చెప్పిన విధంగానే దాడి జరిగినా పోలీసుల్లో ఉలుకూపలుకూ లేదని ఆరోపించారు. అప్రజాస్వామిక చర్యలపై నిరసన తెలపాలనుకుంటున్న వారిని పోలీసులు నిర్బంధించడం సరికాదని, భవిష్యత్‌లో సమాధానం చెప్పకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దాడులతో బెదిరించలేరు : అవినీతికి పాల్పడేవారిని నిలదీసే విషయంలో తెదేపా శ్రేణులు ఎవరికీ భయపడేదిలేదని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు వ్యాఖ్యానించారు. గృహ నిర్బంధం సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేసే నీతిమాలిన చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. దేవినేని ఏం నేరం చేశారని ఆయనపై కేసులు నమోదు చేశారో పోలీసులు చెప్పాలన్నారు. అక్రమ మైనింగ్‌ పరిశీలనకు వెళ్లిన దేవినేనిపై దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా తెదేపా నాయకులను నిర్బంధించే పనిలో పోలీసులు నిమగ్నం కావడం విడ్డూరంగా ఉందన్నారు. అధికార బలంతో చట్టవిరుద్ధంగా వ్యహరిస్తే అందుకు మూల్యం చెల్లించవల్సిన విషయాన్ని పోలీస్‌శాఖ తెలుసుకోవాలన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top