Tuesday, 02 Mar, 6.16 am ఈనాడు

అనంతపురం
బాధ్యత గుర్తించారు..భద్రత కల్పించారు

ఆర్కేనగర్‌ అభివృద్ధికి కృషి

సీసీ కెమెరాల ఏర్పాటు

ఆర్కేనగర్‌లోని ఓ వీధి

ఆర్కేనగర్‌ (ఆజాద్‌నగర్‌), న్యూస్‌టుడే: 'అనంత నగరంలో ఆ కాలనీ ప్రత్యేకం.. ఇక్కడ ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులే అధికంగా నివస్తున్నారు. ఒకరికొకరు సహకరించుకునే నైజం.. ఎవరికి ఏ కష్టమొచ్చినా తక్షణమే స్పందిస్తారు. అన్నదమ్ముల్లా.. అక్కాచెల్లెల్లా కలిసిమెలసి ఉంటున్నారు. అలాంటి కాలనీలో ఉన్నఫలంగా అలజడి.. వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తారు. దానికితోడు అపరిచిత వ్యక్తుల చేష్టలు.. కంటిమీద కునుకులేకుండా చేశాయి. కొన్నినెలలు కాపాలా కాశారు.. సమస్యను అధిగమించడానికి కాలనీవాసులు ఓ ముందడుగు ముందుకేసి సఫలీకృతం అయ్యారు. అనంతపురం ఆర్కేనగర్‌ ప్రశాంత వాతావరణానికి మారుపేరు. ఇలాంటి నేపథ్యంలో 2019 ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుస చోరీలు జరిగాయి. ఈ ఘటనలో కొందరు నగదు, మరికొందరు బంగారం, వెండినగలు పోగొట్టుకున్నారు. కాలనీపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల దొంగలు సులువుగా చొరబడుతున్నారని కాలనీవాసులు గ్రహించారు. దానికితోడు కొందరు పోకిరీలు పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్థినులను ఈవ్‌టీజింగ్‌, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో విసుగెత్తారు. స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, సరైన ఆధారాలు లేకపోవడం వల్ల నిందితులకు ఎలాంటి శిక్షలు పడేవి కావు.

సంఘం ఏర్పాటుతో..

కాలనీలో విద్యావంతులు, మహిళలు, యువకులు మార్పు కోసం ప్రయత్నించారు. కాలనీలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలసి 'ఆర్కేనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ' ఏర్పాటు చేసుకుని రిజిస్టర్‌ చేయించారు. అసోసియేషన్‌ మొదటి సమావేశంలోనే కాలనీలోని ప్రతి వీధికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు తగిన సొమ్మును కాలనీవాసుల నుంచే సేకరించారు. కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. సుమారు రూ.8 లక్షల వరకు సమకూరింది. తాము చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలని నగర కమిషనర్‌, పోలీసులను కోరారు. వారు కూడా స్పందించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కావాల్సిన అధికారిక అనుమతులు, విద్యుత్తు సౌకర్యం కల్పించారు.

వీధుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

పది వీధుల్లో.. నలభై కెమెరాలు

ఆర్కేనగర్‌లోని ప్రధానమైన పది వీధుల్లో నలభై కెమెరాలు ఏర్పాటు చేశారు. వీధుల ప్రవేశం, ద్వారాల్లో నాలుగు మెగా ఫిక్సెల్‌ కల్గిన అధునాతన సీసీ కెమెరాలను బిగించారు. పగలే కాకుండా రాత్రి సమయాల్లో సైతం అపరిచిత వ్యక్తుల ముఖచిత్రాలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు అంత సులువుగా జరగలేదు. దీనికి వెనుక అసోసియేషన్‌, కాలనీ వాసుల కృషి చాలాఉంది. సీసీల ఏర్పాటుకు అనుమతుల కోసం అధికారుల చుట్టూ తిరిగారు. ఈ ప్రయత్నంలో ఎవరూ నిరుత్సాహపడకుండా తమ పని పూర్తి అయ్యేవరకు ఓపిగ్గా నిలిచారు. దీంతో కాలనీలో చోరీలకు అడ్డుకట్ట వేశారు.

రాత్రి సమయాల్లో భయంలేదు

- నరసింహప్రసాద్‌, కార్యదర్శి

ఇక నుంచి రాత్రి సమయాల్లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వీధుల్లో సంచరించవచ్ఛు దొంగలకు చెక్‌ పెట్టవచ్ఛు పోలీసులకు మరింత పారదర్శకంగా ఆధారాలు అందుతాయి. ఇలాంటి చైతన్యం, మార్పు అందరిలోనూ రావాలి.

పోకిరీల ఆటకట్టు

- రమాదేవి, సభ్యురాలు

చీకటి పడితే చాలు ఇతర కాలనీలకు చెందిన పలువురు గుంపులుగా చేరి విద్యార్థినులు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా.. సరైన ఆధారం లేకపోవడం వల్ల పోకిరీలు తప్పించుకునేవారు. ఇప్పుడు ఆటలు సాగవు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కాలనీకి మరింత రక్షణ చేకూరింది.

కలసికట్టుగా ముందుకు..

- గోపాలకృష్ణ, అసోసియేషన్‌ అధ్యక్షుడు

వరుస దొంగతనాలు జరగడం వల్ల కాలనీవాసుల్లో మార్పు వచ్చింది. అందరూ ఐక్యంగా ముందుకొచ్చారు. అనుకున్నదే తడవుగా సంఘంగా ఏర్పడ్డాం. ప్రధానంగా యువకులు, మహిళలు అండగా నిలిచారు. ప్రతి పనిలో సహకారం అందించారు. భవిష్యత్తులో కాలనీలో ఏ మూలన కార్యకలాపాలు జరిగినా ఇట్టే కనిపెట్టవచ్ఛు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top