Friday, 03 Aug, 3.30 am ఈనాడు

మెదక్
బల్దియాలో మూడు గ్రామాల విలీనం


పెరిగిన మెదక్‌ పట్టణ పరిధి
న్యూస్‌టుడే-మెదక్‌ కలెక్టరేట్‌
పట్టణం - మెదక్‌
ప్రస్తుత పరిధి - 22 చ.కిమీలు
విలీనమైన గ్రామాలు - ఔరంగాబాద్‌, అవుసులపల్లి, పిల్లికొట్టాల్‌
విలీనంతో పరిధి - 26 చ.కిమీలు
జనాభా - 44,110
విలీన గ్రామాలతో కలిపి జనాభా - 49,241

ఐదు వందల జనాభా దాటిన తండాలు గ్రామ పంచాయతీలుగా, మేజర్‌ గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలుగా మారాయి. దీంతోపాటు ప్రభుత్వం ఇది వరకు ఉన్న మున్సిపాలిటీల పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా కేంద్రం మెదక్‌ పట్టణ పరిధి విస్తరించింది. బల్దియాలో మూడు గ్రామాలు విలీనమయ్యాయి. మెదక్‌ పురపాలక సంఘం 1952లో ఆవిర్భవించింది. తొలుత నగర పంచాయతీగా, ఆ తర్వాత పురపాలక సంఘంగా హోదా పెరిగింది. ప్రస్తుతం ద్వితీయ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. పట్టణంలో 27 వార్డులు ఉండగా, పట్టణ పరిధి 22 చదరపు కి.మీలు., నిజాం కాలంలో సుభాగా ఉన్న పట్టణం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఉమ్మడి జిల్లాలో జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఉండడం, జిల్లా పేరుతో పట్టణం ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనుకబడింది. ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించడంతో మెదక్‌ పట్టణం జిల్లా కేంద్రంగా మారింది. రాష్ట్రంలో ఆయా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ మేరకు ఆయా శాఖల ద్వారా నిధులు కేటాయించడమే కాకుండా పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. పురపాలిక శాఖ ద్వారా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది.

గ్రామాల విలీనం
సర్పంచుల పదవీకాలం ఈనెల 1తో ముగియగా, గురువారం నుంచి ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన అందుబాటులోకి వచ్చింది. మెదక్‌ బల్దియా పరిధిలోకి హవేలి ఘనపూర్‌ మండలం ఔరంగాబాద్‌, మెదక్‌ మండలంలోని అవుసులపల్లి, పిల్లికొట్టాల్‌ గ్రామాలు వచ్చాయి. ఔరంగాబాద్‌, అవుసులపల్లి గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగియడంతో అవి బల్దియాలోకి చేరాయి. దీంతో జిల్లా కేంద్రం పరిధి కాస్త పెరిగింది. ఇదివరకు పట్టణ పరిధి 22 చదరపు కి.మీలు ఉండగా, మూడు గ్రామాల విలీనంతో 26 చ.కిమీలకు చేరుకుంది.

మారనున్న రూపురేఖలు
మూడు గ్రామాల విలీనంతో మెదక్‌ పురపాలక సంఘం అభివృద్ధికి ఆస్కారం కలగనుంది. విలీన గ్రామాలు మూడు పట్టణ శివారులో ఉంటాయి. మెదక్‌- రామాయంపేట ప్రధాన రహదారికి ఓ వైపు ఔరంగాబాద్‌, మరో వైపు అవుసులపల్లి గ్రామాలున్నాయి. ఔరంగాబాద్‌ శివారులో సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలను నిర్మిస్తుండగా, త్వరలో రామాయంపేట మార్గంలో వెలుగు పాఠశాల వెనుక రైల్వేస్టేషన్‌ను నిర్మించనున్నారు. హైదరాబాద్‌ మార్గంలో పిల్లికొట్టాల్‌ ఉంది. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌ ఈ గ్రామ పరిధిలోకి వస్తుంది. దీంతో ఆయా గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. రానున్న రోజుల్లో పట్టణీకరణ దిశగా అడుగులు పడనున్నాయి. ఇది వరకు పల్లె వాతావరణం ఉండగా, వార్డుల ఏర్పాటు, ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ, తదనంతరం ప్రాతినిథ్యం, అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు జరగనుంది.

Dailyhunt
Top