Thursday, 29 Jul, 5.42 am ఈనాడు

Breaking Hyderabad
అప్పుడేమో చలానా చూపినా చలనం లేదాయే..!

తొమ్మిదేళ్ల క్రితం బైక్‌ చోరీపై ఘట్‌కేసర్‌ ఠాణాలో ఫిర్యాదు

తాజాగా ఈ-చలానా జారీ.. అయినా పట్టించుకోని పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌

నేర సంఘటనల్లో ఆధారాలు.. నేరస్థులు ఉపయోగించిన సిమ్‌కార్డులు... సీసీ కెమెరాల ఫుటేజీలుంటేనే కొందరు పోలీసులు పరిశోధిస్తున్నారు. ఈ ఆధారాలు లేకపోతే కేసులు నమోదు చేసినా ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణ ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో జరిగిన బైక్‌ దొంగతనం. 9ఏళ్ల క్రితం తన బైక్‌ దొంగిలించారంటూ బాధితుడు ఫిర్యాదు చేస్తే. .అప్పట్లో సాక్ష్యాధారాలు లేవంటూ పోలీస్‌ అధికారులు చేతులెత్తేశారు. చోరీకి గురైన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వినియోగిస్తున్నారని, వారు నిబంధనలు ఉల్లంఘించడంతో 8నెలల క్రితం తనకు ఈ-చలాన్‌ వచ్చిందంటూ చెప్పినా పట్టించుకోలేదు. తాజాగా మూడురోజుల క్రితం మరో చలానా జారీ అయ్యిందంటూ తెలిపినా చూస్తాం.. చేస్తాం అంటున్నారు. ఉల్లంఘనల ప్రాంతాల ఆధారంగా తన బైక్‌ ఎక్కడ తిరుగుతుందో పట్టుకోండంటూ అభ్యర్థించినా వినడం లేదు. దీంతో బాధితుడు వికాస్‌ రెడ్డి ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ పోలీసులకు ట్వీట్‌ చేశాడు.

హడావుడి చేసి వదిలేశారు..

రామంతపూర్‌లో నివాసముంటున్న వికాస్‌రెడ్డి పదేళ్ల క్రితం తన స్నేహితుడు అక్కపల్లి శ్రీనివాస్‌ పేరుతో బైక్‌ కొన్నాడు. అనంతరం వికాస్‌రెడ్డి తన కుటుంబంతో సహా మలక్‌పేటకు మారాడు. తొమ్మిదేళ్ల క్రితం తన సోదరుడికి ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు రావడంతో రాకపోకలు వీలుంటుందని వికాస్‌రెడ్డి బైక్‌ను సోదరుడికి ఇచ్చేశాడు. ఇంజినీరింగ్‌ కాలేజ్‌కి వెళ్లిన అతను సోదరుడు మరుసటి రోజు ఉదయాన్నే క్లాస్‌ ఉండడంతో రాజీవ్‌గృహకల్పలో ఉంటున్న తన స్నేహితుల గదిలో ఉన్నాడు. ఉదయాన్నే బైక్‌ కనిపించలేదు. దీంతో వికాస్‌రెడ్డి ఘట్‌కేసర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. వారం పదిరోజులు హడావుడి చేసిన పోలీసులు తర్వాత వదిలేశారు. అప్పటి నుంచి వికాస్‌రెడ్డి పోలీసులను అడుగుతున్నా ఫలితం లేదు.

విన్నారు.. చూస్తామన్నారు..

పోలీసుల వైఖరితో బైక్‌ ఇక దొరకదు అని గట్టిగా నిర్ణయించుకున్న వికాస్‌రెడ్డికి గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పంపించిన ఈ-చలాన్‌ చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. నాడు చోరీకి గురైన బైక్‌(ఏపీ11ఎజే6972)పై ఇద్దరు యువకులు శిరస్త్రాణం ధరించకుండా వెళ్తుంటే సీసీ కెమెరా ఫొటో తీసింది. ఆ చలానా తర్వాత మరో రెండు చలానాలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని వికాస్‌రెడ్డి ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు 'దొంగిలించిన వాహనం'గా గుర్తించారు. మూడురోజుల క్రితం శిరస్త్రాణం ధరించలేదంటూ మరో చలానా వచ్చింది. ఘట్‌కేసర్‌ పోలీసులకు విషయాన్ని వివరించగా... పట్టుకుంటాం అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు.

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసులు ఎక్కడా కనిపించరూ. అయినా.. చోరీకి గురైనా వాహనాన్ని పట్టేస్తారు. ఫలానా రోడ్డుపై ఎక్కడెక్కడ గుంతలున్నాయో చెప్పేస్తారు. మీరు వెళ్లాలనుకుంటున్న రూట్లో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలేంటో 'ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఐటీఎంఎస్‌)' తో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో చెప్పేస్తారు. ఈ వ్యవస్థను 'సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు'లో భాగంగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. రద్దీగా ఉండే నాలుగు ప్రధాన మార్గాలను ఎంపిక చేసి అనుసంధానించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు చలాన్లు విధిస్తారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. నిర్వహణ లోపాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయిస్తారు.

ఎక్కడెక్కడ..

* నేరెడ్‌మెట్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి ఈసీఐఎల్‌ జంక్షన్‌ వరకు

* హబ్సిగూడ- ఉప్పల్‌ జంక్షన్‌

* సాగర్‌ రింగ్‌ రోడ్డు- గుర్రంగూడ

* ఆటో నగర్‌-కొత్తపేట్‌ ఎక్స్‌ రోడ్డు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top