Thursday, 29 Jul, 10.25 am ఈనాడు

తాజా వార్తలు
assam mizoram conflict: సాధారణ దుస్తులు.. అధునాతన ఆయుధాలు

మిజోరం వైపున కనిపించినవారెవరు?
భౌగోళిక ప్రతికూలతల కారణంగా పోలీసుల మరణాలు?

గువాహటి: అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం ఉన్నట్టుండి ఎందుకంత తీవ్రరూపు దాల్చింది. కాల్పుల వరకు ఎందుకు దారితీసింది? సోమవారం నాటి ఘర్షణపై ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషిస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. సరిహద్దు అంశంలో నెలకొన్న విభేదాలపై రెండు రాష్ట్రాల అధికారులు సోమవారం చర్చలు జరుపుతుండగా ఉన్నట్టుండి మిజోరం వైపు నుంచి తూటాల వాన మొదలైనట్లు అస్సాం అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఆరుగురు సిబ్బంది మరణించగా, 70 మందికిపైగా గాయపడ్డారు. ''మిజోరం పోలీసులు తొలుత బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆటోమేటిక్‌ ఆయుధాలు, లైట్‌ మెషీన్‌ గన్నులను (ఎల్‌ఎంజీ) ఉపయోగించి ఎత్తైన ప్రాంతాల నుంచి కాల్పులు జరిపారు. కాల్పులు మొదలవగానే మేం భయంతో పరుగులు పెట్టాం'' అని స్థానిక పాత్రికేయుడు ఒకరు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో అక్కడున్న అయిదుగురు పాత్రికేయుల్లో ఆయన ఒకరు. ఈ ప్రాంతంలో అస్సాం వైపు లైలాపుర్‌ అనే చిన్న పట్టణం ఉండగా, మిజోరం వైపు వైరెంగ్టె ఉంది. తీవ్రవాద నిరోధక, అటవీ సంగ్రామ పాఠశాల వైరెంగ్టేలో ఉండడం విశేషం. ఇక్కడి నుంచి లుషాయ్‌ పర్వతాల ఎగువకు రహదారి మొదలవుతుంది. భౌగోళికంగా చూస్తే అస్సాం వైపు సరిహద్దు మిజోరం వైపు సరిహద్దు కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది.

ఈ కారణంగానే అస్సాం పోలీసులను తూటాలు బలిగొన్నాయన్న వాదనా ఉంది. మరోవైపు ఎల్‌ఎంజీల వినియోగంపై గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న ఆర్మీ అధికారి ఒకరు స్పందించారు. ''ఎల్‌ఎంజీలను బలగాలు పొజిషన్‌ కోసం మాత్రమే వినియోగిస్తాయి. లేదా కొనసాగుతున్న కాల్పులకు మద్దతు ఇచ్చేందుకు వాడతాయి. ప్రత్యర్థిని చంపాలన్న లక్ష్యం లేకుండా దీనిని రాష్ట్ర పోలీసులు లేక మరెవరు వినియోగించరు'' అని పేర్కొన్నారు. ఇక సామాజిక మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలను పరిశీలిస్తే.. మిజోరం వైపున ఉన్నవారిలో ఒకరిద్దరు వ్యక్తుల దగ్గర అత్యంత అధునాతన ఆయుధాలు ఉన్న సంగతి స్పష్టమవుతోంది. ''సాధారణ దుస్తులతో ఉన్న వీరు ఆయుధాల పట్టుకున్న తీరును గమనిస్తే.. ఓ రకమైన సాయుధ శిక్షణ పొందిన సంగతి తేటతెల్లమవుతోంది. ఇక వారి చేతిలోని ఆయుధాలు ప్రామాణికంగా జారీ అయినవి కాదు. దీనిని బట్టి చూస్తే.. అసలు వారు ఎవరు? వారికి ఆ ఆయుధాలు ఎలా వచ్చాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి'' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top