Friday, 18 Oct, 11.15 pm ఈనాడు

తాజా వార్తలు
అందుకే..టాస్‌కు నేను రావట్లేదు: డుప్లెసిస్‌

రాంచీ: భారత్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ రాంచీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో టాస్‌కు రావట్లేదని తెలిపాడు. అతడి స్థానంలో మరో ఆటగాడిని టాస్‌కు పంపిస్తానని పేర్కొన్నాడు. ఆసియా ఖండంలో జరిగిన మ్యాచ్‌ల్లో డుప్లెసిస్‌ వరుసగా తొమ్మిది టాస్‌లు ఓడిన సంగతి తెలిసిందే. 'టాస్‌ను గెలవలేకపోతున్నాను. నా స్థానంలో టాస్‌కు మరో ఆటగాడు వస్తాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేయాలి. మొదటి ఇన్నింగ్స్‌లో పైచేయి సాధిస్తే విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. భారత్‌ ఎంతో బలమైన జట్టు. స్వదేశంలో టీమ్‌ఇండియాకు మంచి రికార్డు ఉంది' అని అన్నాడు.

గాయాలతో సతమతమవుతున్న సఫారీ ఆటగాళ్లు మార్క్రమ్‌, కేశవ్‌ మహారాజ్‌ మూడో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు బోణీ కొట్టని దక్షిణాఫ్రికా.. రాంచీ టెస్టులో గెలిచి పాయింట్లను సాధించాలని పట్టుదలతో ఉంది. మరోవైపు మూడో టెస్టుల్లోనూ సఫారీలను చిత్తుచేసి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమ్‌ఇండియా తహతహలాడుతోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top