Wednesday, 15 Sep, 4.41 am ఈనాడు

అదిలాబాద్
అప్పు చేస్తేనే.. అరక సాగేది

రైతుల అవసరాలను తీర్చలేకపోతున్న బ్యాంకులు

ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే


పంట రుణాల కోసం బ్యాంకుల ఎదుట రైతులు (దాచిన చిత్రం)

''తెలంగాణలో 91.7 శాతం కర్షక కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,52,113 చొప్పున అప్పు ఉంది. దేశం మొత్తంలో వ్యవసాయరుణాల్లో తెలంగాణ పదో స్థానంలో ఉన్నట్లు జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన 77వ రౌండ్‌ సర్వేలో వెల్లడైంది.''

రైతులు అప్పు చేస్తేనే పంటలు సాగు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. గిట్టుబాటు ధర రాక నష్టపోతూ సాగు చేయాలంటే బ్యాంకు రుణాలకు వేచి చూడాల్సిన పరిస్థితులు. పట్టాలు లేకపోవడం, బ్యాంకుల్లో పంట రుణం రాని రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. జాతీయ గణాంక కార్యాలయం నిర్వహించిన సర్వే మేరకు జిల్లా వ్యవసాయ పరిస్థితులు, పంటల సాగు, పెట్టుబడులు, రుణాల మంజూరు, తదితర వాటిపై కథనం.

ఉమ్మడి జిల్లాలో 8.50 లక్షల కుటుంబాలు ఉంటే, అందులో 4.25 లక్షల అన్నదాతల కుటుంబాలే ఉన్నాయి. వీటిలో చాలా మంది భూములు వివాదాల్లో ఉన్నాయి. జిల్లాలో 17.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఎకరానికి సగటున రూ.30-40 వేలు పంట సాగుకు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో 83 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. గతేడాది వానాకాలం, యాసంగి కలిపి రూ.7,500 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలైన చిన్ననీటి పారుదల, ఉద్యానం, పాడి, ఆధునిక యాంత్రీకరణ తదితర వాటికి మరో రూ.2 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. సీజన్‌ మొదలు అయిందంటే బ్యాంకుల ముందు రైతులు బారులు తీరే పరిస్థితి నెలకొంది. పంట రుణం చేతికందితే కాని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.

ఏటికేడు రుణాల ఊబిలో..

జిల్లాలో వర్షధార సాగు ఎక్కువ. కాలం కలిసి వస్తేనే పంట పండుతుంది. లేకుంటే నష్టాలే. తిరిగి అప్పులు చేయాలి, మళ్లీ పంటలు సాగు చేయాలి. ఇలా ఏటా అప్పుల ఊబిలో రైతు కూరుకుపోతున్నాడే తప్ప లాభపడింది లేదు. వాస్తవ సాగు ఖర్చులకు అనుగుణంగా ఏటా ఎంతో కొంత పంట రుణపరిమితిని పెంచడంతో అప్పులు సైతం అధికమవుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తన రకాలు లేకపోవడం, సాగులో మెలకువలు పాటించక ఖర్చు మోపెడవుతోంది.

సన్నకారు రైతులే ఎక్కువ

అప్పులు తీసుకునే వారిలో సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. పంటల సాగు మేరకు పెట్టుబడి లేకపోవడంతో రైతులు దళారులపై ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాలో అటవీ భూమిని హక్కుగా పొంది సాగు చేసుకుంటున్న రైతులు 50 వేలకు పైగా ఉన్నారు. వారికి భూమి సాగు చేసేందుకు హక్కు కల్పించిన ఆ భూమిపై పంట రుణం పొందని పరిస్థితి ఉంది.

* తలమడుగు మండలం లచ్చంపూర్‌ గ్రామానికి చెందిన గిరిజన రైతు సుంగుకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. పట్టా రాకపోవడంతో బ్యాంకు నుంచి రుణం రాలేదు. ప్రైవేట్‌ వ్యాపారుల నుంచి రూ.1.25 లక్షల అప్పు తీసుకున్నారు.

* ఆదిలాబాద్‌ మండలం మేడిగూడకు చెందిన సురేశ్‌ అనే రైతుకు అయిదెకరాల భూమి ఉంది. బ్యాంకు నుంచి 1.30 లక్షల రుణం తీసుకున్నారు. ఏటా రుణం పునరుద్ధరించుకోవడంతోనే సరిపోతోంది. తీసుకున్న అప్పు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో గతంలో ఇచ్చిన పంట రుణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

కౌలు రైతుల దయనీయస్థితి..

అప్పుల విషయంలో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. జిల్లా మొత్తం వీరు లక్ష మంది ఉంటారు. పంట సాగు చేసేందుకు భూమి కౌలు తీసుకోవడం నుంచి మొదలు పంట చేతికి వచ్చే వరకు పెట్టుబడికి ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. గతంలో వీరికి రుణ అర్హత కార్డులు ఇచ్చి, బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇచ్చేవాళ్లు. కొన్నేళ్లుగా బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడి అప్పుల బారిన పడి, వాటిని తీర్చలేక అత్మహత్యలు చేసుకుంటున్నారు.

సాగు భూమి: 17.50 లక్షల ఎకరాలు

పట్టాభూములున్న వారు: 5.35 లక్షలు

బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేది : 3.80 లక్షలు

కుటుంబాలు: 8.52 లక్షలు

రైతులు : 6.15 లక్షలు

రైతు కుటుంబాలు: 4.12 లక్షలు

ఏటా పంట రుణాల లక్ష్యం : 7,500 కోట్లు

ఇచ్చే రుణాల మొత్తం : రూ. 5 వేల కోట్లు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top