Sunday, 24 Jan, 4.26 am ఈనాడు

మహబూబ్ నగర్
బంధుమిత్రుల సాయం.. మారిన బతుకు చిత్రంమిత్ర బృందం, బంధుగణం సహకారంతో ప్రైవేటు పాఠశాలలకు చెందిన పలువురు ఉపాధ్యాయుల బతుకులు మెరుగుపడ్డాయి. కొవిడ్‌ కారణంగా గతేడాది మార్చి నుంచి బడులు మూతపడ్డాయి. దీంతో ఇళ్లకే పరిమితమైన పంతుళ్లు వేతనాలు లేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. పరిస్థితిని గుర్తించిన మిత్రులు, బంధువులు చేయూతనివ్వడంతో నిలదొక్కుకొని సంతోషంగా జీవిస్తున్నారు.

- న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌

మిత్రుల సహకారంతో..

నేను ఎంఎసీ్సీ, బీఈడీ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేది. కరోనాతో గతేడాది మార్చి నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో నిర్వాహకులు వేతనాలు ఇవ్వలేదు. కుటుంబ పోషణ భారం కావడంతో నా బాల్యమిత్రులు నవీన్‌, సురేశ్‌, రాజేశ్‌ అండగా నిలిచారు. అంతేకాకుండా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించారు. మక్తల్‌లో ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నాను.

- వెంకట్‌, మద్దూరు

బంధువుల తోడ్పాటు..

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తుండగా.. కరోనా వచ్చి ఉపాధి పోయింది. ఈ గడ్డు పరిస్థితుల్లోనే గర్భవతిగా ఉన్న నా భార్యకు గడువుకు ముందే నొప్పులు మొదలయ్యాయి. నెల రోజులపాటు పట్టణంలోని ఆసుపత్రిలో ఉంటూ తల్లీబిడ్డలను బతికించుకునేందుకు రూ.7 లక్షల వరకు ఖర్చయ్యాయి. కుటుంబ పోషణకు దారిలేని స్థితిలో ఉన్న నాకు మా బంధువు హరిబాబు సంపూర్ణ సహకారం అందించారు. ఆయనతోపాటు కుటుంబికులు తోడుగా నిలవడంతో చెప్పుల దుకాణం పెట్టుకున్నాను. బడులు తెరవకున్నా.. దుకాణం ద్వారా ఉపాధి పొందుతున్నా.

- కెంచె నర్సింహులు, ధన్వాడ

కిరాణం కొట్టు ద్వారా..

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న తరుణంలోనే కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ఉపాధి లేకుండా పోయింది. గతంలో నా భార్య కోసమంటూ ఇంటి వద్ద చిన్నపాటి కిరాణ కొట్టు పెట్టాను. ఆమె గర్భవతి కావడంతో దాన్ని అయిదు నెలల కిందటే మూసివేశాను. కరోనా మొదలైన రెణ్నెల్లపాటు ఎదురుచూసి ఇక పాఠశాలలు తెరవరన్న ఉద్దేశంతో కొట్టును పునఃప్రారంభించాను. దీన్ని మరింత విస్తరిస్తున్నాను.

- హెచ్‌.నర్సింహ, బిజ్వార్‌

భజన బృందం సభ్యుడి అండతో..

మరికల్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేసేది. కొవిడ్‌ కారణంగా ఉద్యోగం పోయింది. గతంలో సెలవుల సందర్భంగా కులవృత్తి ఆదుకునేది. వివిధ కారణలతో డబ్బా పూర్తిగా శిథిలమై పనికిరాకుండా పోవడంతో కుటుంబ పోషణ పరంగా ఇబ్బందులు తలెత్తాయి. మా భజన బృందం సభ్యుడు అండగా నిలిచాడు. దీంతో కొత్త డబ్బా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం కులవృత్తి ద్వారా ఉపాధి పొందుతూనే కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఇంటి వద్ద విద్యార్థులకు ట్యూషన్‌ చెబుతున్నా.

- అశ్విని నర్సింలు, ధన్వాడ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top