Friday, 23 Apr, 5.30 pm ఈనాడు

తాజా వార్తలు
AP: 18ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌

విజయవాడ: కరోనా టీకా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ సరఫరా విషయమై సీఎం జగన్‌ ఇప్పటికే భారత్‌ బయోటెక్‌, హెటెరో డ్రగ్స్‌ ఎండీలకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ''కరోనా వైరస్‌ కట్టడిపై విస్తృతంగా చర్చించాం. వైరస్‌ కట్టడికి సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే వ్యాక్సిన్‌ అనేది ముఖ్యం. మొదటి నుంచి అందుకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

ఇందులో భాగంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. రూ.1600 కోట్ల నిధులు వెచ్చించి ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీంతో పాటు, శనివారం నుంచి రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 5గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తాం. మరోవైపు కరోనా పరీక్షలు కూడా పెంచుతాం.

సిటీ స్కాన్‌ కేంద్రాల వద్ద ప్రజల నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వాటిని కూడా నియంత్రిస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ తీసుకుంటే చర్యలు తప్పవు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం'' అని వివరించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top